చదువులు ఆగం!

ABN , First Publish Date - 2022-01-20T06:42:33+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా చదువులు ఆగమైపోతున్నాయి. పాఠశాలల మూతతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. రెండేళ్లుగా కరోనా వైరస్‌ విజృంభించడంతో ఆశించిన స్థాయిలో తరగతుల నిర్వహణ జరగడంలేదు.

చదువులు ఆగం!

కరోనా వ్యాప్తితో పాఠశాలలకు సెలవులు 

అటకెక్కిన చదువులు, ఆటల వైపు విద్యార్థులు 

ఆన్‌లైన్‌ చదువుల షెడ్యూల్‌ కరువు 

సెలవుల పొడిగింపును వ్యతిరేకిస్తున్న పలువురు

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 19: కరోనా వైరస్‌ కారణంగా చదువులు ఆగమైపోతున్నాయి. పాఠశాలల మూతతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. రెండేళ్లుగా కరోనా వైరస్‌ విజృంభించడంతో ఆశించిన స్థాయిలో తరగతుల నిర్వహణ జరగడంలేదు. సుమారు ఏడాదిన్నర విరామం తర్వాత 2021 సెప్టెంబరులో విద్యాసంస్థలు ప్రారంభంకాగా మూడు నెలలైనా చదువులు సరిగా సాగకపోగా తిరిగి కరోనా మూడో వేవ్‌ ప్రభావంతో మళ్లీ విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రత్యక్ష తరగతులు సవ్యంగా సాగుతూ విద్యార్థులు గాడిలో పడుతున్న సమయంలో ప్రభుత్వం కరోనా ప్రభావం పేరుతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంపై విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

వరుస సెలవులు..

సెప్టెంబరులో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాగా అక్టోబరులో దసరా సెలవులు తర్వాత నవంబరు వరకు ప్రత్యక్ష తరగతులు అంతంతమాత్రంగానే కొనసాగాయి. డిసెంబరు నెల పూర్తిగా ఉపాధ్యాయుల జోనల్‌ కేటాయింపులకే పరిమితం అయింది. దీంతో దాదాపు రెండు నెలలుగా ప్రత్యక్ష విద్యాబోధన జరగలేదు. సంక్రాంతి సెలవుల అనంతరం విద్యార్థులు పూర్తిగా చదువుపై దృష్టిపెట్టి అవ కాశాలు ఉండగా ప్రభుత్వం ప్రకటించిన సెలవులతో విద్యార్థులు చదువుకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులపై తుదినిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.

రెండు నెలల పాటు సవ్యంగా చదువులు..

2020 మార్చిలో కరోనా తీవ్ర ప్రభావంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. దాదాపు ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తర్వాత గత సెప్టెంబరు 1న ప్రభు త్వం ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబరులో ప్రత్యక్ష తరగతులు ప్రారరంభం అయిన విద్యార్థులు కరోనా ప్రభావం భయం వల్ల మెల్లిమెల్లిగా పాఠశాలలకు వచ్చారు. అక్టోబరు, నవంబరులో మొత్తం రెండు నెలల పాటు ప్రత్యక్ష తరగతులు సవ్యంగానే సాగా యి. డిసెంబరు నెల మొదటి వారం నుంచి నూతన జోన ల్‌ వ్యవస్థ వల్ల ఉపాధ్యాయుల కేటాయింపు మొదలుకాగా ఉపాధ్యాయులు చాలామంది పాఠశాలలకు వెళ్లలేదు. జనవరి 2022 మొదటి వారంలో జిల్లాల కేటాయింపులు పూర్తికాగా 317 జీవో వల్ల నష్టపోయామంటూ ఉపాధ్యాయులు ఆందోళనబాట పట్టారు. కరోనా ప్రభావంతో షెడ్యూల్‌కంటే ముందే ప్రభుత్వం జనవరి 6వ తేది నుంచి 16 వరకు సుమారు 12 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. 2021 సెప్టెంబరులో ప్రారంభమైన విద్యాసంస్థలకు నిజానికి రెండు నెలల పాటే తరగతులు జరిగాయి.

పూర్తికాని పదో తరగతి సిలబస్‌..

ఇతర తరగతుల విద్యార్థుల సంగతి ఎలా ఉన్నా పదో తరగతి విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కరోనా ప్రభావంతో ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. సెప్టెంబరులో తరగతులు ప్రారంభంకాగా డిసెంబరు వరకు కొంతమేర సిలబస్‌ పూర్తయింది. జనవరి నుంచి అయినా సవ్యంగా తరగతులు జరిగితే పూర్తి సిలబస్‌ పూర్తయ్యే అవకాశం ఉండగా వరుస సెలవులతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి కూడా దాదాపు అదేవిధంగా ఉంది. ఆన్‌లైన్‌ పాఠాలు అంతంతమాత్రంగానే అర్థం కాగా ఇటీవల నిర్వహించిన ఇంటర్‌ ఫలితాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఆన్‌లైన్‌ చదువులపై అదే ఫలితాలు పునఃరావృతం అయ్యే అవకాశాలు ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

ఆటపాటలవైపు విద్యార్థుల చూపు..

వరుస సెలవులు, ఆన్‌లైన్‌ తరగతులు లేకపోవడంతో విద్యార్థులు చదువులు వదిలి ఆటపాటలవైపు చూస్తు న్నారు. విద్యార్థులు గ్రామచావిడిల వద్ద ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు. వ్యవసాయ పనులతో నిత్యం బిజీగా ఉండే గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు తమ పిల్లలు పూర్తిగా చదువుకు దూరమవుతుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు విద్యార్థులకు కొన్ని అసైన్‌మెంట్‌లు ఇస్తున్నా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రం చదువులు పూర్తిగా విద్యార్థులకు దూరం అవుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో తల్లిదండుల్రు విద్యార్థులకు ట్యూషన్‌, ఇతర మాద్యమాల ద్వారా చదువులవైపు దృష్టిపెట్టేలా చూస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు మాత్రం పూర్తిగా చదువులకు దూరమవుతున్నారు.  గ్రామాల్లో సరిగా కరెంటు లేక, స్మార్ట్‌ఫోన్‌ సౌకర్యం లేక గత విద్యాసంవత్సరం పూర్తిగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులంటే పేదవారికి ఇబ్బందులు కలిగించే అంశమే కావడంతో ప్రత్యక్ష తరగతులే ఉంటే బాగుంటుందని వారు కోరుతున్నారు. 

సెలవుల పొడిగింపుపై భిన్నాభిప్రాయాలు.

ఇప్పటికే చదువులకు దూరమైన విద్యార్థులలో విద్యాప్రమాణాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఇప్పుడిప్పుడే చదువులకు దగ్గరవుతున్న విద్యార్థులను సెలవులతో ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులకు దూరం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్‌ విద్యాసంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలతో ఉపాధ్యాయు ల్లో నెలకొన్న ఆందోళనలు పెరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు షెడ్యూల్‌కంటే ముందే సంక్రాంతి సెలవులు ప్రకటించిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళనకు దిగగా సంక్రాంతి తరువాత కరోనాతో సెలవులు పొడిగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మార్కెట్‌లు, షాపింగ్‌మాల్స్‌, థియేటర్లు, పెళ్లిల్లు, ఫంక్షన్‌లు, బార్లు, రెస్టారెంట్‌లు ఇలా అనేకచోట్ల జనాలు గుం పులు గుంపులుగా తిరుగుతున్నా రాని కరోనా కేవలం విద్యాసంస్థలలో కరోనావ్యాప్తి పేరుతో విద్యాసంస్థల సెలవులు పొడిగించడం ఏమిటని తల్లిదండ్రులు, ప్రైవేట్‌ విద్యాసంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా విద్యార్థులు రాక ప్రైవేట్‌ విద్యాసంస్థలు పూర్తిగా అప్పుల ఊబిలోకి వెళ్లాయని జనవరి 30 తర్వాత పాఠశాలలు ప్రారంభించకపోతే తామే విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలను ప్రారంభించనున్నట్లు ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి.

పాఠశాలలను వెంటనే తెరవాలి..

ఫ నిరంజన్‌ గౌడ్‌, పేరెంట్‌

గత విద్యాసంవత్సరం పూర్తిగా కరోనా వల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఇప్పుడు కేవలం రెండు నెలలపాటు పాఠశాలలు తెరుచుకోగా.. ఇప్పుడు కరోనా వల్ల మళ్లీ పాఠశాలలు మూసివేయడం సరైంది కాదు. విద్యార్థులు చదువుకు దూరమై ఇతర వ్యాపకాలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే పాఠశాలలను తెరవాలి.

మూసివేత దిశగా ప్రైవేటు పాఠశాలలు..్చ

ఫ  జయసింహా గౌడ్‌, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు

కరోనా వల్ల ఈ విద్యాసంవత్సరం కూడా ఆలస్యంగా తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు రాక.. ఫీజులు చెల్లించక అనేక ప్రైవేటు పాఠశాలలు మూసివేతకు గురయ్యాయి. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న అనేక మంది కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయారు. సెలవులతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

Updated Date - 2022-01-20T06:42:33+05:30 IST