వ్యూహాలు మాని, పని చూడండి

ABN , First Publish Date - 2021-04-23T05:40:50+05:30 IST

కల్లోల జలాల్లో చేపలు పట్టడం అనేది ఇంగ్లీషు వాడుక. తెలుగులో కూడా సమానార్థక జాతీయాలు ఉన్నాయి. అందరికీ కష్టం కలిగిస్తున్న పరిస్థితులను...

వ్యూహాలు మాని, పని చూడండి

కల్లోల జలాల్లో చేపలు పట్టడం అనేది ఇంగ్లీషు వాడుక. తెలుగులో కూడా సమానార్థక జాతీయాలు ఉన్నాయి. అందరికీ కష్టం కలిగిస్తున్న పరిస్థితులను స్వార్థానికి, లాభానికి ఉపయోగించుకోవడం అన్నది ఆ వాడుకకు అర్థం. స్వార్థం ఏదయినా కావచ్చు. ప్రాణవాయువు కోసం, ఆస్పత్రిలో చికిత్సల కోసం, అత్యవసర ఔషధాల కోసం హాహాకారాలు, ఆర్తనాదాలు వినిపిస్తుంటే, వాటికి కొరత సృష్టించి హెచ్చు ధరలకు అమ్ముకునే ప్రబుద్ధులను చూస్తున్నాము, అది ఆర్థిక స్వార్థం. ఇక రాజకీయ లాభం చూసుకునే పెద్దలూ ఉంటారు. ఆ రాజకీయ లబ్ధిని పొందే క్రమంలో వాళ్లు ఉచ్చం నీచం కూడా మరచిపోతారు. దురదృష్టవశాత్తూ, వారు మన నాయకులై ఉంటారు. చెయ్యెత్తు కుమారుడు, పాత్రికేయుడు చనిపోయి గర్భశోకంలో ఉన్న మార్క్సిస్టు పార్టీ నాయకుడు సీతారాం ఏచూరికి బిహార్ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు మిథిలేశ్ కుమార్ తివారీ పలికిన ఉపశమన వాక్యాలు చూడండి. చైనా మద్దతుదారుడైన ఏచూరి, వైరస్ ఉపద్రవానికి కారకుడు అన్న అర్థం వచ్చే విధంగా ఆ తివారీ తన సంస్కారాన్ని చాటుకున్నారు. ట్విట్టర్‌లో వ్యక్తమయిన తివారీ వ్యక్తిత్వాన్ని సామాజిక మాధ్యమాలలో అంతా ఛీ కొట్టారు. ఆయన పార్టీ సహచరులు కూడా అనేకులు ఆ అసందర్భ ప్రలాపాన్ని అసహ్యించుకున్నారు. 


వైరస్ అన్నది శరీరానికే కాదు, బుద్ధికి కూడా సోకుతుంది. విభేదాలు మరచి కలసికట్టుగా మానవీయ ఉపద్రవాన్ని ఎదుర్కొనవలసింది పోయి, ఎదుటివారిని అణచివేయడానికి ఈ సందర్భం ఎట్లా పనికివస్తుందా అని ఆలోచించేవారి మెదడు ప్రమాదకరం. దేశరాజధానిలో ప్రాణవాయువు కొరత ఉన్నది. ఆస్పత్రుల కొరత ఉన్నది. ఉన్న అధికారాలన్నిటినీ కేంద్రం లాగేసుకున్నది. ఆక్సిజన్ కేంద్రం గుప్పిట్లోనే ఉన్నది. తనది ప్రతిపక్ష ప్రభుత్వం కాబట్టే, ఇంతగా ఇబ్బందిపెడుతున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటున్నారు. ఆయన్ని విశ్వసిద్దామా? ఇటువంటి తరుణంలో రాజకీయ ఆరోపణలు చేయడం ఏమిటని విసుక్కుందామా? కేంద్రప్రభుత్వానికి అటువంటి దురుద్దేశాలు ఉండవని నమ్మకంగా ఉండగలమా? ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. శిబిరాలు వేసుకున్నారు. దేశరాజధానికి ఆవశ్యకమైన సరఫరాల రవాణాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదే? వారు ఏ రకమైన రవాణానీ నిరోధించడం లేదే? అత్యవసరాల రవాణా జరుగుతోందంటే, రైతులు వాహనాలకు తివాచీలు పరిచి నగరంలోకి పంపుతారే! మరి, ఆక్సిజన్, ఔషధ రవాణాకు ఉద్యమశిబిరాలు ఆటంకం అవుతున్నాయని ప్రచారం మొదలుపెట్టారెందుకు? అంటే, ఈ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఉపయోగించుకుని రైతు ఉద్యమాన్ని తుడిచిపెట్టే ఆలోచన ఏదో ఉండి ఉండాలి. అదే తరహాలో, కేజ్రీవాల్‌ను కూడా అప్రదిష్ట పాలు చేసి, తప్పించాలనే ఆలోచన ఉందా? 


నాసిక్‌లో జరిగింది ప్రమాదమే. ఇటువంటి సందర్భాలలో ఉండకూడని అలక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదం. ఆక్సిజన్ కొరత అనేక మరణాలకు దారితీయవచ్చునన్న అవగాహన యావత్ యంత్రాంగానికి ముందే ఉండాలి. ప్రాణవాయు నిర్వహణ వ్యవస్థల పనితీరును సమీక్షించడం, ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకోవడం జరగాలి. అట్లా జరగలేదు. ఆస్పత్రి స్థానికసంస్థ నిర్వహణలో ఉన్నది. ప్రాణవాయు నిర్వహణ మాత్రం ప్రైవేటు సంస్థ చేతిలో ఉన్నది. నాసిక్ విషాదాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన ఆధారంగా రాజకీయాలు చేయవద్దు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా అభ్యర్థించారు. నిజానికి రాజకీయ లబ్ధి పొందే అవకాశం ఠాక్రేకే ఉన్నది. నాసిక్ నగరపాలక సంస్థ బిజెపి అధీనంలో ఉన్నది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమి ప్రతిపక్ష బిజెపిని నిందించవచ్చు. కానీ, మహారాష్ట్ర ఎదుర్కొంటున్న కొవిడ్ సంక్షోభంలో కేంద్రప్రభుత్వం తగినంతగా సాయం చేయడంలేదన్న అనుమానం అక్కడి అధికార కూటమికి ఉన్నది. టీకాల కొరత గురించి ఈ మధ్యనే మహారాష్ట్రకు కేంద్రానికీ మధ్య మాటల యుద్ధం జరిగింది. టీకాల వేగం పెంచుదామంటే నిల్వలు ఉండడం లేదని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి అన్నారు. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో మహారాష్ట్ర పనితీరు ఏమంత గొప్పగా లేదని, క్వారంటైన్ నిబంధనలను స్వార్థ ప్రయోజనాల కోసం సడలించిందని కేంద్ర ఆరోగ్యమంత్రి ఎదురు దాడిచేశారు. ఈ రకమైన వాగ్వాదాలు వైద్యసదుపాయాల కొరత కృత్రిమంగా ఏర్పడుతున్నదా అన్న అనుమానాలకు దారితీస్తాయి. అయితే, కేంద్రం నుంచి టీకాల సరఫరా జాప్యం జరుగుతున్నదని విమర్శించిన రాష్ట్రాలలో ప్రతిపక్షపార్టీలు అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మూడో దశ టీకాలను హెచ్చు ధరలు ఇచ్చి కొనుక్కోమని చెప్పినందుకు ప్రతిపక్ష రాష్ట్రాలు ఇప్పుడు కొత్త కత్తులు నూరుతున్నాయి.


ఏం చేస్తున్నారు, దేశం ఇంత విపత్తులో ఉంటే చోద్యం చూస్తున్నారా అని సుప్రీంకోర్టు అక్షింతలు వేసేసరికి, కేంద్రం అప్రమత్తం కాక తప్పడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నాడు కొవిడ్ సన్నివేశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం, ఆయన బెంగాల్ ప్రచార పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న రీత్యా ఇతర పార్టీలు కూడా అక్కడ ప్రచారాన్ని కుదించుకున్నాయి. అన్నీ సక్రమంగా ఉండి, అమలులో సమస్యలు ఉన్నప్పుడు, వాటిని సవరించడానికి సమీక్షలు పనికివస్తాయి. విధానపరమైన నిర్ణయాలే సమస్యలకు దారితీసినప్పుడు, తక్షణం జరగవలసినది దిద్దుబాటు చర్యలే. ఆక్సిజన్ కొరతను యుద్ధప్రాతిపదిక మీద పరిష్కరించడం మొదటి అవసరం. దేశంలో ఉన్న ఉత్పత్తి అవకాశాలు, రవాణా అవకాశాలు ఉపయోగించుకున్నా కూడా కొరత తప్పదు. దాన్ని ఆగమేఘాల మీద ఎట్లా నివారించాలి అన్నది ప్రశ్న. వైద్యవ్యవస్థను మొత్తంగా అత్యవసర ప్రాతిపదిక మీద విస్తరించడం ఎట్లా అన్నది మరొక సవాల్. రాజకీయ ఆలోచనలనుంచి మనసు మరలించుకుని, శీఘ్ర పరిష్కారాల కోసం ప్రయత్నిస్తే ఫలితం ఉండవచ్చు. లేకపోతే, ఇప్పటికే ఎంతో దిగజారిపోయిన కేంద్రప్రభుత్వ ప్రతిష్ఠ, మరింతగా అడుగంటవచ్చు. ప్రభుత్వ యం త్రాంగం మీద విశ్వాసం ఉండడం కూడా ప్రస్తుత అవసరం. కానీ, విశ్వాస సంక్షోభానికి నాయకులే కారకులైతే?

Updated Date - 2021-04-23T05:40:50+05:30 IST