27దాకా ఆపండి

ABN , First Publish Date - 2020-08-15T09:46:01+05:30 IST

రాజధాని అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు హైకోర్టు మరోసారి బ్రేకు వేసింది. యఽథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలన్న గత ఉత్తర్వులను ఈ నెల 27వ తేదీ దాకా పొడిగించింది. ఈ ఉత్తర్వుల వల్ల ఇరుపక్షాలకూ

27దాకా ఆపండి

  • కార్యాలయాల తరలింపుపై స్టేట్‌సకో పొడిగింపు
  • ఎత్తివేయాలంటూ సర్కారు  అభ్యర్థన
  • ఈ ఉత్తర్వులతో ఏమీ చేయలేకపోతున్నాం
  • సీఎం ఆఫీసు కూడా పెట్టలేకపోతున్నాం
  • రాజధానిని ఇప్పుడు తరలించడం లేదు
  • ఇతరత్రా పనులకు అనుమతి ఇవ్వండి
  • స్టేటస్‌కోతో ఇరుపక్షాలకూ నష్టమే: ప్రభుత్వం


అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు హైకోర్టు మరోసారి బ్రేకు వేసింది. యఽథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలన్న గత ఉత్తర్వులను ఈ నెల 27వ తేదీ దాకా పొడిగించింది. ఈ ఉత్తర్వుల వల్ల ఇరుపక్షాలకూ నష్టమేనని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టలేకపోతున్నామని.. స్టేటస్‌కో ఎత్తేయాలని రాష్ట్రప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు తదితర రాజధాని సంబంధిత అంశాలపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ధర్మాసనం ముందు మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపించారు. కార్యాలయాల తరలింపునకు సంబంధించి 4వ తేదీన ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులను పొడిగించవద్దని అభ్యర్థించారు. ఆ ఆదేశాలతో తాము ఏ కార్యక్రమాన్నీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆఖరికి సీఎం క్యాంపు ఆఫీసును కూడా మేం అనుకున్న చోట ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేకపోయిందని తెలిపారు. రాజధానిని ఇప్పుడు తరలించడం లేదని, కావాలంటే దాని తరలింపుపై స్టేట్‌సకో పొడిగించి... ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్టేటస్‌ కో ఉత్తర్వులతో ఇరుపక్షాలకూ నష్టమేనని, అభివృద్ధి పనులన్నీ నిలిపేయాల్సి వచ్చిందని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం అన్నారు. ఉత్తర్వులు పొడిగించాలా వద్దా అనే అంశంపై విచారణ జరపాలని కోరారు. 27 నుంచి రోజువారీ కేసును విచారించాలని సీఆర్‌డీఏ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి కోరారు. 


ఆ చట్టాలనే సస్పెండ్‌ చేయండి

పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది మోహన్‌ పరాశరన్‌ వాదనలు వినిపిస్తూ.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఒక రాజధాని గురించి మాత్రమే చెబుతోందని, మూడు రాజధానుల గురించి ప్రస్తావించలేదని చెప్పారు. రాజధాని నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై స్టేటస్‌ కో ఇవ్వడానికి బదులు.. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించిన చట్టాలను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాధ్‌, ఉన్నం మురళీధరరావు తదితరులు అభ్యర్థించారు. విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా న్యాయవాదుల వాదనలపై స్పష్టత లేకపోయింది. దీంతో పలువురు సీనియర్‌ న్యాయవాదుల సూచన మేరకు ధర్మాసనం విచారణను 27కు వాయిదా వేసింది.


కొందరి కోసమే అమరావతి: ప్రభుత్వం

కేంద్రప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ సిఫారసులను పట్టించుకోకుండా నాటి రాష్ట్రప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని, కొందరు వ్యక్తుల ప్రయోజనం కోసమే ఆ నిర్ణయం తీసుకుందని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ మేరకు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘పాలనా వికేంద్రీకరణ జరగాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టం చేసింది. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి మధ్య దేశ ఆహార అవసరాలను ఒక్క శాతం మేర తీర్చే వ్యవసాయ భూములున్నాయి. అందువల్ల ఇక్కడ రాజధాని ఏర్పాటు సరి కాదని కూడా చెప్పింది. రాష్ట్రం మధ్యలో ఉందన్న కారణంతో ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు సరికాదని కూడా స్పష్టం చేసింది’ అని అందులో పేర్కొంది.

Updated Date - 2020-08-15T09:46:01+05:30 IST