నిధులు కొరతతో ఆగిన నాడు - నేడు పనులు

ABN , First Publish Date - 2021-02-25T03:22:46+05:30 IST

మండలంలోని పలు పాఠశాలల్లో చేపట్టిన నాడు, నేడు పనులు నిధుల కొరతతో నిర్మాణాలు సాగించలేక మొండి గోడలు, పూతకు నోచుకోక దర్శనమిస్తున్నాయి.

నిధులు కొరతతో ఆగిన నాడు - నేడు పనులు
పెనుబల్లిలో జడ్పీ హైస్కూల్‌

విద్యార్థులే బేల్దారులుగా చేపడుతున్న నిర్మాణాలు


బుచ్చిరెడ్డిపాళెం, ఫిబ్రవరి 24: మండలంలోని పలు పాఠశాలల్లో చేపట్టిన నాడు, నేడు పనులు నిధుల కొరతతో నిర్మాణాలు సాగించలేక మొండి గోడలు, పూతకు నోచుకోక దర్శనమిస్తున్నాయి. పెనుబల్లి జడ్పీ హైస్కూల్లో మొండి గోడలతో ఉన్నా.. అత్యవసరంగా చేపట్టాల్సిన నిర్మాణ పనులను ఆ స్కూల్లో 9వ తరగతి విద్యార్థులే బేల్దారుల అవతారమెత్తి  గోడలు, ప్లాట్‌ఫారంల నిర్మాణాలు చేపడుతుండడం విశేషం. మండలంలో నాడు - నేడు పనులకు మొత్తం 19 పాఠశాలలు ఎంపిక కాగా.. వాటి నిర్మాణాలకు రూ.4.50కోట్ల నిధులు అంచనా వేశారు. ఇప్పటి వరకు రివాల్వింగ్‌ నిధులు కింద రూ.2కోట్ల 60లక్షలు ఖర్చుకాగా.. వాటికి ప్రభుత్వం బిల్లులు కూడా సమకూర్చింది. అయితే పెయింటింగ్‌, బెంచీలు, కుర్చీలు, ఇంగ్లీష్‌ ల్యాబ్‌ తదితర పనులు సమకూర్చాల్సి ఉంది. వీటిలో పెనుబల్లి జడ్పీ హైస్కూల్‌కు రూ.23లక్షలు నిధులు మంజూరై పలు నిర్మాణాలు పూర్తికాగా, ఇంకా కొన్ని నిర్మాణాలు పూర్తికాలేదు. అయితే ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండానే ఎస్టిమేషన్‌ తయారు చేసి హైస్కూల్‌కు అవసరమైన పనులు చేసుకోమని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పలు నిర్మాణాలు పూర్తయిన తర్వాత తమను తప్పుబట్టినట్లు పెనుబల్లి హైస్కూల్‌ హెచ్‌ఎం ఫణీష్‌కుమార్‌ తెలిపారు.  దీంతో విద్యార్థులే  బేల్దార్ల అవతారమెత్తి ఆగిన నిర్మాణ పనులను చేపడుతుండడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే రూ.3లక్షల మేర అప్పుచేసి నిర్మించిన పనులకు తోడు మళ్లీ అప్పుచేసి నిర్మాణాలు చేపడితే నిధులు మంజురవుతాయో.. లేదోనని హెచ్‌ఎం ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో  పెనుబల్లి స్కూల్లో కొరవడిన నిర్మాణాలకు రూ.7లక్షల మేర అంచనాలతో నివేదిక పంపినట్లు హెచ్‌ఎం తెలిపారు. 


దారి మళ్లిన ఫర్నిచర్‌ నిధులు

హైస్కూల్‌ విధ్యార్థులకు అవసరమైన ఫర్నిచర్‌ ఫండ్‌ మంజూరు చేయాల్సి ఉంది. అయితే ఎస్టిమేషన్‌లో లేని పనులు చేపట్టారన్న కారణంగా నాడు - నేడు అధికారులు స్కూల్లో విద్యార్థులు కూర్చునేందుకు మంజూరు చేయాల్సిన ఫర్నిచర్‌ ఫండ్‌ను దారి మళ్లించారు. దీంతో విద్యార్థులు కూర్చునేందుకు 90 బెంచీలు అవసరం కాగా వాటిని 60 బెంచీలకు కుదించి మిగిలిన 30 బెంచీల నిధులు భవన నిర్మాణాల పనుల ఖాతాకు మళ్లించినట్లు సమాచారం. ఈ విషయంపై ఎంఈవో దిలీప్‌కుమార్‌ను వివరణ కోరగా నిధులు మంజూరు జాప్యం కావడం వల్ల నిర్మాణాలు పలుచోట్ల ఆగినట్లు తెలిపారు. నిధులు మంజూరు కాగానే మరో నెలలోపు నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు.



Updated Date - 2021-02-25T03:22:46+05:30 IST