టెలీమెడిసిన్‌కు బ్రేక్‌!

ABN , First Publish Date - 2021-09-13T04:25:22+05:30 IST

టెలీమెడిసిన్‌కు బ్రేక్‌!

టెలీమెడిసిన్‌కు బ్రేక్‌!
హీరాపురం సబ్‌సెంటర్‌లో మూలకు చేరిన మిని ఏటీఎంలు

నిలిచిన ‘ఇ- వైద్యం’ సేవలు

ఇ-సబ్‌ సెంటర్లలో మూలకు చేరిన ఏటీఎంలు

(మెళియాపుట్టి)

గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందజేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇ-వైద్యం’ అటకెక్కింది. అప్పట్లో గ్రామ స్థాయిలోని సబ్‌ సెంటర్లనే ఇ-సబ్‌ సెంటర్లుగా మార్చారు. స్టాఫ్‌నర్స్‌ను నియమించి రోగులకు  టెలీమెడిసిన్‌ ద్వారా మెరుగైన వైద్యం అందజేసేలా ఏర్పాట్లు చేశారు. ఇ-సబ్‌ సెంటర్లకు వచ్చిన బాధితులతో స్టాఫ్‌నర్సు మాట్లాడి.. ఆ వివరాలను ఆన్‌లైన్‌లోనే ప్రముఖ వైద్యులకు పంపేవారు. అనంతరం వైద్యుడు సూచించే మందులను సబ్‌సెంటర్‌లో ఉన్న ఎనీ టైమ్‌ మెడిసిన్‌(ఏటీఎం) మిషన్‌ ద్వారా బాధితులకు అందజేసేవారు. వైద్యాన్ని నాడు మారుమూల పల్లెలకు, గిరిజన గ్రామాలకు చేరువ చేసిన ఇ-సబ్‌ సెంటర్లు.. నేడు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. అందులోని ఏటీఎంలు మూలకు చేరాయి. సిబ్బంది కూడా లేక మూతపడ్డాయి. జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 220 కేంద్రాల్లో ‘ఇ-వైద్యం’ సేవలు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సబ్‌సెంటర్‌లో సుమారు 8 లక్షలు విలువ చేసే పరికరాలను అమర్చారు.   కానీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. కొన్ని సబ్‌సెంటర్లలో నెట్‌వర్క్‌ సమస్య కారణంగా ప్రత్యేకంగా కేబుల్‌ ఏర్పాటు చేసినా ఫలితం లేకపోతోంది. అనేక కేంద్రాల్లో నెట్‌ సౌకర్యం కూడా లేకుండా ఏపీ ఫైబర్‌ నెట్‌ వైర్లను పీకి పడేశారు. నెట్‌ సౌకర్యం ఉంటేనే కంప్యూటర్‌ ద్వారా బాధితుడిని వీడియోకాల్‌లో డాక్టర్లు పరిశీలిస్తారు. ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తద్వారా తగిన మందులు సూచిస్తారు. నెట్‌ సౌకర్యం పోయాక మొత్తం ఈ వ్యవస్థే ఆగిపోయింది. టెలీమెడిసిన్‌ సేవలు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం.. ఇ-సబ్‌ సెంటర్ల నిర్వహణను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించి.. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగుల నియామకం చేపట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహణను గాలికొదిలేశారు. ఉద్యోగుల నియామకానికి సంబంధించి కాంట్రాక్ట్‌ గడువు కూడా ముగిసింది. మరోవైపు సిబ్బందికి నెలల తరబడి జీతాలు కూడా చెల్లించకపోవడంతో విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు.  పరికరాలన్నీ మూలకు చేరడంతో సేవలు నిలిచిపోయాయి. ఏజెన్సీలో కొండలపై నివసించే గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. తాజాగా వైసీపీ ప్రభుత్వం ఇ-సబ్‌ సెంటర్లనే వెల్‌నెస్‌ సెంటర్లుగా పేరు మారుస్తోంది. కొత్త పేరుతో పాత విధానాన్ని కొనసాగించనుంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం భవన నిర్మాణాలు చేపడుతోంది. కానీ ఇది ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో వేచిచూడాలి. ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని, ఇ-సబ్‌ సెంటర్లలో మెరుగైన సేవలు అందజేయాలని ప్రజలు కోరుతున్నారు. 


సేవలు లేవు

గతంలో ఇ-వైద్యం ద్వారా సేవలు అందేవి. ప్రస్తుతం కాంట్రాక్ట్‌ గడువు ముగియడంతో జిల్లాలో ఇ-వైద్య సేవలు నిలిచిపోయాయి.  

- జి.గణపతిరావు, వైద్యాధికారి, చాపర

 

Updated Date - 2021-09-13T04:25:22+05:30 IST