ఆగిన ‘ఆక్సిజన్‌’

ABN , First Publish Date - 2021-05-04T07:52:23+05:30 IST

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో 200 పడకలు ఉన్నాయి. అన్నీ కొవిడ్‌ బాధితులతో నిండిపోయాయి. ఇందులో సుమారు 50 మంది ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో 6 టన్నుల

ఆగిన ‘ఆక్సిజన్‌’

హిందూపురంలో 8 మంది మృతి

కొవిడ్‌ ఆస్పత్రిలో మృత్యుఘోష

ఖాళీ అయిన సెంట్రలైజ్డ్‌ ప్లాంట్‌

50 మందికి ఆక్సిజన్‌పై చికిత్స

ప్రాణవాయువు అందక విలవిల

మరణించింది ముగ్గురే అని అధికారుల ప్రకటన


ప్రాణవాయువు అందక ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం ఆస్పత్రిలో ‘ఆక్సిజన్‌’ అందక కొవిడ్‌ బాధితుల ప్రాణాలు కొట్టుమిట్టాడాయి. బాధితుల కథనం ప్రకారం... ఆక్సిజన్‌ అందక ఎనిమిది మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆక్సిజన్‌ అయిపోవడం నిజమేనని అధికారులు కూడా అంగీకరించారు. అయితే... ఈ కారణం వల్ల ముగ్గురు మాత్రమే మరణించారని, మిగిలిన వారు వ్యాధి తీవ్రతతో చనిపోయారని తెలిపారు. 


హిందూపురం టౌన్‌, మే 3: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో 200 పడకలు ఉన్నాయి. అన్నీ కొవిడ్‌ బాధితులతో నిండిపోయాయి. ఇందులో సుమారు 50 మంది ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో 6 టన్నుల సామర్థ్యమున్న ఆక్సిజన్‌ ప్లాంటు ఉంది. ఇక్కడి నుంచే ‘సెంట్రలైజ్డ్‌’ పద్ధతిలో ఐసీయూలోని పడకలకు ఆక్సిజన్‌ అందుతుంది. అయితే... సోమవారం తెల్లవారుజామున ప్లాంటులో ఆక్సిజన్‌ ఖాళీ అయిపోయింది. దీంతో ఉదయం 6.30 గంటల వరకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సంబంధిత సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో కొవిడ్‌ బాధితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు విడిచారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆస్పత్రి వైద్యాధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


ఆక్సిజన్‌ అందకపోవడంతో ప్రాణాలు పోయినట్లు మృతుల బంధువులకు సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. మృతుల బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యులు, అధికారుల నిర్లక్ష్యంవల్లే చనిపోయారంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వ విఫలమైందని నిందించారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరి కరోనా బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆందోళనతో అక్కడికి చేరుకున్నారు. తమ వారి ఆరోగ్య స్థితిపై అక్కడి డాక్టర్లతో ఆరా తీశారు. కొందరికి ఆక్సిజన్‌ అయిపోవడంతో... ఆసత్రిలో ఓ గదిలో ఉన్న సిలిండరును తీసుకొని వచ్చి బాధితుల బంధువులే బిగించారు. ఓవైపు మృతుల కుటుంబీకులు, బంధువులు, మరోవైపు చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితుల బంధువుల రాకతో ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు మృతుల బంధువులను ఓదారుస్తూనే... ఆందోళన విరమించేలా సర్దిచెప్పారు. 


బెంగళూరు నుంచి ఆక్సిజన్‌

‘ఆక్సిజన్‌’ విషాదంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. చిన్న ఆక్సిజన్‌ సిలిండర్ల ద్వారా బాధితులకు ప్రాణవాయువు అందించారు. అదే సమయంలో... బెంగళూరు నుంచి ఆగమేఘాల మీద తెప్పించి ప్లాంటులోని సిలిండర్‌ను నింపారు.  పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిషాంతి, అటవీశాఖ జిల్లా అధికారి జగన్నాథ్‌ సింగ్‌లు హిందూపురం కొవిడ్‌ ఆసుపత్రికి వచ్చి పరిస్థితి సమీక్షించారు.


ముగ్గురు మరణించారు

‘‘ఆక్సిజన్‌ అందకపోవడంవల్ల ముబారక్‌, రమేశ్‌, నంజేగౌడ్‌ అనే ముగ్గురు బాధితులు చనిపోయారు. మిగిలిన ఐదుగురి మరణానికి ఆక్సిజన్‌ అందకపోవడం కారణం కాదు. వారి పరిస్థితి ముందు నుంచే ఆందోళనకరంగాఉంది. ఆరోగ్యం విషమించినందునే వారు చనిపోయారు’’ అని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దివాకర్‌ అన్నారు. 


25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: బాలకృష్ణ 

ఆక్సిజన్‌ అందక 8మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-04T07:52:23+05:30 IST