ఆర్టీపీపీలో ఆగిన విద్యుదుత్పత్తి

ABN , First Publish Date - 2021-06-14T06:13:13+05:30 IST

ఆర్టీపీపీలోని 1650 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల 600 మెగావాట్ల యూనిట్‌ను శనివారం నిలిపివేశారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో విద్యుత వాడకం తగ్గి డిమాండ్‌ తగ్గినట్లు అధికారులు తెలిపారు.

ఆర్టీపీపీలో ఆగిన విద్యుదుత్పత్తి

ప్రారంభించిన వారానికే నిలిపివేత

తడిసిమోపెడు అవుతున్న సింక్రోనైజింగ్‌ ఖర్చులు

ఎర్రగుంట్ల, జూన 13: ఆర్టీపీపీలోని 1650 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల  600 మెగావాట్ల యూనిట్‌ను శనివారం నిలిపివేశారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో విద్యుత వాడకం తగ్గి డిమాండ్‌ తగ్గినట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు ప్రస్తుతం పవన విద్యుతతో పాటు సౌర విద్యుత కూడా బాగా ఉత్పత్తి అవుతుండటం,  వీటికన్నా  థర్మల్‌ విద్యుత యూనిట్‌ కాస్ట్‌ అధికంగా ఉండడంతో దానికి ప్రాధాన్యత తగ్గించారు. కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యుత వాడకం తగ్గి డిమాండ్‌ లేకపోవడంతో సుమారు నెల రోజుల పాటు ఆర్టీపీపీలోని అన్ని యూనిట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే జూన 5వ తేదీ శనివారం 600 మెగావాట్ల ప్లాంటును రన చేయాలని ఆదేశాలు రావడంతో ప్రారంభించారు. వారానికే విద్యుత డిమాండ్‌ తగ్గిందని నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో యూనిట్‌ను శనివారం ఆపివేశారు. తిరిగి ఎప్పుడు రన చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆగిపోయిన ప్లాంటును రన చేసేందుకు ఆయిల్‌ ఖర్చు రూ.50 లక్షలకు పైబడి అవుతున్నట్లు సమాచారం. బాయిలర్‌, టర్బైన్స పూర్తిగా కూల్‌ అయిన తర్వాత సింక్రోనైజింగ్‌ చేయాలంటే దీని వ్యయం రూ.కోటి ఉన్నా ఆశ్చర్యం లేదంటున్నారు. 2020 మార్చి నుంచి ఆర్టీపీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అన్ని యూనిట్లు ఆడిన సందర్భాలు చాలా తక్కువ. ఆడినా బొగ్గు కొరత వచ్చింది. దీంతో ప్లాంటు నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్లాంటులో సుమారు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నా డిమాండ్‌ లేక ఉత్పత్తిని నిలిపివేశారు.

Updated Date - 2021-06-14T06:13:13+05:30 IST