నిలిచిపోయిన రామకోటి స్తూపం పనులు

ABN , First Publish Date - 2022-05-31T05:37:26+05:30 IST

కొండగట్టు అంజన్న సన్నిధిలో చేపట్టిన రామకోటి స్తూపం పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయి.

నిలిచిపోయిన రామకోటి స్తూపం పనులు
అసంపూర్తిగా నిలిచిన రామకోటి స్తూపం

- మాస్టర్‌ప్లాన్‌లో తొలగించే అవకాశం

మల్యాల, మే 30: కొండగట్టు అంజన్న సన్నిధిలో చేపట్టిన రామకోటి స్తూపం పనులు  కొన్నాళ్లుగా నిలిచిపోయాయి. రూ.50లక్షల వ్యయ ప్రతిపాదనలతో 32 అడుగుల ఎత్తుతో గత ఏడాది మార్చి 9న ఆలయ సమీపంలో రామకోటి స్థూపం ఏర్పాటుకు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత భూమిపూజ చేశారు. గతేడాది జూన్‌ 4నాటికే పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసే విధంగా పనులను చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టగా ఏడాది దాటినా పనులు పూర్తి కాలేదు. రామకోటి స్థూపం నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రామకోటి స్థూపం వద్ద బద్రపరచడానికి ఇదివరకే తమిళనాడు నుంచి అయిదు కోట్ల రామనామ ప్రతులను తీసుకువచ్చారు. అయితే పనులు పూర్తికాకపోవడంతో పనులు పూర్తి చేస్తారా.. ఇలాగే నిలిచిపోతాయనే దానిపై సందిగ్దం నెలకొంది.

-రామకోటి స్తూపం పరిశీలించని ఎమ్మెల్సీ కవిత 

కొండగట్టులో అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం, రామకోటి స్థూపం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్సీ కవిత వాటిపై ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. కొండగట్టుకు వచ్చిన సందర్భంలో రామకోటి స్థూపం పనుల గురించి వాకాబు చేసి పలు సూచనలు ఇవ్వగా మే 21న కొండగట్టుకు వచ్చిన కవిత రామకోటి స్థూపం పనులను పరిశీలించక పోగా అధికారుల వద్ద కూడా పనుల గురించి వాకాబు చేయనట్లు తెలిసింది. అఖండ హనుమాన్‌ చాలీసా కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోయారు.  ఇటీవల యాదాద్రి ఆలయ అర్కిటెక్ట్‌ కొండగట్టులో పర్యటించి సీఎం రాక కోసం అవసరమైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించే ప్రక్రియ, వివరాలు నమోదు చేసుకొని వెళ్లారు. సీఎం కేసీఆర్‌ కొండగట్టులో పర్యటించే సమయంలో అభివృద్ధి ప్రణాళిక అమలులో భాగంగా కొండపైన ప్రధాన ఆలయం మినహ మిగితా నిర్మాణాలు తొలగిస్తారని రామకోటి స్థూపం కూడా తొలగించే అవకాశాలు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలోనే కవిత రామకోటి స్థూపం పనుల గురించి వాకాబు చేయనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై రామకోటి స్థూపం తొలగింపుపై స్పష్టత రావాల్సి ఉంది. రామకోటి స్థూపం తొలగిస్తే దాదాపు రూ.50లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లేనని పలువురు చర్చించకుంటున్నారు. అయితే నిలిచి పోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-31T05:37:26+05:30 IST