తుఫాన్‌ అలర్ట్‌

ABN , First Publish Date - 2021-12-03T06:15:05+05:30 IST

‘జవాద్‌’ తీవ్ర తుఫాన్‌ ఉత్తర కోస్తా దిశగా రానున్నది. ఇప్పటివరకు వున్న సమాచారం ప్రకారం విశాఖపట్నం-శ్రీకాకుళం మధ్య తీరం దాటనున్నది.

తుఫాన్‌ అలర్ట్‌

ఉత్తర కోస్తాలో తీరం దాటుతుందని వాతావరణ  కేంద్రం అంచనా

జిల్లాలో నేటి సాయంత్రం నుంచి వర్షాలు

రేపు తెల్లవారుజాము నుంచి అతిభారీ వర్షాలు

గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు

జిల్లాకు స్పెషలాఫీసర్‌గా శ్యామలరావు నియామకం

అధికార యంత్రాంగం అప్రమత్తం

నియోజకవర్గాలు, మండలాలకు ప్రత్యేక అధికారులు

అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు

అందరూ అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు

నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యాటక ప్రాంతాలు మూసివేత

వరి కోతలు మూడు రోజులు వాయిదా వేసుకోవలసిందిగా రైతులకు సూచన


విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

‘జవాద్‌’ తీవ్ర తుఫాన్‌ ఉత్తర కోస్తా దిశగా రానున్నది. ఇప్పటివరకు వున్న సమాచారం ప్రకారం విశాఖపట్నం-శ్రీకాకుళం మధ్య తీరం దాటనున్నది. ఈ విషయం వాతావరణ శాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వాన్ని ముందుగా అప్రమత్తం చేసింది. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచే వాతావరణం మారుతుంది. మధ్యాహ్నాం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. రాత్రికి వర్షాలతోపాటు గాలులు పెరుగుతాయి. శనివారం తెల్లవారుజాము నుంచి గాలుల తీవ్రత పెరగడంతోపాటు కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 


తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో వుండాలని కలెక్టర్‌ మల్లికార్జున ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. గురువారం ఉదయం జీవీఎంసీ కమిషనర్‌తో కలిసి మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌తోపాటు కిందనున్న లోతట్టు ప్రాంతాలను పరిశీలించి వరదలొస్తే తీసుకోవలసిన చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. కాగా జిల్లాలో కోతకు వచ్చిన వరి పంట విషయంలో రైతులను వ్యవసాయ శాఖ అప్రమత్తం చేసింది. మూడు రోజులపాటు కోతలు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలని, సముద్రంలో వున్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖను ఉన్నతాధికారులు ఆదేశించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ జిల్లాలో పర్యాటక ప్రదేశాలను మూసివేయనున్నారు. 


తుఫాన్‌ ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం వుందన్న ముందస్తు సమాచారంతో సీనియర్‌ అధికారి, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును ప్రభుత్వం  జిల్లాకు స్పెషలాఫీసర్‌గా నియమించింది. ఆయన గురువారం సాయంత్రం నగరానికి చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు. రిజర్వాయర్లు, చెరువుల్లో నిల్వలను అధికారులు సమీక్షించారు. 


జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు..

జిల్లాలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు భారీ నుంచి అతిభారీగా, కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు...అప్పుడప్పుడు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం ఉదయం నుంచి గాలుల వేగం ఇంకా పెరగవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. సెలవులో వున్నవారంతా వెంటనే విధులకు హాజరుకావాలని ఆదేశించారు.

- మండల, నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులుగా నియమితులైన వారంతా తక్షణం తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకుని తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలి.

- గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తహసీల్దార్‌, ఎంపీడీవోలు సచివాలయ సిబ్బందితో కలిసి అన్ని ఏర్పాట్లుచేయాలి.

- తుఫాన్‌ వల్ల మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ వ్యవస్థకు ఎటువంటి అంతరాయం కలగకుండా జనరేటర్‌లను సిద్ధం చేసుకోవలసిందిగా ఆపరేటర్లను ఆదేశించారు. 

- నిత్యావసర సరకులు, ఆయిల్‌, గ్యాస్‌ నిల్వలు తగినంత స్థాయిలో అందుబాటులో వుండే విధంగా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు.

- పరిశుభ్రమైన తాగునీటిని నిరంతరాయంగా ప్రజలకు అందించేలా పంచాయతీ, మునిసిపల్‌, జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. 

- ఇండియన్‌ నేవీ, కోస్టుగార్డు రెస్క్యూ టీములతోపాటు ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. 

- జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేశారు.


కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు

జిల్లా కలెక్టర్‌ కార్యాలయం: 0891- 25900102, 2750089, 2750090, 2560820

టోల్‌ఫ్రీ నంబరు: 1800-425-00002

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, పాడేరు: 9492159232

ఆర్డీవో కార్యాలయం, విశాఖపట్నం: 8332802101

ఆర్డీవో కార్యాలయం, అనకాపల్లి:   08924-223316, 8143631525

ఆర్డీవో కార్యాలయం, నర్సీపట్నం: 7075356563

మహా విశాఖ నగర పాలక సంస్థ: 1800-425-00009, 0891-2869106

ఎలక్ట్రికల్‌                       9440812492. 7382299975

మెడికల్‌                        8074088594

ఫైర్‌                           101, 0891-2563582

జిల్లా పంచాయతీ కార్యాలయం: 9885531079, 7013816205


విద్యుత్‌ శాఖ ముందస్తు చర్యలు

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రాంతాల్లో ముందుగానే సరఫరా నిలిపివేత

విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం వున్నందున విద్యుత్‌ సమస్యలు నివారించడానికి ముందస్తు ఏర్పాట్లు చేసినట్టు విశాఖపట్నం సర్కిల్‌ ఎస్‌ఈ సూర్యప్రతాప్‌ తెలిపారు. గంటకు 50 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రాంతాల్లో ముందుగానే విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా వర్షాలు, గాలులకు సరఫరాలో సమస్యలు ఏర్పడే సబ్‌స్టేషన్లు, ఫీడర్లను గుర్తించి, వెంటనే మరమ్మతులు చేయడానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. పడిపోయిన విద్యుత్‌ స్తంభాలను తొలగించడానికి, వెంటనే కొత్తవి వేయడానికి అవసరమైన క్రేన్లు, ఎక్స్‌కవేటర్లు, పరికరాలు, గ్యాస్‌ కట్టర్లు, పోర్టబుల్‌ డీజిల్‌ జనరేటర్లు సిద్ధం చేశామన్నారు. అంతేకాకుండా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడానికి జోన్లు, డివిజన్ల వారీగా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశామని వివరించారు.

సర్కిల్‌ ఆఫీసు, జోన్‌-1: 7392299975, జోన్‌ 2 ఆఫీసు: 9490610020, జోన్‌ 3 ఆఫీసు: 9491030721, అనకాపల్లి: 9963212475, నర్సీపట్నం: 9491030714, పాడేరు: 9490610026


నేడు, రేపు పలు రైళ్లు రద్దు

విశాఖపట్నం, డిసెంబరు 2: తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా శుక్ర, శనివారాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ప్రకటించారు.

శుక్రవారం (3న) రద్దయిన రైళ్లు:

పూరి-గుణుపూర్‌ (18417), భువనేశ్వర్‌-రామేశ్వరం (20896), హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నూమా (12703), పూరి-యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రథ్‌ (22883), హౌరా-యశ్వంత్‌పూర్‌ దురంతో (12245), భువనేశ్వర్‌-ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020), పురులియా-విల్లుపురం (22605), పూరి-తిరుపతి (17479), హౌరా-హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18045), హౌరా-చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), హౌరా-మైసూరు (22817), సంత్రాగచ్చి-చెన్నై (22807), డిఘా-విశాఖ (22873), హౌరా-యశ్వంత్‌పూర్‌ (12863), హౌరా-చెన్నై మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12839), పాట్నా-ఎర్నాకులం (22644), రాయగడ-గుంటూరు (17244), సంబల్‌పూర్‌-నాందేడు (20809), కూర్బా-విశాఖపట్నం (18517), ధన్‌బాద్‌-అలెప్పీ (13351), టాటా-యశ్వంత్‌పూర్‌ (12889), పూరి-అహ్మదాబాద్‌ (12843), భువనేశ్వర్‌-జగదల్‌పూర్‌ (18447), చెన్నై-హౌరా (12842), హైదరాబాద్‌-హౌరా (18046), చెన్నై-భువనేశ్వర్‌ (12849), యశ్వంత్‌పూర్‌-హౌరా దురంతో (12864), సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ (12704), తిరుపతి-పూరి (17480), యశ్వంత్‌పూర్‌-హౌరా (12864), సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17016), చెన్నై-హౌరా మెయిల్‌ (12840), వాస్కోడిగామా-హౌరా (18048), తిరుచురాపల్లి-హౌరా (12664), బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18464), ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019), విశాఖ-కూర్బా (18518), విశాఖ-రాయగడ (18528), గుంటూరు-రాయగడ (17243), జగదల్‌పూర్‌-భువనేశ్వర్‌ (18448), జునాగర్‌రోడ్డు-భువనేశ్వర్‌ (20838), విశాఖ-భువనేశ్వర్‌ (22820), విశాఖ-పలాస (18532), సత్యసాయి ప్రశాంతి నిలయం-హౌరా (22832), బెంగళూరు-అగర్తాలా (02983), అగర్తాలా-సికింద్రాబాద్‌ (07029) 

శనివారం (4న) రద్దు కానున్న రైళ్లు 

భువనేశ్వర్‌-బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463), హటియా-బెంగళూరు (18637), భువనేశ్వర్‌-విశాఖ (22819), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), గుణుపూర్‌-పూరి (18418), విశాఖ-నిజాముద్దీన్‌ (12807), విశాఖ-కిరండోల్‌ (18551), గుణుపూర్‌-విశాఖ (08522), పలాస-విశాఖ (18531)

Updated Date - 2021-12-03T06:15:05+05:30 IST