అభివృద్ధి పనులకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-05-04T06:18:07+05:30 IST

మున్సిపాలిటీల్లో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు నిలిచి పోయాయి. దీంతో కొత్తగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

అభివృద్ధి పనులకు బ్రేక్‌

రూ. 50 కోట్లు బిల్లుల పెండింగ్‌ జూ నెలల తరబడి ఎదురుచూపు 

కొత్తగా పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

తణుకు, మే 3: మున్సిపాలిటీల్లో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు నిలిచి పోయాయి. దీంతో కొత్తగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.  జిల్లా వ్యాప్తంగా ఏలూరు కార్పొరేషన్‌తో పాటు భీమవరం, నరసాపురం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ. 50 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు రావాల్సి ఉంది.  ప్రస్తుత ప్రభుత్వంలోవే కాక గత పాలక వర్గాల హయాంలో చేసిన పనులకు కూడా బిల్లులు రావలసి ఉంది.  చేసిన పనులకు బిల్లులు చేసి సీఎఫ్‌ఎంఎస్‌కు పంపినట్టు మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. ఆయా మున్సిపాల్టీల్లో డబ్బులున్నా చెల్లింపులు చేయలేని పరిస్థితి. కారణం ప్రభుత్వం నుంచి చెల్లింపులకు అనుమతి లేదు. దీంతో అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. దీని ప్రభావం ఆయా మున్సిపాలిటీలపై పడింది. కొత్తగా ఏమైనా పనులు చేయమన్నా ఏ ఒక్క కాంట్రాక్టరు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. 

బకాయిలు ఇలా...

తాడేపల్లిగూడెం మున్సిపాలిటిలో రూ. కోటి, తణుకు రూ. 4 కోట్లు, నిడదవోలు రూ. 50 లక్షలు,  కొవ్వూరు రూ. 2 కోట్లు, జంగ్గారె డ్డిగూడెం  రూ. 50 లక్షలు, పాలకొల్లు రూ. 4 కోట్లు, నరసాపురం రూ. 5 కోట్లు, బీమవరం  రూ. 7 కోట్లు, ఏలూరు కార్పొరేషన్‌లో అత్యధికంగా రూ. 24 కోట్లు చెల్లించాల్సి ఉంది. అప్పులు చేసి పనులు చేశామని బిల్లులు రాక వడ్డీలు కట్టలేక పోతున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.  ప్రభుత్వం ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-04T06:18:07+05:30 IST