ఇటలీ నుంచి వచ్చా.. దగ్గుతో ఆస్పత్రికెళ్తే కరోనా అన్నారు.. నమ్మలేదు కానీ..

ABN , First Publish Date - 2020-03-25T08:25:40+05:30 IST

కరోనాకు కచ్చితంగా భయపడాల్సిందే! సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే! అయినా... వైరస్‌ సోకితే ఏం చేయాలి? భయపడిపోవాలా!? ‘నాకు ఉగాదులు లేవు...

ఇటలీ నుంచి వచ్చా.. దగ్గుతో ఆస్పత్రికెళ్తే కరోనా అన్నారు.. నమ్మలేదు కానీ..

కరోనాకు కచ్చితంగా భయపడాల్సిందే! సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే! అయినా... వైరస్‌ సోకితే ఏం చేయాలి? భయపడిపోవాలా!? ‘నాకు ఉగాదులు లేవు... ఉషస్సులూ లేవు’ అని వేదన చెందాలా? ఆ అవసరం లేదంటున్నాడు ఈ యువకుడు! సామాజిక బాధ్యత, స్వీయ క్రమశిక్షణ, మానసిక స్థైర్యం, యంత్రాంగానికి సహకారం... వీటితో కరోనాను జయించవచ్చునని నిరూపించాడు. కరోనా బారిన పడటం నుంచి బయటపడటం దాకా... తన స్వీయ అనుభవాన్ని ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నాడు! వివరాలు... ఆయన మాటల్లోనే!


కరోనాను గెలిచిన యువకుడి కథ

ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లాను. అక్కడ కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతోంది. అదే సమయంలో అక్కడి ప్రభుత్వ ఆంక్షలు పెరిగిపోయాయి. అన్ని సంస్థలు లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. మా కాలేజీ కూడా మూసేశారు. అక్కడి పరిస్థితి తెలుసుకొని ఇక్కడ అమ్మానాన్నలు కంగారు పడటం మొదలు పెట్టారు. అక్కడి నుంచి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.


స్ర్కీనింగ్‌లో నార్మల్‌ వచ్చినా...

ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో నాకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేశారు. ‘నార్మల్‌’ వచ్చింది. నేను ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచి  వైద్యాధికారులు రెగ్యులర్‌గా నాతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. నా ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. మూడు రోజుల తర్వాత... సాధారణ దగ్గు వచ్చింది. ఎందుకైనా మంచిదని అమ్మా నాన్నల అనుమతితో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాను. వాళ్లు పరీక్షించి ఐసొలేషన్‌ వార్డులో ఉండమన్నారు. స్వాబ్‌ (నమూనాలు) తీసి పరీక్షకు పంపారు. ఇంట్లో అందరికీ చెప్పి, అందరి అనుమతితో వచ్చాను కదా! ఐసొలేషన్‌లో ఉండటానికి నేనేమీ భయపడలేదు. అసలు నాకు ఏమీ ఉండదని, రిపోర్టు కూడా నెగెటివ్‌ వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాను. కానీ...  పాజిటివ్‌ వచ్చిందని డాక్టర్లు ఆ మరుసటి రోజు చెప్పారు. మీరు నమ్మండీ నమ్మకపోండి! నేను ఆ రిపోర్టును విశ్వసించలేదు. ‘పాజిటివ్‌’ అని నమ్మించడానికి డాక్టర్లు నాకు చాలా రిపోర్టులు చూపించాల్సి వచ్చింది.


అయినా... భయపడలేదు!

నాకు కరోనా వైరస్‌ సోకిందని తెలిసినా నేను భయపడలేదు. ఆ క్షణంలో వైద్యులు అందించిన గైడెన్స్‌ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. చికిత్సతోపాటు వ్యాధికి సంబంధించిన ఏ సందేహం వచ్చినా వారు క్లియర్‌ చేశారు. అప్పటికప్పుడు వారికి సమాధానం దొరకకుంటే, ఇతర నిపుణులను అడిగి తెలుసుకుని 24 గంటల్లో నా సందేహాలు క్లియర్‌ చేశారు. ఈ క్రమంలో కరోనా గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాను. 

ధైర్యమూ... ఔషధమూ...

డాక్టర్లు చెప్పిన అంశాల్లో ముఖ్యమైనది... ధైర్యంగా ఉండాలని! మానసికంగా బలంగా ఉండి, వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుకోగలిగితే కరోనా ఏమీ చేయలేదన్నారు. మంచి ఆహారం, అవసరమైన మందులు క్రమం తప్పకుండా తీసుకోవడంతోపాటు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని తెలిపారు. మంచి బలవర్ధక ఆహారాన్ని అందించారు. ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ ఇలా నేను ఏది కోరితే అది తెప్పించి పెట్టారు. ఐసొలేషన్‌లో ఉన్న నాతోపాటు మరి కొందరి కోసం ప్రత్యేకంగా వంటలు చేయించారు.


ఇలా చేస్తే... 

కరోనాపై సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టింగ్‌లు నమ్మొద్దు. ప్రభుత్వ, సాధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించండి. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏవైనా కనిపిస్తే భయపడకుండా డాక్టర్‌ను కలవండి. కచ్చితంగా ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని రోజులు ఇంటికే పరిమితంకండి! చివరగా చెప్పేదేమిటంటే,  నాకు వ్యాధి నయమవడానికి మొదటి కారణం... వైద్యులు అందించిన చికిత్స, సహకారం! రెండో కారణం... నా నమ్మకం, మానసిక స్థైర్యం. 

- అమరావతి, ఆంధ్రజ్యోతి


ఐసొలేషన్‌లో ఇలా...

ఐసొలేషన్‌ వార్డులో ఉన్న 14 రోజుల్లో మొదటి రెండు రోజులు బోర్‌గా ఫీలయ్యాను. ఆ తరువాత అలవాటైపోయింది. అమ్మా నాన్నలతో రోజుకు నాలుగైదుసార్లు ఫోన్‌లో మాట్లాడాను.  విచిత్రం ఏమిటో తెలుసా! ఎదుటి వాళ్లు నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నేనే అందరికీ ధైర్యం చెప్పాను. నాకేమీ కాదు, నేను త్వరగా ఇంటికి వచ్చేస్తానని చెప్పేవాడిని. ల్యాప్‌టా్‌పలో సినిమాలు చూశాను. న్యూస్‌ చానెల్స్‌ చూస్తూ కరోనా గురించి అప్‌డేట్స్‌ తెలుసుకునే వాడిని!


ఆ ఒక్కటి... 

ఐసొలేషన్‌లో ఉన్న 14 రోజుల్లో నేను బాధపడిన సంఘటన ఒక్కటే ఒక్కటి. అది కొన్ని టీవీ చానెళ్లు (ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కాదు), సోషల్‌ మీడియాలో చేసిన అసత్య ప్రచారాలు నాకు చాలా కోపాన్ని, బాధను కలిగించాయి. నా పర్మిషన్‌ లేకుండా ఆసుపత్రికి వచ్చి ఫొటోలు, వీడియోలు తీసి వాటిని ప్రసారం చేశారు. నా స్నేహితునికి నెగెటివ్‌ వచ్చినా పాజిటివ్‌ వచ్చినట్లు సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేశారు. మరీ దారుణమేమిటంటే... నా మిత్రుడి ఫొటోకు నాపేరు తగిలించి ‘ఇతనికే కరోనా వచ్చింది’ అని తప్పుడు ప్రచారం చేశారు. సాధారణ దగ్గు వచ్చిన వెంటనే, నా అంతట నేను స్వచ్ఛందంగా ఆస్పత్రికి వెళ్లాను. అయినప్పటికీ... చికిత్స చేసుకోకుండా పారిపోవడానికి ప్రయత్నించానని ప్రచారం చేశారు. మమ్మల్ని తిడుతూ పోస్టింగ్‌లు పెట్టారు. ఇవన్నీ బాధ కలిగించాయి. ఈ తప్పుడు ప్రచారం వల్ల నా కుటుంబ సభ్యులు ఎంతగానో కుమిలిపోయారు.


(గమనిక: ప్రభుత్వ మార్గదర్శకాలు, నైతిక విలువలకు కట్టుబడి ఈ యువకుడి ఊరు, ఇతర వివరాలు వెల్లడించ లేదు. ఇది ఆ యువకుడి స్వీయ అనుభవం మాత్రమే! అందరికీ, అన్ని కేసుల్లో ఇలాగే జరగాలని లేదు. కరోనాపై అవగాహన కల్పించి, అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో... ఆంధ్రజ్యోతి ప్రతినిధి నేరుగా కాకుండా, ఫోన్‌ ద్వారా ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు.)


Updated Date - 2020-03-25T08:25:40+05:30 IST