Abn logo
Sep 26 2021 @ 23:47PM

ఏం జరుగుతోంది?

తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంప్‌ల రికవరీపై చర్యలేవీ?

 స్టాంప్స్‌ వెండర్‌ నుంచి స్టాంప్స్‌కట్టలు తెచ్చిందెవరు..  

 మళ్లీ తిరిగి ఇచ్చిందెవరు?

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో స్టాంప్‌ల కుంభకోణం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తూతూ మంత్రపు చర్యలకే అధికారులు పరిమి తమయ్యారు. దాదాపు రూ. 57 వేలు విలువైన స్టాంప్‌లు మాయమయ్యాయి. ఆ లోటును భర్తీ చేయడానికి, ఆడిట్‌ నుంచి తప్పుకోవడానికి పడాలకు చెందిన ఒక స్టాంప్‌ వెండర్‌ నుంచి రెండు కట్టల స్టాంప్స్‌ తెచ్చిపెట్టారు. వాటి సీరియల్‌  నంబర్లు సరిపోకపోవడంతో తిరిగి వాటిని ఇటీవల సంబంధిత స్టాంప్‌ వెండర్స్‌కు అప్పగించారు. అసలు వాటిని తెచ్చిందెవరో అధికారులకు తెలుసు. దర్యాప్తులోనైనా తేట తెల్లమవుతుంది. స్టాంప్స్‌ వెండర్‌ ఎవరో తెలిసినప్పుడు... అతని నుంచి తెచ్చిన వారు కూడా అధికారులకు తెలిసే ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇలా స్టాంప్స్‌ను బయటనుంచి తెచ్చిన వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ ఒక్కరినే బదిలీ చేశారు. స్టాంప్స్‌ విక్రయించే ఉద్యోగిపై కూడా చర్యలు లేవు. మొత్తంమీద స్టాంప్స్‌ ఏమయ్యాయన్న అంశంపై ఇప్పటికీ అధికారులు తేల్చ లేకపోతున్నారు. మూడు పర్యాయాలు దర్యాప్తు నిర్వహించి స్టాంప్‌లు గల్లం తైన విషయాన్ని నిర్ధారించారు. తదుపరి చర్యలు తీసు కోవడంలో విఫల మయ్యారు. గల్లంతైన స్టాంప్స్‌ సీరియల్‌ నెంబర్స్‌ను అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలుస్తోంది. ఆ స్టాంప్‌లతో రిజిస్ర్టేషన్‌ చేస్తే ఎవరు కొనుగోలు చేశారో తేటతెల్లమవుతుంది. కొనుగోలు చేసిన వారిని విచారిస్తే అమ్మింది ఎవరో అర్థమవుతుంది. తద్వారా గూడెం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం నుంచి బయటకు ఎలా వెళ్లాయో దర్యాప్తులో తేలుతుందని అధికారులు చెబుతున్నారు. అంతవరకు సంబంధిత సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇతర జిల్లాల్లో ఇదే మాదిరిగా స్టాంప్‌లు గల్లంతైతే బాధ్యులను సస్పెండ్‌ చేశారు. తాడేపల్లిగూడెంలో మాత్రం ఎటు వంటి చర్యలు లేకపోవడంతో అధికారులు విమర్శలు పాలవుతున్నారు. గల్లం తైన స్టాంప్స్‌ను బయటకు తెలియకుండా ఉండేందుకు స్టాంప్స్‌ వెండర్‌ నుంచి కొత్తవాటిని తీసుకురావడం ఒక తప్పిదమైతే దానిని విచారించకుండా, బాధ్యు లపై చర్యలు తీసుకోకుండా తిరిగి ఇవ్వడం మరో నేరమంటూ ఇప్పుడంతా చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తంమీద తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యా లయం వ్యవహారంపై అధికారుల తీరు విమర్శల పాలవుతోంది. ఇదే ఉదాసీన తతో ఉంటే క్షేత్ర స్థాయిలో మరిన్ని తప్పిదాలు జరిగే అవకాశం ఉందంటూ ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.