Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిమ్మ రైతుకు నిరాశే..!

నాలుగేళ్లుగా నష్టాల సాగు..

ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి

పెదవేగి, నవంబరు 29 : నిమ్మ రైతుకు నాలుగేళ్లుగా నిరాశే ఎదరువుతోంది.. ఏటికేడాది ధర పెరుగు తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.. నష్టాల నుంచి బయటపడవచ్చనే రైతుల ఆశలు అడియాసలుగానే మిగులుతున్నాయి. కాయల ధర పతనానికి తోడు తెగుళ్ల బెడద రైతులను గుక్కు తిప్పుకోని వ్వడం లేదు. దీంతో రైతులు ఎన్నో ఏళ్ల నుంచి పెంచిన తోటలను నరికేస్తున్నారు. నష్టాలను భరించలేమంటూ పెంచిన చేతులతోనే తుంచేస్తున్నారు. దగ్గరలోకి మార్కెట్‌యార్డు వచ్చింది. కాయలు కోసిన వెంటనే విక్రయించుకునే వెసులుబాటు వచ్చిందని ఆశించినా ఆనందం లేకపోయిందని రైతులు వాపోతున్నారు. పెదవేగి మండలంలోని భూములు ఉద్యానపంటలకు మరింత అనుకూలంగా ఉంటాయి. మెట్టప్రాంతంలో రైతులు నిమ్మ సాగు ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. నిమ్మ, కొబ్బరి, పామాయిల్‌ వంటి పంటలను అధికంగా సాగు చేస్తుంటారు. గడచిన రెండు, మూడేళ్లుగా నిమ్మ ధరలలో పెరుగుదల లేదు. నిమ్మకాయలను మార్కెట్‌కు తీసుకెళ్తే ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు. ఇద్దరు కూలీలు ఒక బస్తా (50 కిలోలు) నిమ్మకాయలు కోస్తున్నారని, ఒక్కొక్కరికి  రూ.200 కూలి చొప్పున రూ.400, వాటిని మార్కెట్‌కు తరలించడానికి ఆటోకు  ఒక్కో బస్తాకు రూ.40. దింపుడు కూలి రూ.6. మొత్తం రూ.446 వ్యయం అవుతుండగా ప్రస్తుతం నిమ్మ ధర కిలో రూ.4 ఉందని దీంతో రూ.200 వస్తుందని రైతులు ఆవేదనగా చెబుతున్నారు. ఈ వ్యయం కాక యార్డులో వ్యాపారులకు పది శాతం కమీషన్‌ ఎలాగు చెల్లించాల్సిందే. ఒకవేళ కాయలను కోయకుండా వదిలేద్దామంటే చెట్టు పాడవుతుంది. దీంతో సొమ్ములు రాకపోయినా చెట్టును కాపాడుకోవడానికి  కాయలు కోయక తప్పడం లేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


 ఖర్చులు కూడా రావడం లేదు

– తాతా నాగరాజు, కౌలు రైతు, పెదవేగి

కూలి పనులకు వెళ్లే నేను నిమ్మతోట కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నా. నాలుగేళ్ల కిందట మంచి లాభాలే వచ్చాయి. అక్కడ నుంచి నష్టంతోనే సహవాసం చేస్తున్నాం.ఈ ఏడాదైనా లాభాలు రాకపోతాయా అనే ఆశతో సాగు చేస్తున్నాం. దిగుబడి ఉన్నా ధర లేకపోవడంతో లాభాలు మాట దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. కౌలు మాత్రం చెల్లించాల్సిందే. దీంతో అప్పులు పెరిగిపోతున్నాయి..


 కాయలు కోయకపోతే..

– కొల్లి ప్రసాదరావు, నిమ్మ రైతు, గార్లమడుగు


ధర లేదని కాయలను కోయకపోతే చెట్టుకు భారం పెరి గి చెట్టు పాడవుతుంది. దీంతో నష్టమైనా కాయలను కోయా ల్సి వస్తోంది. వాటిని మార్కెట్‌కు తీసుకెళితే కూలి ఖర్చులు కూడా రావడం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా ధర రాకపోతుందా అని నిమ్మకాయలను మార్కెట్‌కు తీసుకెళ్తున్నాం.  


Advertisement
Advertisement