మ్యాన్‌హోల్‌ చింత తీరేనా..?

ABN , First Publish Date - 2021-10-18T05:56:51+05:30 IST

ఆకివీడు నుంచి అయి–భీమవరం వెళ్లే సెంటర్‌లో మ్యాన్‌హోల్‌కు రెండేళ్లుగా మరమ్మతులు చేపట్టడం లేదు.

మ్యాన్‌హోల్‌ చింత తీరేనా..?
మ్యాన్‌హోల్‌లో చిక్కుకున్న వాహనం (ఫైల్‌)

ఇటీవల ధర్నా నిర్వహించిన ఎమ్మెల్యే రామరాజు

పది రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు

వారమైనా చర్యలు శూన్యం.. కల్వర్టు నిర్మాణంతోనే పరిష్కారం?


ఆకివీడు, అక్టోబరు 17: ఆకివీడు నుంచి అయి–భీమవరం వెళ్లే సెంటర్‌లో మ్యాన్‌హోల్‌కు రెండేళ్లుగా మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వర్షం వస్తే ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఒకే చోట సమాంతరంగా ఉన్న మ్యాన్‌హోల్‌, డ్రైనేజీల వద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షం వస్తే ఇవి కనపడక కొత్తగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మ్యాన్‌హోల్‌ పెద్దది కావడంతో పాటు పక్కనే ఉన్న డ్రైను కూడా ప్రమాదకరంగా మారింది. ఆకివీడు నుంచి అయి భీమవరం వైపు వెళ్ళే ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు వేసి మ్యాన్‌హోల్‌ పనులు వదిలేశారు. ఇటీవల  ఎమ్మె ల్యే మంతెన రామరాజు ధర్నా చేయడంతో ఆర్‌అండ్‌బీ డీఈ పది రోజుల్లోగా పనులు చేస్తామని హామీ ఇచ్చారు.  నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి గోకరాజు రామరాజు కూడా  ఆర్‌అండ్‌బీ డీఈ, ఏఈ, మున్సిపల్‌ కమిషనర్‌తో వెంటనే పనులు చేయాలని కోరారు. అయితే అధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. మ్యాన్‌హోల్‌ పూడిస్తే  మురుగునీరు రోడ్‌పైకి చేరుతుంది. మ్యాన్‌హోల్‌ ప్రాంతంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు పగులగొట్టి కల్వర్టు నిర్మాణం చేపడితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అయితే ఆర్‌అండ్‌బీ,  నగర పంచాయతీ అధికారులు తమ వద్ద నిధులు లేవంటున్నారు.  మరి ఎమ్మెల్యేకు ఇచ్చిన హామీని ఏం చేస్తారో  చూడాలి. డ్రైనేజీ వ్యవస్థ రోజు రోజుకు క్షీణిస్తోంది. దీనికి తోడు డ్రైన్లలో పేరుకుపోయిన చెత్త కుళ్లి దుర్వాసనతో పాటు దోమలతో మంచాన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు  తక్షణం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-10-18T05:56:51+05:30 IST