జోరుగా ఆన్‌లైన్‌ చెల్లింపులు

ABN , First Publish Date - 2021-04-05T05:58:18+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి ఎస్‌బీఐ కార్డ్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ (ఎస్‌బీఐ కార్డ్‌) కంపెనీకి బాగానే కలిసొచ్చింది. ప్రస్తుతం ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా జరిగే చెల్లింపుల్లో 53 శాతం ఆన్‌లైన్‌ చెల్లింపులే. ఇంతకు ముందు ఇది

జోరుగా ఆన్‌లైన్‌ చెల్లింపులు

  • చిన్న నగరాల్లో మరింత వృద్ధి 
  • ఎస్‌బీఐ ఖాతాదారులపై ప్రత్యేక దృష్టి
  • ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ రామ మోహన్‌ రావు

న్యూఢిల్లీ: కొవిడ్‌ మహమ్మారి ఎస్‌బీఐ కార్డ్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ (ఎస్‌బీఐ కార్డ్‌) కంపెనీకి బాగానే కలిసొచ్చింది. ప్రస్తుతం ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా జరిగే చెల్లింపుల్లో 53 శాతం ఆన్‌లైన్‌ చెల్లింపులే. ఇంతకు ముందు ఇది 44 శాతం మాత్రమే. ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ, సీఈఓ రామ మోహన్‌ రావు అమర ఈ విషయం చెప్పారు. బయటికి వెళితే ఎక్కడ కొవిడ్‌ కాటేస్తుందోననే భయంతో జనం తమకు కావలసిన నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులను ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కరెంట్‌, డీటీహెచ్‌, కేబుల్‌ టీవీ వంటి యుటిలిటీ బిల్లులతో పాటు ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేందుకే ఇష్టపడుతున్నారు. దేశంలో కొవిడ్‌ రెండో దశ విజృంభణతో ఇది మరింత పెరిగినట్టు రావు చెప్పారు. 


మరింత పెరుగుతాయ్‌..

రానున్న రోజుల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులు మరింతగా పెరుగుతాయని రామ మోహన్‌ రావు చెప్పారు. ఒకసారి ఆన్‌లైన్‌ చెల్లింపులకు అలవాటు పడితే కొవిడ్‌ ఉన్నా లేకపోయినా ప్రజలు ఆన్‌లైన్‌ చెల్లింపులకే మొగ్గు చూపుతారన్నారు. అయితే ఇది ప్రజల కొనుగోలు ప్రవర్తనపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అనే విషయం చెప్పడం మాత్రం కష్టమన్నారు. దుకాణాలు, మాల్స్‌ పూర్తి స్థాయిలో తెరుచుకుంటే పీఓఎస్‌ చెల్లింపులూ పుంజుకుంటాయని ఎస్‌బీఐ కార్డ్‌ భావిస్తోంది. 


నాన్‌ మెట్రో నగరాల్లో కూడా

 కొవిడ్‌ ముందు వరకు ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో మెట్రో నగరాలదే పెద్ద పాత్ర. కొవిడ్‌ తర్వాత సీన్‌ మారిపోయింది. చిన్న చిన్న నగరాల్లోని వినియోగదారులూ ఆన్‌లైన్‌ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. ఎస్‌బీఐ కార్డ్‌ ఇందుకోసం ఎక్కువగా తన  మాతృ సంస్థ ఎస్‌బీఐ మీద ఆధారపడుతోంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఖాతాదారుల్లో  22 శాతం మంది మాత్రమే ఎస్‌బీఐ కార్డ్‌ ఖాతాదారులు. దీంతో ఎస్‌బీఐ ఖాతాదారుల్లో మరింత మందిని తమ ఖాతాదారులుగా చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం కొత్తగా చేరుతున్న ఖాతాదారుల్లో 58 శాతం మంది నాన్‌ మెట్రో నగరాల నుంచే వస్తున్నట్టు రావు చెప్పారు. 


రోజుకు 10,000 మంది

కొవిడ్‌ దెబ్బతో గత ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య ఎస్‌బీఐ కార్డ్‌ కొత్త ఖాతాదారుల సంఖ్య తగ్గింది. నవంబరు నుంచి మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం రోజుకు సగటున, కొవిడ్‌ కు ముందు స్థాయిలోలా 10,000 మంది కొత్త ఖాతాదారులను సంపాదిస్తున్నట్టు రామ మోహన్‌ రావు చెప్పారు. 

Updated Date - 2021-04-05T05:58:18+05:30 IST