బిల్లులు రాక.. నిర్మాణాలు ఆగి..

ABN , First Publish Date - 2021-10-24T05:30:00+05:30 IST

విజయనగరానికి చెందిన వసంతల రమేష్‌ పదేళ్ల క్రితమే తాడేపల్లిగూడెం వచ్చి మోటారు సైకిల్‌పై టీ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు.

బిల్లులు రాక.. నిర్మాణాలు ఆగి..
తాడేపల్లిగూడెంలో జగనన్న కాలనీ

 నాలుగు నెలలుగా పడిగాపులు 

అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టామని ఆవేదన

త్రిశంకు స్వర్గంలో జగనన్న కాలనీ లబ్ధిదారులు

తాడేపల్లిగూడెం రూరల్‌, అక్టోబరు 24: విజయనగరానికి చెందిన వసంతల రమేష్‌ పదేళ్ల క్రితమే తాడేపల్లిగూడెం వచ్చి మోటారు సైకిల్‌పై టీ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో ఇళ్లు లేని వారికి ఇళ్లిస్తామని ప్రకటించడంతో ఇతను దరఖాస్తు చేయగా మంజూ రైంది. వెంటనే ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టుకోవాలని వలంటీర్‌ చెప్పడం తో పదేళ్లుగా కూడబెట్టిన లక్ష రూపాయలు చేత పట్టుకుని ఇల్లు కట్టుకు నేందుకు ముందుకొచ్చాడు. వెంటనే ఇంటి నిర్మాణం మొదలు పెట్టాడు. చేతిలో ఉన్న లక్ష రూపాయలతో పునాదుల వరకూ కూడా ఇంటి పని పూర్తికాలేదు. అయితే ప్రభుత్వ రుణం వస్తుంది వెంటనే ఇచ్చేస్తా అంటూ తెలిసిన వారి దగ్గర మరో రూ.లక్ష చేబదులు తెచ్చాడు. నిర్మాణం స్లాబు లెవల్‌కు వచ్చి నెల రోజులైంది. ఇంటి పని మొదలు పెట్టి నాలుగు నెలలు అవుతోంది. అయినా ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణం రాలేదు. మరో పక్క చేబదులు తెచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఏం చేయాలో పాలుపోక  మనో వేదనకు గురవుతున్నాడు. ఇది ఓ సగటు లబ్ధిదారు పరిస్థితి. 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు పలువురు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇళ్ల నిర్మా ణాలు ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారికి ఒక్క బిల్లు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంతింటి కల సాకా రం చేసుకుందామని నిర్మాణం మొదలు పెట్టిన వారు మొదటి నుంచి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. చివరికి ఇంటి నిర్మాణం చివరి దశకు వచ్చాక చేతిలో డబ్బు లేక మదనపడుతున్న సమయంలో ఇంటి నిర్మాణ స్థలాలు సహేతుకంగా లేవని వెంటనే నిర్మాణాలు నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో లబ్ధిదారులు మరింత గందరగోళంలో పడిపోయారు. 


బిల్లులు మంజూరు చేయాలి

మాది మధ్య తరగతి కుటుంబం.  టీ వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా.  ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన నాటి నుంచి  వ్యాపారం మానుకోవాల్సి వచ్చింది.  ప్రభుత్వం వెంటనే ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లిస్తే  ఇబ్బంది తీరుతుంది. 

–వసంతల రమేష్‌, గృహ నిర్మాణ లబ్ధిదారు

Updated Date - 2021-10-24T05:30:00+05:30 IST