అన్నదాతలకు అందిన రైతుబంధు

ABN , First Publish Date - 2021-01-11T04:37:16+05:30 IST

యాసంగి సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించిన రైతుబంధు నిధులు అన్నదాతలకు అందాయి.

అన్నదాతలకు అందిన రైతుబంధు

 ఖాతాల్లో జమ అయిన రూ. 173.95 కోట్లు

 1,67,606 మందికి ప్రయోజనం 

వివిధ కారణాలతో 8,532 మందికి అందని నిధులు 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

యాసంగి సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించిన రైతుబంధు నిధులు అన్నదాతలకు అందాయి. జిల్లావ్యాప్తంగా 1,67,606 మంది రైతుల ఖాతాల్లోకి 173 కోట్ల 94 లక్షల 82 వేల 370 రూపాయలు జమ అయ్యాయి. ఎకరం భూమి ఉన్న రైతులతో మొదలుకొని వరుసగా వారంరోజులపాటు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. సకాలంలో పెట్టుబడి సాయం అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి సాయంతోపాటు ఒక్కో రైతుకు రెండు వేల రూపాయల చొప్పున పీఎం కిసాన్‌ సాయం రైతుల ఖాతాల్లో జమ అయింది. పీఎం కిసాన్‌ పథకం కింద జిల్లాలోని 1,09,598 మంది రైతులకు 21 కోట్ల 91 లక్షల 16వేల రూపాయల ఆర్థిక సహాయం అందింది. 

పెట్టుబడి బెంగ తీరింది..

యాసంగి సాయం కింద అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 173 కోట్ల 94 లక్షల 82వేల 370 రూపాయల కేంద్ర ప్రభుత్వం నుంచి 21 కోట్ల 91లక్షల 16వేల రూపాయలు మొత్తంగా సుమారు 196 కోట్ల రూపాయలు రైతులకు అందుబాటులోకి రావడంతో వారికి ఈ పంట సాగుకు డబ్బు కోసం పెద్దగా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. రైతుబంధు పథకం కింద జిల్లాలో 1,76,138 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరు సాగు చేసే విస్తీర్ణాన్ని అనుసరించి 178 కోట్ల 93 లక్షల 39వేల 830 రూపాయల అవసరమవుతాయని గుర్తించారు. రైతుల పట్టాదారు పుస్తకాలు, బ్యాంకు ఖాతాలు, ఇతర విషయాలన్నీ సరిచూసిన అనంతరం ఏఈవోలు, మండల వ్యవసాయాధికారులు 1,68,392 మంది రైతులకు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేశారు. వారిలో 1,62,362 మంది రైతులకు 175 కోట్ల 31 లక్షల రూపాయలు ట్రెజరీలో జమ చేశారు. బ్యాంకుల ద్వారా వివరాలు సరిపోయిన 1,67, 606 మంది రైతుల ఖాతాల్లో 173 కోట్ల 95 లక్షల రూపాయలు జమ అయ్యాయి. 

మానకొండూర్‌ మండలంలో అత్యధికంగా లబ్ధిదారులు

జిల్లాలోని 16 మండలాల్లో మానకొండూర్‌ మండలం రైతులకు ఈ పథకం కింద అత్యధిక ప్రయోజనం చేకూరింది. ఈ మండలంలో 16,931 మంది రైతులకు 17 కోట్ల 96 లక్షల 43వేల 500 రూపాయల రైతుబంధు సాయం అందింది. ఆ తర్వాత స్థానం గంగాధర మండలానికి దక్కింది. ఈ మండలంలో 13,012 మంది రైతులకు 14 కోట్ల 44 లక్షల 98వేల 023 రూపాయల సాయం అందింది. వీణవంకలో 12,841 మంది రైతులకు 13 కోట్ల 35 లక్షల 33వేల 808 రూపాయల సాయం అందగా చిగురుమామిడిలో భూమి ఎక్కువ ఉన్న కారణంగా 11,215 మంది రైతులకే 13 కోట్ల 42 లక్షల 18వేల 825 రూపాయలు వచ్చాయి. చిట్టచివరి స్థానంలో కరీంనగర్‌ అర్బన్‌ మండలం నిలిచింది. ఈ మండలంలోని 17 మంది రైతులకు 1,84,685 రూపాయల పెట్టుబడి సాయం లభించింది. సైదాపూర్‌లో 12,626 మంది రైతులకు, హుజూరాబాద్‌లో 12,205, రామడుగులో 12,109, శంకరపట్నంలో 11,741, చొప్పదండిలో 11,371, జమ్మికుంటలో 11,382, తిమ్మాపూర్‌లో 10,582, ఇల్లందకుంటలో 9,487, కరీంనగర్‌ రూరల్‌లో 9,291, కొత్తపల్లిలో 6,601, గన్నేరువరం మండలంలో 6,195 మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. సకాలంలో రైతుబంధు సాయం అందుబాటులోకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-01-11T04:37:16+05:30 IST