బదిలీ వెనుక కథేంటి..?

ABN , First Publish Date - 2022-01-26T07:28:45+05:30 IST

పదే పది నెలల్లో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాపై బదిలీ వేటు పడింది.

బదిలీ వెనుక కథేంటి..?

వివాదాల్లో తలదూర్చడమే కారణమా

మంత్రుల మధ్య ఆధిపత్య పోరా

ఉద్యోగులతో ధూషణపర్వం కూడా తోడు

స్వల్ప వ్యవధిలోనే బదిలీ వేటు పడ్డ తొలి కలెక్టర్‌

వచ్చే నెలలో మరికొందరిపైనా వేటు

 (ఏలూరు–ఆంధ్రజ్యోతి):

పదే పది నెలల్లో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాపై బదిలీ వేటు పడింది. చడీ చప్పుడు కాకుండా అర్ధరాత్రి జారీ అయిన జీవోలో బదిలీ వ్యవహారం. ఆయన స్థానంలో కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌ నియామకం. అసలు ఇంతకీ మిశ్రా అర్ధంతర బదిలీకి మంత్రుల మధ్య అగాథమే కారణమా..?మాట వినని గుణమా..? ఉద్యో గులు, అధికారులపై పరుష పదజాల ప్రయోగమా అనే ప్రశ్నే అందరిలోనూ. రాజకీయ ఒత్తిడితోనే బదిలీ జరిగిందని, ఒక మంత్రి దీని వెనుక ఉన్నారనే ప్రచారం. ఇంకోవైపు వ్యక్తిగత అభీష్టం మేరకే బదిలీ ప్రహసనం సాగింద నేది మరో సమాచారం. మిశ్రా బదిలీతో పాటు కొద్ది రోజుల వ్యవధిలోనే మరి కొందరి బదిలీలు ఉంటాయనే ప్రచారం ఊపందుకుంది. ఉద్యోగుల సమస్య ఒక కొలిక్కి వచ్చిన తదుపరి వరుస బదిలీలు ఉంటాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

అసలింతకీ ఏం జరిగింది?

జిల్లా కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రా గత ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించారు.   గడిచిన పది నెలల్లో తనకంటూ ఒక ముద్ర వేసు కునేందుకు మిశ్రా పరితపించా రు. ప్రతీ సోమవారం జరిగే స్పందన దగ్గర నుంచి ఈ మధ్యన జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాల వెలువరింతలోనూ ఆయన జాగరూకతతోనే వ్యవహరించారు.  ఓ వైపు ప్రస్తుత రాజకీయ ఒరవడికి అనుకూలంగా అందరి వద్ద కాస్తంత మంచి మార్కులు సాధించేందుకు ప్రయత్నించినా అధికార పక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మిశ్రా పనితీరుపై గడిచిన కొద్ది మాసాలుగా పెదవి విరవడం ప్రారం భించారు. తాము కొన్నింటిని సిఫార్సు చేస్తున్నా కలెక్టర్‌ పట్టించుకునే స్థితిలో లేరని, ఇదే మార్గాన్ని ఆర్డీవో స్థాయి నుంచి తహసీల్దారు స్థాయివరకు వ్యవహ రించారనే ఆరోపణ లేకపోలేదు. కొందరు శాసన సభ్యులైతే పదేపదే ఈ విషయా న్ని తమ అనుకూల మంత్రుల చెవిన వేశారు. ఇంకాస్త చొరవ ఉన్న ఎమ్మెల్యేలైతే నేరుగా సీఎంవో దృష్టికి తీసుకువెళ్ళారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని చేసిన కొన్ని సిఫా ర్సులకు మిశ్రా తలూపని కారణంగానే ఇంత స్వల్ప వ్యవధిలోనే బదిలీ వేటుకు గురయ్యారనే ప్రచారం ఇప్పుడు సాగుతోంది. అయితే అత్యధికసార్లు కలెక్టర్‌ అధ్యక్ష తన నిర్వహించే సమీక్షల్లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అతి తక్కువగా హాజరు కాగా, అత్యధికంగా పాల్గొన్నది మంత్రి రంగనాథరాజు. ఇంకో మంత్రి తానేటి వనిత మాత్రం వీలు చిక్కినప్పుడల్లా కలెక్టరేట్‌లో జరిగే వీడియో కాన్ఫరెన్సులో, అదీ సీఎం పాల్గొనే కాన్ఫరెన్సుల్లోనే పాల్గొనేందుకు చొరవ చూపారు. కాని ముగ్గురు మంత్రుల మధ్య ఉన్న ఆధిపత్య పోరులో కలెక్టర్‌ బదిలీ అనివార్యమైనట్టుగా చెబుతున్నారు.   

ధూషణ పర్వం కారణమా 

 జిల్లాలో తన కింది స్థాయి అధికారులపై కలెక్టర్‌ మిశ్రా చాలాసార్లు నోరు పారేసు కున్నారు. కీలక సమీక్షల్లోనూ, వీడియో, టెలీ కాన్ఫరెన్సుల్లోనూ కొందరి పాలనా వ్యవహారం నచ్చక కలెక్టర్‌ దుందుడుకుగా పరుష పదజాలం వాడారు.    ధూషణలను రికార్డు చేసి తమ యూనియన్‌ నేతల దృష్టికి తీసుకువెళ్ళారు. జిల్లా పరిషత్‌ సీఈవో పులి శ్రీనివాసులు అయితే కొద్ది కాలం లాంగ్‌ లీవ్‌ పెట్టి ఉద్యో గానికి దూరంగా ఉన్నారు. మరికొందరు కూడా మంత్రులతో సిఫార్సులు చేయిం చుకుని వేరే ప్రాంతానికి బదిలీ అయ్యేందుకు ప్రయత్నించారు. అప్పట్లో ఈ వ్యవహారంపై దుమారం చెలరేగగా, రాష్ట్ర స్థాయిలో సైతం అలజడి రేగింది. అలాం టి తరుణంలో పెన్‌డౌన్‌తో సహా ఆందోళనకు సిద్ధపడ్డారు. ఈ వ్యవహారాలన్నీ ఆకస్మిక బదిలీకి దారితీసాయన్న అనుమానం లేకపోలేదు. దీనికితోడు సుదీర్ఘ కాలం పాటు కలెక్టర్‌గా రాణించిన తాను ఇక ఈ బాధ్యతల్లో ఇమడలేక వ్యక్తిగతంగా బదిలీ కోరు కోవడం ల్లే ఈ నిర్ణయం జరిగినట్టు చెబుతున్నారు. కేంద్ర సర్వీసులకు వెళ్తారని కొందరు.. త్వరలోనే కీలకమైన బాధ్యతలు అప్పగించడానికే బదిలీని అమలు చేసినట్టు వినిపిస్తోంది. ఇంకోవైపు వచ్చే నెలలో జిల్లా అధికారులు కొందరిని కూడా బదిలీ చేయ వచ్చునని భావిస్తున్నారు. 

Updated Date - 2022-01-26T07:28:45+05:30 IST