పాలపుంతలో వింత వస్తువు.. ప్రతి 18.18 నిమిషాలకు భూమికి సిగ్నల్

ABN , First Publish Date - 2022-01-28T02:23:39+05:30 IST

సుదూర తీరంలోని పాలపుంతలో తిరుగుతున్న ఓ వింత వస్తువును ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు

పాలపుంతలో వింత వస్తువు.. ప్రతి 18.18 నిమిషాలకు భూమికి సిగ్నల్

న్యూఢిల్లీ: సుదూర తీరంలోని పాలపుంతలో తిరుగుతున్న ఓ వింత వస్తువును ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి వస్తువును ఖగోళ శాస్త్రవేత్తలు మునుపెన్నడూ చూడలేదు. అండర్ గ్రాడ్యుయేట్ థీసిస్ చేస్తున్న ఓ యూనివర్సిటీ విద్యార్థి తొలుత దీనిని గుర్తించాడు.


ఇది గంటకు మూడుసార్లు అంటే ప్రతీ 18.18 నిమిషాలకు ఒకసారి భూమికి రేడియో సిగ్నల్స్ పంపిస్తోంది. ప్రస్తుతం ఈ వస్తువును ‘అల్ట్రాలాంగ్ పిరియడ్ మాగ్నెటార్’ అని పిలుస్తున్నారు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ ఆరేలో టెలిస్కోప్ సాయంతో ఆ విద్యార్థి ఈ వస్తువును గుర్తించాడు.


ఈ వస్తువు ప్రస్తుతం భూమికి దాదాపు నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని లెక్కగట్టారు. దీని అయస్కాంతక్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని, కాంతులు విరజిమ్ముతోందని దానిని విశ్లేషిస్తున్న హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త తెలిపారు. ఇది పాలపుంతలో ఎప్పటి నుంచే ఉండొచ్చని, కానీ ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారని పేర్కొన్నారు.


అంతరిక్షం నుంచి వస్తున్న ఈ శక్తిమంతమైన, స్థిరమైన రేడియో సిగ్నల్‌ను వేరే ఏదైనా జీవ రూపం ద్వారా పంపారా? అన్న ప్రశ్నకు హార్లీ వాకర్ బదులిస్తూ.. తొలుత ఇవి గ్రహాంతరవాసులవని తాను భావించానని అయితే, పరిశోధన బృందం విస్తృత శ్రేణి పౌనఃపుణ్యాలలో ఈ సిగ్నల్స్‌ను గుర్తించిందని చెప్పారు. దీనిని బట్టి అది సహజ ప్రక్రియ అయి ఉండాలని, ఇది కృత్రిమ సంకేతం ఎంతమాత్రమూ కాదని వాకర్ వివరించారు. ఈ వింత వస్తువుకు సంబంధించి నేచర్ జర్నల్ తాజా ఎడిషన్‌లో ప్రచురితమైంది. 

Updated Date - 2022-01-28T02:23:39+05:30 IST