విద్యా శాఖ వింత ఆదేశాలు

ABN , First Publish Date - 2020-04-05T16:31:44+05:30 IST

పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారుల తీరు తీవ్ర విమర్శలకు..

విద్యా శాఖ వింత ఆదేశాలు

‘నాడు-నేడు’ పనులు చేపట్టాలంటూ ఉత్తర్వులు

ఉన్నతాధికారుల తీరుపై ఉపాధ్యాయుల విస్మయం

లాక్‌డౌన్‌ సమయంలో నిర్మాణాలు ఎలా సాధ్యమనే ప్రశ్నలు

ఒకవైపు భవన నిర్మాణ సామగ్రి దుకాణలన్నీ మూత

మరోవైపు కూలీలు సైతం పనులకు రాని పరిస్థితి

అసలు గ్రామాల్లోకి మరొకరిని అనుమతించే పరిస్థితే లేదు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్రకటించిన ‘నాడు-నేడు’ పథకం కింద వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించడంపై కిందిస్థాయి అధికారులు, ఉపాధ్యాయులు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఈ నెల 14వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిందని, నిత్యావసర సరుకులు మినహా మిగిలిన దుకాణాలను తెరవొద్దని స్పష్టం చేసిందని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించిందని, ఇటువంటి సమయంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి పనులు ఎలా చేస్తామని ఉన్నతాధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. 


నాడు-నేడు పథకం కింద జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద వున్న 1,160 పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, మోటారు రిపేర్లు వంటి పనులు చేపట్టేందుకు అధికారులు రూ.273 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఫిబ్రవరిలో సుమారు 700 పాఠశాలల్లో మట్టి పనులు చేపట్టారు. మొత్తం పనుల్లో 30 శాతం ఉపాధి కూలీలకు కేటాయించాలి. మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద మరుగుదొడ్లు నిర్మాణం, మోటారు మరమ్మతులు, తాగునీటి కల్పన పనులు చేపట్టాలి. ఇందుకు సిమెంట్‌, ఇనుము, శానిటరీ, ఎలక్ర్టికల్‌ సామగ్రి అవసరం. ప్రతి మండలంలో ఒక షాపును గుర్తించి సదరు షాపు యజమాని నుంచి ఇన్‌వాయిస్‌ తీసుకుని నాడు-నేడు వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేయాలి.


తరువాత ప్రభుత్వం నుంచి సదరు షాపు యజమాని బ్యాంకు ఖాతాకు సొమ్ము జమ అవుతుంది. దీంతో పాఠశాలకు అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తారు. దీనికి సంబంధించి విద్యా శాఖ కొంతమేర కసరత్తు చేసిన తరువాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎస్‌ఈసీ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. ఆ తరువాత లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం నిత్యావసర సరకుల దుకాణాలు తప్ప మిగిలిన వ్యాపార సంస్థలను తెరవనివ్వడం లేదు. ఇటువంటి తరుణంలో పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు నాలుగు రోజుల క్రితం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పాఠశాలల్లో నాడు-నేడు పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు అయినందున పనులు వేగంగా జరిగేందుకు ఆస్కారం వుందని సూచించారు.


పనులకు అవసరమైన మెటీరియల్‌ కాంపోనెంట్‌ సరఫరాకు జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తామని చెప్పారు. మండలానికి ఒకటి లేదా రెండు పాఠశాలల్లో మాత్రమే పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. అయితే అధికారుల తీరుపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. గ్రామాల్లోకి స్థానికేతరులను అనుమతించడం లేదని, సిమెంట్‌, ఇనుము, ఇతర భవన నిర్మాణ సామగ్రి విక్రయ దుకాణాలు తెరవడం లేదని, కూలీలు కూడా పనులకు రావడం లేదని, ఇటువంటి తరుణంలో పాఠశాలల్లో పనులు ఎలా చేయిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత పనులు చేపట్టేలా కొత్తగా ఆదేశాలు జారీచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


హెచ్‌ఎంలకు పాసులు

నాడు-నేడు పనులు చేపట్టే పాఠశాలల హెచ్‌ఎంలకు పాసులు ఇస్తామని డీఈవో బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు. పాఠశాలలు తెరిచేనాటికి అన్నివసతులు కల్పించేందుకు తల్లిదండ్రుల కమిటీల సమావేశం నిర్వహించాలని సమాచారం ఇచ్చామన్నారు. అయితే వీరంతా భౌతిక దూరం పాటించాలని సూచించామన్నారు. 

Updated Date - 2020-04-05T16:31:44+05:30 IST