కశ్మీర్‌లో వ్యూహాత్మక దాడులు!

ABN , First Publish Date - 2021-10-19T07:09:18+05:30 IST

: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు వరుస హత్యలకు పాల్పడుతుండడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...

కశ్మీర్‌లో వ్యూహాత్మక దాడులు!

అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యం

ప్రభుత్వ ప్రయత్నాలను దెబ్బతీసేందుకే హత్యలు

ఉగ్రవాదులను ప్రేరేపించేలా ఓ బ్లాగ్‌లో వ్యాఖ్యలు

బ్లాగ్‌ను తెరిచిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు

దాడులకు కారణం తెలుసుకోవాలని షా ఆదేశం


శ్రీనగర్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 18: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు వరుస హత్యలకు పాల్పడుతుండడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్‌లో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, అన్ని వర్గాల ప్రజలకు నివాసయోగ్యంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు పౌరులపై దాడులకు పాల్పడుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. ఇందుకోసం దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కశ్మీర్‌కు వచ్చినవారినే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు చివరివారంలో ఓ వెబ్‌ బ్లాగ్‌లో పోస్ట్‌ చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేసేలా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


ప్రస్తుతం ఆ బ్లాగ్‌ను బ్లాక్‌ చేశారు. అయితే బ్లాగ్‌లో పోస్ట్‌ చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాద గ్రూపులకు సర్క్యులేట్‌ అయ్యాకే 11 మంది పౌరుల హత్య జరిగిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ బృందాన్ని మళ్లీ అక్కడికి పంపించింది. ఈ బృందం శనివారమే కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి రాగా.. అదేరోజు  ఇద్దరు వ్యక్తులు  హత్యకు గురవడంతో ఇంటెలిజెన్స్‌ బృందాన్ని తిరిగి అక్కడికి పంపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధికారులను ఆదేశించారు. దాడులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలన్నారు. మరోవైపు  భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎఎం నరవణే.. కశ్మీర్‌ వెళ్లారు.

Updated Date - 2021-10-19T07:09:18+05:30 IST