అమ్మో.. ఎంత భూదాహమో..!

ABN , First Publish Date - 2021-10-04T07:43:33+05:30 IST

పదులు, వందలు కాదు.. 2320 ఎకరాల ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవడానికి స్కెచ్‌ వేశాడు. తండ్రి నుంచి తల్లికి.. ఆమె నుంచి తన నలుగురి పిల్లలకు వారసత్వ హక్కు వచ్చినట్లుగా రికార్డులు సృష్టించాడు.

అమ్మో.. ఎంత భూదాహమో..!
సీఐడీ అరెస్టు చేసిన నిందితులు

 2320 ఎకరాల ప్రభుత్వ భూమి సొంతం చేసుకోవడానికి వ్యూహం 

నలుగురిపై 1577 ఎకరాలు వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో నమోదు 

కలెక్టరేట్‌లోనే సాగిన తంతు 

కనీస పర్యవేక్షణ లేకపోవడమే కారణం 

సీఐడీ దర్యాప్తులో వెలుగుచూసిన భారీ భూకుంభకోణం 


(తిరుపతి, ఆంధ్రజ్యోతి) : పదులు, వందలు కాదు.. 2320 ఎకరాల ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవడానికి స్కెచ్‌ వేశాడు. తండ్రి నుంచి తల్లికి.. ఆమె నుంచి తన నలుగురి పిల్లలకు వారసత్వ హక్కు వచ్చినట్లుగా రికార్డులు సృష్టించాడు. 1577 ఎకరాలను వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో నమోదు చేయించాడు. ఇంతలా చేసిన మోహన్‌ గణేష్‌ పిళ్లై చదివింది పదో తరగతి. గ్రామ కరణం, ఆ తర్వాత వీఏవోగా పనిచేశాడు. 

ఒకేరోజు 1577 ఎకరాల ప్రభుత్వ భూమి నలుగురి పేరిట పోర్టల్‌ నమోదు చేసినప్పుడు.. ఆ తర్వాత 12 ఏళ్లరునాఆ రెవెన్యూ అధికారులు గుర్తించలేకపోయారు. సీఐడీ అధికారుల దర్యాప్తుతో.. దీనిపై తిరుపతిలో ఆదివారం వారు నిర్వహించిన మీడియా సమావేశంతో భారీ భూకుంభకోణం బయటపడింది. రెవెన్యూ అధికారుల డొల్లతనాన్ని ఎత్తి చూపింది. ప్రభుత్వ భూముల పరిరక్షణలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటిచెప్పింది. 


ప్రభుత్వ భూముల సొంతానికి స్కెచ్‌ వేశారిలా.. 

యాదమరి మండలం 184 గొల్లపల్లికి చెందిన మోహన్‌ గణేష్‌ పిళ్లై 1977-84 నడుమ గ్రామ కరణంగా పనిచేశారు. ఆ వ్యవస్థ రద్దయ్యాక 1992లో గ్రామపాలనాధికారి (వీఏవో) హోదాలో తిరిగి ప్రభుత్వ విధుల్లో చేరి 2010లో రిటైరయ్యాడు. ఈ క్రమంలో ఇతడు భారీ భూకుంభకోణానికి సుదీర్ఘ కాలం పాటు స్కెచ్‌ వేశాడు. సీఐడీ విచారణలో 1985 నుంచి కుంభకోణం తాలూకూ ఆధారాలు వారి చేతికి వచ్చాయి. 

 తన తండ్రికి వారసత్వంగా 13 మండలాల్లోని 18 రెవెన్యూ గ్రామాల పరిధిలో 93 సర్వే నెంబర్లకు చెందిన 2320 ఎకరాల భూమి ఉన్నట్లు గణేష్‌ పిళ్లై నకిలీ పత్రాలు సృష్టించాడు. 

ఆ భూములపై తన తండ్రి హక్కులు వదులుకుని తన తల్లి అమృతవల్లెమ్మ పేరిట బదలాయించినట్టు నకిలీ పత్రాలు రూపొందించాడు. 

 అమృతవల్లెమ్మ ఆ భూములను తన కుమారుడి పిల్లలైన కోమల, ధరణి, మధుసూదన్‌, నటరాజన్‌ అలియాస్‌ రాజన్‌కు చెందేలా వీలునామా రాసినట్టు డాక్యుమెంట్లు సృష్టించాడు. ఈ వీలునామాను బంగారుపాళ్యం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 1985లో రిజిస్టర్‌ చేయించాడు. తన తండ్రికి వేలాది ఎకరాలు ఎలా వచ్చాయన్న అనుమానం ఎవరికీ రాకుండా జమీందారుల ద్వారా వచ్చినట్టు మళ్లీ నకిలీ పత్రాలు సృష్టించాడు. 


వెబ్‌ల్యాండ్‌లో 1577 ఎకరాల నమోదు 


1985 నుంచి ప్రారంభించిన భూ కుంభకోణం స్కెచ్‌ ఆచరణలోకి రావడానికి సుమారు పాతికేళ్లు పట్టింది. 2005-10 నడుమ కలెక్టరేట్‌ కేంద్రంగా జిల్లాలోని భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో నమోదు చేసే కార్యక్రమం మొదలైంది. ఆ వంకతో కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తూ గణే్‌షపిళ్లై తాను సృష్టించిన నకిలీ పత్రాల ఆధారంగా 9 మండలాల్లో 1577 ఎకరాల ప్రభుత్వ భూమిని 2009 జూలై ఒకటో తేదీన వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌కు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎంఐఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేయించుకున్నాడు. 


భూ బండారం బయటపడిందిలా.. 

వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదైన 1577 ఎకరాల ప్రభుత్వ భూమికి మీ సేవా కేంద్రాల్లో అడంగల్‌, 1-బి కాపీలను వారు తీసుకోగలిగారు. వాటిని చూపి పట్టాదారు పాస్‌ పుస్తకాలకు దరఖాస్తు చేయడంతో బండారం బట్టబయలైంది. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 459లో తమకున్న 160.09 ఎకరాలకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు కావాలని గతేడాది మే నెలలో గణేష్‌ పిళ్లై కుటుంబీకులు తహసీల్దారును కలిశారు. ఆ సర్వే నెంబరులో వున్న మొత్తం భూమే 45.42 ఎకరాలు కావడం, అదీ ప్రభుత్వ భూమి కావడంతో తహసీల్దారు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది భారీ భూ కుంభకోణమని గుర్తించిన జిల్లా ఎస్పీ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. 


సీఐడీ గుర్తించిన భూముల వివరాలివే

యాదమరి మండలం 184 గొల్లపల్లి, కొటాల, బంగారుపాళ్యం మండలం బోడబండ్ల, చిత్తూరు మండలం బోదగుట్టపల్లి, గుర్రంకొండ, పుంగనూరు పరిధిలోని ఆరడిగుంట, ముత్తుకూరు, బొమ్మరాజుపల్లి, సోమల మండలం ఆవులపల్లి, పెద్ద ఉప్పరపల్లి, కేవీపల్లి మండలంలోని కేవీపల్లె, ఎగవూరు, పుత్తూరు పరిధిలోని దామరకుప్పం, సత్రకుప్పం,  సత్యవేడు పరిధిలోని కదిరివేడు, ఏర్పేడు మండలం కృష్ణంపల్లి, చంద్రగిరి మండలం డోర్నకంబాల తదితర 18 రెవిన్యూ గ్రామాల్లో భూములున్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. వీటిలో వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లోకి తొమ్మిది మండలాలకు చెందిన 1577 ఎకరాలను నమోదు చేసినట్టు గుర్తించినా.. ఆ మండలాల వివరాలు మీడియాకు వెల్లడించలేదు.


పర్యవేక్షణా లోపంతోనే అక్రమాలు

కలెక్టరేట్‌లో వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో నలుగురి పేరిట 1577 ఎకరాలను సాఫ్ట్‌వేర్‌లోకి ఎక్కించారు. ఇంత భారీగా ప్రభుత్వ భూములు ఇతరుల పేరిట వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో నమోదైనా సుమారు 12 ఏళ్ల పాటు అధికారులు గుర్తించలేకపోయారు. అసలు సాఫ్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్‌ చేసే సమయంలోనే రోజువారీ లేదా కనీసం వారానికో సారైనా రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమాన్ని క్రాస్‌ చెక్‌ చేసినట్లయితే అక్రమాలు జరిగే అవకాశమే ఉండేది కాదు. ఎవరూ పట్టించుకోకపోవడంతోనే ఇది సాధ్యమైంది. పిళ్ళై కుమారుడు మధుసూదన్‌కు కంప్యూటర్‌ పరిజ్ఞానం బాగా ఉందని, అతడి ద్వారానే ఈ నమోదు జరిగిందని సీఐడీ విచారణలో వెల్లడైంది. రెవెన్యూ ఉద్యోగి కానివ్యక్తి కలెక్టరేట్‌లో ఒక రోజంతా కంప్యూటర్‌ ముందు కుర్చుని 1577 ఎకరాలను తమ పేరిట నమోదు చేయించుకున్నా గుర్తించకపోవడం, ప్రశ్నించకపోవడం గమనార్హం. కలెక్టరేట్‌లో సిబ్బంది సహకారం లేనిదే ఇంత దందా నడవదు. దర్యాప్తులో భాగంగా వారినీ గుర్తించి చర్యలు తీసుకోవాల్సి వుంది. ఈ వ్యవహారం జిల్లాలో రెవెన్యూ పాలనలో డొల్లతనాన్ని బయటపెట్టింది.


అటవీ సరిహద్దు భూములపైనే కన్ను

ఈ భూకుంభకోణానికి ఎంపిక చేసుకున్న భూములన్నీ అటవీ సరిహద్దులోనివే. అటవీ సరిహద్దు గ్రామాలన్నీ మారుమూలన ఉండటం, వాటికి గతంలో పెద్దగా డిమాండు లేకపోవడం, ఎవరూ పట్టించుకోకపోవడాన్ని అతడు అనుకూలంగా మలచుకున్నట్టు తెలుస్తోంది. వీటికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు తీసుకున్నా, క్రయవిక్రయాలు జరిపినా ఆ ప్రాంత వాసుల నుంచి పెద్దగా అభ్యంతరాలు, ప్రతిఘటన ఎదురుకావన్న ఉద్దేశంతోనే ఈ భూములపై కన్నేసినట్టు చెబుతున్నారు.


ఏర్పేడు మండలంలో తిరగబడ్డ రైతులు

ఏర్పేడు మండలం కృష్ణంపల్లి రెవెన్యూ గ్రామంలో 15 మంది రైతులకు ప్రభుత్వం ఒకటిన్నర ఎకరా చొప్పున 1995లో పట్టా ఇచ్చింది. సర్వే నెంబరు 330 నుంచి 336 వరకున్న ఈ భూములను పట్టాలు పొందిన రైతుల సాగులో ఉంటున్నాయి. ఆరు నెలల కిందట మోహన్‌ గణేష్‌ పిళ్ళై అక్కడికి వెళ్లి ఆ భూములు తమవని, సర్వే చేయాలంటూ రంగంలోకి దిగారు. రైతులు తిరగబడడంతో తిరుగుముఖం పట్టినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.


పాస్‌ పుస్తకాలు, రిజిస్ట్రేషన్లు లేకపోవడమే ఊరట

1577 ఎకరాలను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించినా పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ కాకపోవడం, రిజిస్ట్రేషన్లు జరగకపోవడమే ప్రస్తుతానికి ఊరట కలిగిస్తోంది. కాకపోతే నకిలీ పత్రాలు చూపి పాస్‌ పుస్తకాలు వచ్చాక విక్రయిస్తామంటూ పలువురి నుంచి స్వల్ప మొత్తాలు అడ్వాన్సుగా పుచ్చుకున్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో బ్యాంకులు వంటి సంస్థల నుంచీ రుణాలు పొంది ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 


విధి నిర్వహణలో ఆరోపణలెన్నో? 

సొంత మండలమైన యాదమరిలో ఏడేళ్లకుపైగా మో మోహన్‌ గణేష్‌ పిళ్లై విధులు నిర్వర్తించారు. ఆ సందర్భంగా ఇతడిపై ప్రభుత్వానికి పలు ఆరోపణలు, పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి. ఓట్లపల్లి, వేపనపల్లి, కృష్ణంపల్లి గ్రామాల్లో అటవీ సరిహద్దున ఉన్న సుమారు ఆరేడు వందల ఎకరాలు సింగపూర్‌లోని వ్యక్తి పేరిట నమోదు చేశారనే ఆరోపణలున్నాయి. మిలిటరీలో పనిచేసే పలువురికీ యాదమరి మండలంలో భూముల కేటాయింపునకు సహకరించినట్టు చెబుతున్నారు. వరదరాజులపల్లికి చెందిన ఓ వ్యాపారి పేరిట సుమారు వంద ఎకరాల భూమి రికార్డుల్లో నమోదు చేసినట్టు ప్రచారంలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోపణలు, ఫిర్యాదులకు అంతే లేదు.


అడవి రమణ ఎవరు? 

చౌడేపల్లె మండలం చారాల గ్రామస్థుడైన రమణ మాజీ నక్సల్‌గా మండలం చిరపరిచితుడు. గతంలో ఆ నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్యనేత అనుచరుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ని వ్యతిరేకించి బోయకొండ ఆలయ మాజీ ఛైర్మన్‌ ఎస్‌కే రమణారెడ్డి అనుచరుడిగా మారారు. అప్పట్నుంచే అతడిని కష్టాలు చుట్టుముట్టాయి. అధికార పార్టీ ముఖ్యనేత ఒత్తిళ్లతో ముఖ్యంగా పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయన్న ఆరోపణలున్నాయి. తాజాగా సీఐడీ అధికారులు భూ కుంభకోణంలో యాదమరికి చెందిన నిందితులతో ఇతడు చేతులు కలిపి రూ. 50 లక్షల నగదు తీసుకున్నాడంటూ కేసులో చేర్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-10-04T07:43:33+05:30 IST