Abn logo
Aug 30 2021 @ 18:10PM

తెలంగాణలో ఉప్పొంగుతున్న వాగులు, వంకలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో భారీ వర్షం పడింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగడంతో దుకాణాల్లో వరద నీరు చేరింది. దీంతో స్థానికులు, దుకాణాదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  

అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోను వానలు దంచికొడుతున్నాయి. యాదగిరి గుట్ట, అలేరు, రాజాపేట తదితర ప్రాంతాల్లో తీవ్ర వర్షం పడింది.  ఆలేరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలోకి వరద నీరు చేరింది. జిల్లాలోని ఆలేరు, కొలనుపాక వాగులు పొంగి పొర్లుతున్నాయి.  రంగారెడ్డి జిల్లాలోను భారీ వాన పడింది. దోమ మండలంలో పంటలు నీట మునిగాయి. రైతులకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది.