Abn logo
Jan 17 2021 @ 15:57PM

కశ్మీర్‌లో టెర్రరిస్టుల సంఖ్య తగ్గుముఖం: ఆర్మీ కమాండర్

శ్రీనగర్: కశ్మీర్ లోయలో టెర్రరిస్టుల సంఖ్య దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా తగ్గుముఖం పట్టినట్టు  చినార్ కార్ప్స్ జీఓసీ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు  ఆదివారంనాడు తెలిపారు. కశ్మీర్ లోయకు చెందిన యువకులను రకరకాల మార్గాల్లో ఉగ్రవాదంలో దింపేందుకు పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

'2020లో టెర్రిస్టుల రిక్రూట్ మెంట్ 2018తో పోల్చుకుంటే గణనీయంగా అదుపులో ఉంది. ప్రస్తుతం లోయలో 217 మంది టెర్రరిస్టులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఈ సంఖ్య అత్యల్పం' అని లెఫ్టినెంట్ జనరల్ రాజు అన్నారు. ఇప్పటికీ వివిధ మార్గాల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు పాక్ ప్రోత్సహిస్తూనే ఉందని అన్నారు. కొందరికి శిక్షణ ఇచ్చి ఎల్‌ఓసీ ద్వారా లోయలో చొరబాటుకు పంపుతోందని, పాక్ ఉగ్రవాదులు మన భద్రతా దళాలలను, రద్దీగా ఉండే ప్రాంతాల్లని పౌరులను టార్గెట్ చేసుకుంటున్నారని చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఉగ్రవాదుల చొరబాట్లను 70 శాతానికి పైగా మన బలగాలు తగ్గించ గలిగాయని చెప్పారు. ఎల్ఓసీ వెంబడి మన బలగాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నయని, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఆయుధాలు, మాదక ద్రవ్యాలను డ్రోన్లు, సొరంగాల ద్వారా పంపేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలు కచ్చితంగా భారత బలగాలకు సవాలేనని లెఫ్టినెంట్ జనరల్ రాజు చెప్పారు. కతువా జిల్లాలోని జీరో లైన్ సమీపంలో పాకిస్థాన్ భద్రతా అధికారులు నిర్మించిన ఒక సొరంగాన్ని భారత భద్రతా బలగాలు గత బుధవారంనాడు కనుగొన్నాయి. నవంబర్ నుంచి ఇంతవరకూ ఇలాంటి రెండు సొరంగాలను భారత బలగాలు పసిగట్టాయి. ఎల్ఏసీ వెంబడి పరిస్థితిని చర్చలతో పరిష్కరించు కోవాలని, భారత దేశం సహనాన్ని మాత్రం ఎవరూ పరీక్షించవద్దని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె సైతం ఈనెల 15న ఆర్మీడే సందర్భంగా చైనాకు పరోక్ష హెచ్చరిక చేశారు.

Advertisement
Advertisement
Advertisement