Abn logo
Sep 25 2021 @ 02:34AM

లేదంటూనే ఒత్తిడా?

కోర్టుకు ఒకలా.. కాలేజీలతో మరోలానా?

ఎయిడెడ్‌ సిబ్బంది స్వాధీనంపై స్మార్ట్‌గా ఉన్నారు

మేం మరింత స్మార్ట్‌గా వ్యవహరించగలం

అధికారుల తీరుపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం


అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని యాజమాన్యాలను అధికారులు ఒత్తిడి చేయడంపై హైకోర్టు మండిపడింది. సిబ్బందిని సరెండర్‌ చేయాలని బలవంతం చేయటం లేదని న్యాయస్థానానికి చెబుతూ...యాజమాన్యాలతో మరోవిధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో పోస్టులను ప్రభుత్వానికి సరెండర్‌ చేసేలా యాజమాన్యాలను ఒప్పించాలంటూ కడప జిల్లా డీఈవో దిగువ సిబ్బందికి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. ఈ వ్యవహారంపై కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్న అధికారులపై ఏమి చర్యలు తీసుకున్నారో కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. విచారణను ఈనెల 29కి వాయిదావేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది.


ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఆర్థిక సహాయం నిలిపివేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభత్వం, విద్యాసంస్ధలను ప్రైవేటుగా నిర్వహించుకోవాలని, లేదా తమకు అప్పగించాలని కోరుతూ ఏపీ విద్యా చట్టాన్ని సవరిస్తూ 12/2021 ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్‌తోపాటు తదనంతరం జారీచేసిన జీవో 50ని సవాల్‌చేస్తూ, శ్రీ సరస్వతి కమిటీ ఎయిడెడ్‌ అప్పర్‌ ప్రైమరీ పాఠశాల కరస్పాండెంట్‌ దాసరి వెంకట సుబ్బారావు, పలు ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎన్‌.సుబ్బారావు వాదనలు వినిపిస్తూ...‘‘ఎయిడెడ్‌ పోస్టులను సరెండర్‌ చేయాలని యాజమాన్యాలను అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కడప జిల్లా డీఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని కోర్టు ముందు ఉంచాం’’ అని తెలిపారు. ఈ వివరాలపై ధర్మాసనం, ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరింది. విద్యాశాఖ తరఫున న్యాయవాది రఘువీర్‌ స్పందిస్తూ... ‘‘యాజమాన్యాలు అంగీకరిస్తేనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నాం. బలవంతం చేయడం లేదు. ఒత్తిడి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు. ఈ వివరణపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. కడప డీఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ గురించి ప్రస్తావించింది. దీనిపై పాఠశాల విద్యా డైరెక్టర్‌ స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.