ఓటీఎస్‌కు ఒత్తిడి

ABN , First Publish Date - 2021-12-07T06:15:42+05:30 IST

పేదల ఇళ్లకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) విషయంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నది.

ఓటీఎస్‌కు ఒత్తిడి

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి

స్వచ్ఛందమే తప్ప బలవంతం లేదని పైకి ప్రకటనలు

అధికారులకేమో అంతర్గతంగా టార్గెట్లు

ఓటీఎస్‌ చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని కింది స్థాయి సిబ్బంది హెచ్చరికలు

అప్పు చేసి చెల్లించాల్సి వస్తున్నదని లబ్ధిదారుల ఆవేదన

జిల్లాలో తొలివిడత 1.24 లక్షల మంది నుంచి రూ.184 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం

ఇంతవరకు 10,456 మంది నుంచి రూ.11.29 కోట్లు మాత్రమే వసూలు 

ఈ నెల 20వ తేదీ వరకే గడువు

రోజుకు రూ.12.35 కోట్లు వసూలు సాధ్యమేనా!


విశాఖపట్నం/చోడవరం/అనకాపల్లి/అచ్యుతాపురం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):


పేదల ఇళ్లకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) విషయంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నది. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం కింద లబ్ధిదారులు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే ఇంటిని/స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించి పట్టా ఇస్తామని, ఇందులో బలవంతం ఏమీ లేదని ఒకవైపు చెబుతూ...మరోవైపు అధికారులకు ఓటీఎస్‌ వసూళ్ల లక్ష్యాన్ని విధించింది. దీంతో మండల, గ్రామ స్థాయి అధికారులు తమ పరిధిలోని గ్రామ/వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బందిపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. దీంతో లక్ష్యాలను చేరుకునేందుకు సిబ్బంది ఒక అడుగు ముందుకేసి లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. ఓటీఎస్‌ చేయించుకోకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని హెచ్చరిస్తున్నారు. కుటుంబ పరిస్థితి బాగాలేదని, సొమ్ము చెల్లించలేమని లబ్ధిదారులు వేడుకుంటున్నా కనికరించడం లేదు. దీంతో చేతిలో డబ్బులు లేకపోయినా...అప్పు చేసి మరీ చెల్లించాల్సి వస్తున్నదని లబ్ధిదారులు వాపోతున్నారు.


గత నాలుగు దశాబ్దాల కాలంలో ప్రభుత్వ సాయంతో నిర్మించుకున్న ఇళ్లపై హక్కు (జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం) కల్పిస్తామంటూ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ పేరుతో లబ్ధిదారుల నుంచి డబ్బుల వసూళ్లకు వైసీపీ ప్రభుత్వం తెర తీసిన విషయం తెలిసింది. జిల్లాలో 1983 నుంచి 2011 వరకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను నాలుగు కేటగిరీలుగా విభజించారు. మొత్తం 4.3 లక్షల మంది లబ్ధిదారులు వున్నట్టు అధికారులు తేల్చారు. తొలివిడత వీరిలో 1.24 లక్షల మందికి (లబ్ధిదారులు జీవించి వుండి, ప్రభుత్వం మంజూరుచేసిన ఇంటిలో నివాసం వుంటున్నవారు) ఓటీఎస్‌ వర్తింపజేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, జీవీఎంసీలో రూ.20 వేల చొప్పున వసూలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరి నుంచి సుమారు రూ.184 కోట్లు వసూలు అవుతాయని అంచనా వేశారు. జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో సంబంధిత అధికారులు సమావేశాలు నిర్వహించి, ఓటీఎస్‌ టార్గెట్లు విధించారు. వీఆర్వో, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, వలంటీర్‌, సర్వేయర్లు తమ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించాలని, తరువాత ఓటీఎస్‌ కింద నిర్ణీత సొమ్ము చెల్లిస్తే శాశ్వత టైటిల్‌తో ఇంటిపై సర్వహక్కులు దఖలు పడతాయని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సుమారు మూడు వారాల నుంచి ఆయా అధికారులు, సిబ్బంది పూర్తిగా ఈ పనిలోనే నిమగ్నమయ్యారు. సోమవారం వరకు జిల్లాలో 10,456 మంది లబ్ధిదారుల నుంచి రూ.11,29,30,000 వసూలు చేశారు. ఇంకా లక్షా 14 వేల మంది నుంచి దాదాపు రూ.173 కోట్లు వసూలు చేయాలి. ఈ నెల 20వ తేదీలోగా మొదటి విడత లబ్ధిదారులకు ఓటీఎస్‌ ప్రక్రియ పూర్తిచేయాలని, ఆ మేరకు రోజువారీ టార్గెట్లు విధించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ లెక్కన జిల్లాలో రోజుకు సగటున రూ.12.35 కోట్లు వసూలు చేయాలి. రోజూ ఉదయం, సాయంత్రం హౌసింగ్‌ ఎండీ, ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండడంతో ఎవరి స్థాయిలో వారు కిందిస్థాయి అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో వీరు తమ పరిధిలోని లబ్ధిదారులను కలిసి ఓటీఎస్‌ కింద సత్వరమే డబ్బులు చెల్లించాలని పట్టుబడుతున్నారు. కొన్నిచోట్ల నచ్చజెబుతుండగా, మరికొన్నిచోట్ల ఒక అడుగు ముందుకేసి డబ్బులు చెల్లించాల్సిందేనని, లేకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బెదిరింపు ధోరణిలో లబ్ధిదారులను హెచ్చరిస్తున్నారు.  


స్వచ్ఛందమంటూనే బెదిరింపులు!

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేయించుకోవడంపై బలవంతం ఏమీలేదని, లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం కింద రిజిస్ట్రేషన్‌ చేయించి పట్టా ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ అధికారులకు మాత్రం మరో విధంగా మౌఖిక ఆదేశాలు జారీచేస్తున్నది. దీంతో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఈ నెల 20 వరకే గడువు

పి.శ్రీనివాసరావు, ప్రాజెక్టు డైరెక్టర్‌, గృహనిర్మాణ సంస్థ

లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకొస్తేనే ఓటీఎస్‌ అమలు చేస్తాం. అంతే తప్ప ఎవరిపైనా ఒత్తిడి తీసుకురావడం లేదు. ఈ పథకం వల్ల ప్రయోజనం వుంటుందని లబ్ధిదారులకు వివరిస్తున్నాం. జిల్లాలో తొలివిడత 1.24 లక్షల మందికి ఓటీఎస్‌ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు 10,456 మంది నుంచి రూ.11.29 కోట్లు వసూలైంది. ఈ నెల 20వ తేదీ వరకే గడువు ఉంది. 21వ తేదీ నుంచి లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపడతాం. 7వ తేదీన ఆనందపురంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రిజిస్ట్రేషన్లను శ్రీకారం చుడతారు. 

 

రూ.10 వేలు కట్టకపోతే పథకాలు ఆపేస్తామంటున్నారు

పత్తి సత్తిబాబు, సకురువీధి, చోడవరం

నేను సోడాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాను. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు అయ్యింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతోపాటు కష్టపడి దాచుకున్న సొమ్ముతో మా స్థలంలో ఇల్లు కట్టుకున్నాం. ఇటీవల గ్రామ వలంటీరు వచ్చి ఇంటి పట్టా కోసం రూ.10 వేలు కట్టాలని, లేకపోతే వడ్డీతో కలిపి రూ.40 వేల వరకు చెల్లించాల్సి వుంటుందని చెప్పాడు. డబ్బులు కట్టకపోతే ప్రభుత్వ పఽథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నాడు. సోడాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నాకు రూ.10 వేలు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలో అర్థం కావడం లేదు.

Updated Date - 2021-12-07T06:15:42+05:30 IST