Abn logo
Sep 27 2021 @ 00:34AM

సారా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు : ఎస్‌ఐ రంజిత్‌

నాటుసారా అమ్మకాలు జరపబోమని వ్యాపారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న సీలేరు ఎస్‌ఐ రంజిత్‌


సీలేరు, సెప్టెంబరు 26: కల్లు, నాటుసారా అమ్మకాలను జరపబోమని వ్యాపారస్థులతో సీలేరు ఎస్‌ఐ రంజిత్‌ ఆదివారం ప్రతిజ్ఞ చేయించారు. సీలేరులోని దుర్గావీధి, అల్లూరివీధి, మసీద్‌వీధి, సీపీహెచ్‌క్యాంప్‌, చింతపల్లి క్యాంప్‌, గాజువాక లైన్స్‌ వీధుల్లో విచ్చలవిడిగా నాటుసారా, కల్లు అమ్మకాలు జరుపుతున్నారని, దీనివల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని డ్వాక్రా మహిళలు ఇటీవల సీలేరు ఎస్‌ఐ రంజిత్‌కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీలేరులో వివిధ ప్రాంతాల్లో కల్లు, సారా అమ్మకాలు జరుపుతున్న వారందరిని స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించారు. ఇది మొదటి తప్పుగా భావించి విడిచిపెడుతున్నామని, ఇకపై ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా   వ్యాపారులతో కల్లు, సారా అమ్మకాలు జరపబోమని ప్రతిజ్ఞ చేయించారు.