కఠినంగా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-05T08:09:43+05:30 IST

కరోనా కట్టడికి కట్టుదిట్టమైన నిబంధనలతో కర్ఫ్యూ అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. కర్ఫ్యూ నిబంధనలతో మంగళవారం జీవో జారీ చేసింది

కఠినంగా కర్ఫ్యూ

నేటి నుంచి రెండు వారాలపాటు అమలు

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే సడలింపు

ఆ తర్వాత సకల కార్యకలాపాలూ క్లోజ్‌

బస్సులు, ప్రైవేటు వాహనాలూ బంద్‌

అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేత

మధ్యాహ్నం 12లోపు గమ్యం చేరుకోవాలి

అత్యవసర సేవలు, వస్తు రవాణాకు ఓకే

రోగులకు, టీకాలకు వెసులుబాట్లు

పరిశ్రమలు, సాగు కార్యకలాపాలకూ ఓకే

పెళ్లిళ్లకు 20 మందికి మాత్రమే అనుమతి

ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు


అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి కట్టుదిట్టమైన నిబంధనలతో కర్ఫ్యూ అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. కర్ఫ్యూ నిబంధనలతో మంగళవారం జీవో జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు వారాలపాటు... అంటే, ఈ నెల 18వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.  మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసర సేవలు, సరకు రవాణాతోపాటు మరికొన్ని రంగాలకు మాత్రమే మినహాయింపునిచ్చారు. ఉదయం 6నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ ఆరు గంటలపాటు అన్ని రకాల కార్యకలాపాలు, రాకపోకలకు అనుమతి ఇస్తారు. అయితే ఇప్పుడుకూడా 144సెక్షన్‌ అమల్లో ఉంటుంది. అంటే జనం గుంపులుగా తిరగడానికి వీల్లేదు. మధ్యాహ్నం 12 తర్వాత అన్ని సంస్థలు, షాపులు, కార్యాలయాలు, విద్యా సంస్థ లు, హోటళ్లు మూసివేయాల్సిందే. ప్రజా రవాణా నిలిచిపోతుం ది. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలూ రోడ్డెక్కడానికి వీల్లేదు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కూడా మూసివేస్తారు. ప్రయాణికులుఉ న్న ప్రైవేటు బస్సులు, కార్లు అనుమతించరు. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయింపు ఉంటుంది. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఈ జీవో (జీ-192) జారీ చేశారు.


ఈ రంగాలకు మినహాయింపు...

  • ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులు.
  • టెలీకమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థలు
  • పెట్రోలు పంపులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్‌ విక్రయ కేంద్రాలు. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలు
  • నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు. శీతల, సాధారణ గిడ్డంగుల సంస్థలు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు
  • ఉత్పాదక తయారీ పరిశ్రమలు. (ప్రమాణాల ప్రకారం నడుచుకోవాలి), వ్యవసాయ పనులు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది.


వీరి రాకపోకలకు ఓకే...

అత్యవసర సేవలందించే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ, హైకోర్టు, ఇతర కోర్టులు, స్థానిక సంస్థల అధికారులు డ్యూటీ పాస్‌తో రాకపోకలు సాగించవచ్చు. వైద్య, ఆరోగ్య సిబ్బంది, గర్భిణులు, వైద్యం అవసరం ఉన్న ఇతర రోగులు., వ్యాక్సిన్‌ కోసం వెళ్లేవారు. తగిన టికెట్‌ ఉంటే ఎయిర్‌పోర్టు, బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది.


20 మందితోనే పెళ్లి వేడుక...

ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకుని, వాయిదా వేసుకోలేని పరిస్థితి ఉన్న పెళ్లిళ్లలను 20మందితో మాత్రమే జరుపుకోవాలి. దీనికి కూడా స్థానిక అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి.


కట్టుదిట్టంగా అమలు...

కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు, పోలీసు కమిషనర్లు, కలెక్టర్లు కర్ఫ్యూ నిబంధనల అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ‘‘ఆంక్షల నుంచి మినహాయింపు ఉన్నవారికోసం పాస్‌లు ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. నిబంధనలను ఉల్లంఘించే వారిపై విపత్తు చట్టం-2005లోని 51-60 సెక్షన్‌లతోపాటు... ఐపీసీలోని సెక్షన్‌ 188, ఇతర చట్టాల కింద చర్యలు తీసుకోవాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-05T08:09:43+05:30 IST