Abn logo
Sep 24 2021 @ 23:56PM

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్నచైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి

 మౌలిక  వసతులకు పెద్దపీట... అమీన్‌పూర్‌ మున్సిపల్‌  చైర్మన్‌ 

పటాన్‌చెరు, సెప్టెంబరు 24: అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ ఛైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 8కోట్లతో భూగర్బడ్రైనేజీలు, 2.75కోట్ల సీసీ రోడ్లు, 4.75కోట్ల ఇతర అభివృద్ధి పనులకు  కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ టీఎస్‌ బీ పాస్‌ ద్వారా అత్యంత పారదర్శకంగా ఎవరి జోక్యం లేకుండా నిర్మాణాలకు అనుమతులు జారీ అవుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్‌ బీపాస్‌ను  సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.  ప్రభుత్వ స్థలాలు, చెరువు శికం, ఎఫ్‌టీఎల్‌ భూముల్లో నిర్మాణాలు చేపడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. పెరుగుతున్న కాలనీలు, జనావాసాలకు అనుగుణంగా మౌళిక వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం ఇస్తున్న నిధులతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.  తక్కువ వ్యవధిలో రికార్డు స్థాయి పనులు చేస్తున్నామన్నారు. నిధుల కేటాయింపుల్లో ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకోకుండా అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ నందారం నర్సింహాగౌడ్‌, కమిషనర్‌ సుజాత, పలు శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.