సరుకులు తెస్తున్నారా?

ABN , First Publish Date - 2020-04-15T16:14:56+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సూపర్‌మార్కెట్లకు, షాపులకు వెళ్లి సరుకులు, కూరగాయలు, పండ్లు, ప్యాకింగ్‌ వస్తువులు కొని తెచ్చుకొని నిల్వ చేసుకుంటున్నాం. కానీ వాటిని ఇంటికి

సరుకులు తెస్తున్నారా?

ఆంధ్రజ్యోతి(15-04-2020)

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సూపర్‌మార్కెట్లకు, షాపులకు వెళ్లి సరుకులు, కూరగాయలు, పండ్లు, ప్యాకింగ్‌ వస్తువులు కొని తెచ్చుకొని నిల్వ చేసుకుంటున్నాం. కానీ వాటిని ఇంటికి తెచ్చిన వెంటనే సరైన పద్ధతిలో శుభ్రం చేయడం మాత్రం మర్చిపోతున్నాం. సరుకులు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...


కొన్ని రకాల వస్తువుల ఉపరితలంపై కరోనా వైరస్‌ 72 గంటల పాటు జీవిస్తుంది. సరుకులు కొనడానికి వెళ్లే ముందు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి వెళ్లండి. సామాజిక దూరం పాటించండి. ఫోను, ముఖం, కళ్లు, చెవులు, ముక్కు, నోటిని తాకకండి. దూరం వెళ్లకుండా దగ్గరలోని షాపులో సరుకులు తీసుకోండి. 


సూపర్‌ మార్కెట్లో ఇలా!

సూపర్‌ మార్కెట్‌లో చాలా వస్తువులను చేతులతో పట్టుకునే జరుపుతారు. కాబట్టి అవి వైరస్‌ వాహకాలుగా మారే ప్రమాదం ఉంది.


సూపర్‌ మార్కెట్లోని వస్తువులు అన్నింటినీ ఎవరో ఒకరు చేతులతో తాకి ఉంటారు. వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉండి ఉండొచ్చు. కాబట్టి సరుకులు వేసుకునే ట్రాలీ, బాస్కెట్‌ల హ్యాండిల్స్‌ను ముందుగా శానిటైజ్‌ చేయండి. సరుకులు కొన్నాక చేతులను నీటితో కడిగి హ్యాండ్‌ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి. 


సూపర్‌ మార్కెట్లో అనారోగ్యంతో బాధపడే వ్యక్తులకు దగ్గరగా మసలే అవకాశాలు ఎక్కువ. సామాజిక దూరం పాటించడం చాలా కష్టం. వరుసలో ఉన్నప్పుడు ఎవరైనా మీకు దగ్గరగా వస్తే  ‘‘దయచేసి ఆరు అడుగుల ఎడం పాటించండి’’ అని చెప్పండి. మీరు తీసుకోవాలనుకునే వస్తువులను మరెవరైనా తీసుకుంటుంటే...సమీపానికి వెళ్లకుండా వేచి ఉండండి. 


మీరు కొనాలనుకున్న వస్తువులను మాత్రమే తాకండి. 


సూపర్‌ మార్కెట్లకు వెళ్లడానికి బదులు అవకాశం ఉంటే వీధివ్యాపారుల దగ్గర కొన్నా, హోమ్‌ డెలివరీ తీసుకున్నా రిస్క్‌ తగ్గుతుంది. దానివల్ల ఎక్కువమంది ఆ వస్తువులను తాకే అవకాశం తగ్గుతుంది. 


సరుకులు తెచ్చాక

సరుకుల కోసం ఇంటి నుంచి సొంత సంచీని తీసుకెళ్లండి. తిరిగొచ్చాక సంచీని ఇంటి బయట ఉంచి శుభ్రం చేయండి. సరుకులను ప్యాకింగ్‌ చేసిన మెటీరియల్‌పైన కొన్ని రోజుల పాటు కరోనా వైరస్‌ జీవిస్తుంది. కాబట్టి శుభ్రమైన వస్త్రంతో సరుకుల పైన ఉండే దుమ్మును తొలగించండి. తరువాత ఆ వస్ర్తాన్ని పడేయండి. అప్పుడు మీ మాస్క్‌ను తొలగించండి. 


ఇంటిలో సరుకులు సర్దేటప్పుడు...

సంచీలో నుంచి సరుకులు బయటకు తీసి వంటగదిలో శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి. తరువాత కనీసం 20 సెకన్ల పాటు నీటితో చేతులను శుభ్రంగా కడగండి. 


పండ్లు, కూరగాయలను కనీసం 30 సెకన్ల పాటు చల్లటి నీటిలో కడగండి.

బంగాళదుంపలు, క్యారెట్‌ లాంటి దుంపజాతి కూరగాయలను బాగా కడగండి. 


ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే ఆహార పదార్థాలను ఒక్కసారే తెచ్చుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. కాబట్టి పలుమార్లు మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. 


క్యాన్‌లు, బాక్స్‌ల లాంటివాటిని శుభ్రంగా తుడవడం, కడగడం వల్ల వైరస్‌ ప్రభావం తగ్గుతుంది.


వంట చేసే ముందు, చేశాక తప్పనిసరిగా చేతులు సబ్బుతో కడగాలి. 


కూరగాయ వ్యర్థాలను మూత ఉన్న డస్ట్‌బిన్‌లో వేసి ఇంటి బయట ఉంచాలి. 


సరుకులు టేబుళ్ల ఉపరితలాలను శుభ్రంగా కడగాలి. 


ఒకవేళ మీరు క్లాత్‌బ్యాగ్‌లు వాడితే సబ్బుతో శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేసి, పూర్తిగా ఆరాక వాటిని తిరిగి వాడుకోవాలి. 

Updated Date - 2020-04-15T16:14:56+05:30 IST