సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌

ABN , First Publish Date - 2020-07-02T10:36:23+05:30 IST

కరోనా ప్రభావంతో బొగ్గు అమ్మకాలు నిలిచిపోవడం, బొగ్గు రవాణాలు స్థంభించిపోయిన తరుణంలో బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణ, బొగ్గు గనుల

సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌

 కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కార్మిక సంఘాల నిరసన

 కోల్‌బెల్ట్‌లో మూడు రోజుల సమ్మెకు పిలుపు

 ఒక్కరోజు సమ్మెకే టీబీజీకేఎస్‌ నిర్ణయం


ఇల్లెందు/రుద్రంపూర్‌, జూలై 1: కరోనా ప్రభావంతో బొగ్గు అమ్మకాలు నిలిచిపోవడం, బొగ్గు రవాణాలు స్థంభించిపోయిన తరుణంలో బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణ, బొగ్గు గనుల వేలంను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు బొగ్గు గనుల్లో కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దశల వారీగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బొగ్గు గనులను, బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌ పరం చేసేందుకు పూనుకోవడంతో ప్రభుత్వ రంగంలోని బొగ్గు పరిశ్రమలను కాపాడుకునేందుకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునివ్వడం, సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో సింగరేణి కాలరీస్‌లో గురువారం ఉదయం సమ్మె ప్రారంభమవుతుంది.


ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ సంఘాలతోపాటు టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ సైతం బొగ్గు గనులో ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఒక రోజు సమ్మెకు పిలుపునివ్వడంతో సింగరేణిలో కార్మికుల సమ్మె సంపూర్ణంగా జరుగుతుందని భావిస్తున్నారు. నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య(ఏఐటియుసి), బి.జనక్‌ప్రసాద్‌, రియాజ్‌ అహ్మద్‌ (హెచ్‌ఎంఎస్‌), కెంగర్ల మల్లయ్య(బీఎంఎస్‌), మంద నర్సింహరావు, (సీఐటియు), సాధినేని వెంకటేశ్వరరావు(ఐఎఫ్‌టియు),   వై. గట్టయ్య, ఏవీ. రామారావు, త్యాగరాజన్‌, చింతల సూర్యనారాయణ, లట్టి జగన్మోహన్‌, మాధవ నాయక్‌ సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల్లో విస్తృతంగా సమ్మె ప్రచారం సాగించారు.

 

ఒక్క రోజు సమ్మెకే టీబీజీకెఎస్‌ పిలుపు

సింగరేణి కాలరీస్‌లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) జూలై2న ఒక్కరోజు సమ్మెకే పిలుపునిచ్చింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నడుమ నెలకొన్న తీవ్ర విబేదాలు, ఆరోపణలు, కరోనా వైఫల్యాలపై జరుగుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర వైఖరిపై ప్రత్యక్షంగా టీఆర్‌ఎస్‌ తమ అనుబంధ కార్మిక సంఘంతో బొగ్గు గనుల్లో ఒక్కరోజు సమ్మెకు సిద్దపడటం, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-07-02T10:36:23+05:30 IST