సమ్మె సైరన్‌!

ABN , First Publish Date - 2022-01-25T07:53:50+05:30 IST

డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్‌ మోగించారు. నాలుగు జేఏసీలతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలతో కూడిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సోమవారం మూడు పేజీల సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందించారు.

సమ్మె సైరన్‌!

  • సర్కారుకు ఉద్యోగుల సమ్మె నోటీసు
  • 3 పేజీల నోటీసులో ఉద్యమకార్యాచరణ
  • 6 అర్థరాత్రి నుంచే సమ్మెలోకి ఉద్యోగులు
  • రివర్స్‌ పీఆర్సీ రద్దు చేస్తేనే చర్చలకు
  • నోటీసులో తెగేసి చెప్పిన నాయకులు
  • మేము సైతం అన్న ప్రజారోగ్యసంఘం
  • మద్దతిస్తూ వేరుగా సమ్మె నోటీసు
  • నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు
  • వాడీవేడీ చూపేందుకు ఉద్యోగులు సిద్ధం


అమరావతి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్‌  మోగించారు. నాలుగు జేఏసీలతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలతో కూడిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సోమవారం మూడు పేజీల సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందించారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని స్పష్టంచేశారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు చర్చలకు కూడా రాబోమని తెగేసి చెప్పారు. పీఆర్సీ సాధన సమితిలోని 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఈ నోటీసుతో సచివాలయానికి వెళ్లారు. సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి నోటీసు ఇవ్వాలని భావించగా, ఆయన అప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దీంతో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను ఆయన చాంబరులో కలుసుకుని నోటీసు అందించారు. అంతకుముందు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం సచివాలయంలో జరిగింది. మిగతా ఉద్యోగ జేఏసీలతోపాటు సమ్మెకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.


అనంతం సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.. మిగతా జేఏసీల నేతలతో కలిసి సమ్మె నోటీసుకు తుదిమెరుగులు దిద్దారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రౌంట్‌టేబుల్‌ సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలను సోమవారం భేటీఅయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం క్రోడీకరించింది. ఈ అభిప్రాయాల్లో హెచ్చుభాగం సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకే మొగ్గుచూపడంతో.. ఆ సంఘం సమ్మె నిర్ణయం తీసుకుంది. అనంతరం సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మిగతా జేఏసీల నేతలతో భేటీ అయి నోటీసుకు ఉద్యమ కార్యచరణను జోడించాలని నిర్ణయించారు. అంతా కలిసి ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కాగా, ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ధర్నాలు, నిరసన ర్యాలీల్లో పాల్గొంటారు. ఇదిలాఉండగా, జేఏసీల ఉద్యమ కార్యాచరణకు పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ యూనియన్‌ మద్దతు ప్రకటిస్తూ.. వేరుగా సమ్మె నోటీసు అందించింది. 


ఆషామాషీ ఉద్యమంకాదు: సూర్యనారాయణ

ఇది ఆషామాషీ ఉద్యమం కాదని, దీని తీవ్రతను ప్రభుత్వం గ్రహించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. ‘‘ఈ రోజు చాలా బాధాకరమైన రోజు. ఉద్యోగుల కనీస ప్రయోజనాలు తీరడం కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాల్సి వస్తుందని మేం అనుకోలేదు. ఉద్యోగుల పట్ల సర్కారు వైఖరిలోనే అసలు లోపం ఉంది. అనేక సార్లు సంప్రదింపులు చేసినా మా ఏ అభ్రిప్రాయలను పరిగణనలోకి తీసుకోలేదు. పీఆర్సీ జీవోలపై అసంతృప్తిని వెళ్లగక్కినా ప్రభుత్వం ఏ దశలోనూ పట్టించుకోలేదు. దీనికి నిరసనగానే ఉద్యమంలోకి వెళుతున్నాం. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని, జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని సీఎ్‌సను గత శుక్రవారం కలిసి కోరాం. దానిపైనా స్పందన లేదు. చర్చలని అనడమేగానీ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రావడంలేదు. ఉద్యోగులనే కాదని ప్రభుత్వం ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో జేఏసీల రౌండ్‌ టేబుల్‌లో వచ్చిన అభిప్రాయం మేరకు సమ్మె నోటీసు ఇచ్చాం. ఆర్టీసీతో సహా ట్రేడ్‌ యూనియన్లు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నాయి’’ అని సూర్యనారాయణ తెలిపారు. 


నివేదిక ఎందుకు దాచారు?: వెంకట్రామిరెడ్డి

పీఆర్సీ జీవోల వల్ల రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ నష్టం జరిగిందని ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విమర్శించారు. సచివాలయంలో జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించుకుని... సచివాలయ ఉద్యోగులు  కూడా పీఆర్సీ సాధన సమితి ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాలని ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు. సచివాలయ సంఘం ఎప్పుడు బయట ఉద్యోగ సంఘాలతో కలిసి వెళ్లదని.. ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ప్రభుత్వమే ఆలోచించుకోవాలన్నారు. ‘‘అశుతోశ్‌మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయాలి. మేం ప్రభుత్వం చెప్పిన కొన్ని అంశాల్లో  రాజీ పడ్డాం.  కానీ హెచ్‌ఆర్‌ఏలో కోత, వేతనంలో రికవరీ, సీసీఎ ఎత్తివేత, క్వాంటమ్‌ పెన్షన్‌ స్లాబులు ఎత్తి వేత.. ఇలా అన్ని విధాలుగా ఉద్యోగులను నష్టపరిచేలా నూతన పీఆర్సీని ప్రకటించారు. కాబట్టే పీఆర్సీ జీవోల రద్దును కోరుతున్నామ’’ని వెంకట్రామిరెడ్డి వివరించారు. 


జీవో ఇచ్చాక కమిటీనా?: బొప్పరాజు

ఉద్యోగుల ఆందోళనను ప్రతిబింబించేలా ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘మంత్రుల కమిటీని పీఆర్సీ కి ముందే వేస్తారు. పీఆర్సీ జీవోలు ఇచ్చిన తర్వాత చర్చల కోసం అంటూ కమిటీ వేయడం విడ్డూరం. ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా మా ఉద్యమానికి పోలీసులు సహకరించాలి. పీఆర్సీ విషయంలో అశుతోశ్‌మిశ్రా, సెంట్రల్‌ పే కమిషన్‌, అధికారుల కమిటీ నివేదిక... ఇలా ఏకమిటీలోని అంశాలను కూడా ప్రభుత్వం పూర్తిగా తీసుకోలేదు. ఒక్కోదాంట్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎవరికీ ఆమోద యోగ్యం కాని పీఆర్సీ ఇచ్చింది’’ అని బొప్పరాజు విమర్శించారు. 


గత సంప్రదాయాలు తుంగలోకి..

ప్రభుత్వం గత సంప్రదాయాలను తుంగలో తొక్కిందని ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్‌ హృదయరాజు మండిపడ్డారు. ఆరోగ్యశాఖ ఉద్యోగులు కూడా ఉద్యమంలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సెక్రటరీ జనరల్‌ ఆస్కారరావు పిలుపునిచ్చారు. పీఆర్సీ వల్ల ప్రయోజనాలు పెరుగుతాయనుకుంటే.. నష్టమే జరిగిందని ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత వైవీరావు అన్నారు.


తీసుకోని జీతాలకు హడావుడి ఎందుకు?

12 సార్లు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లినా ఉద్యోగులకు న్యాయం జరగలేదని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు అన్నారు. ‘‘మా గాయాలకు ప్రభుత్వం వెన్నపూస పూస్తుందో, కారం రాస్తుందో చూస్తాం. పీఆర్సీ జీవోల రద్దు, లేదంటే అబయెన్సులో పెట్టి పాత జీతాలు ఇచ్చి.. అశుతోశ్‌మిశ్రా నివేదిక బయటపెడితేనే చర్చలకు వెళతాం. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే ర్యాలీలు, ధర్నాలో ప్రభుత్వానికి మా వాడీవేడి చూపిస్తాం. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తీసుకోవాలని ఉద్యోగులకే లేనప్పుడు... వేతనాల ప్రక్రియపై ట్రెజరీ ఉద్యోగులను ప్రభుత్వం ఎందుకు అంతలా ఒత్తిడి పెడుతుందో అర్థం కావడం లేదు’’ అని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. - బండి శ్రీనివాసరావు


సమ్మె నోటీసులో...

అశుతోశ్‌ మిశ్రా కమిటీ నివేదికను ఉద్యోగులకు ఇవ్వాలి.  

ఫిట్‌మెంట్‌పై పునఃసమీక్ష జరిపాలి. 

హెచ్‌ఆర్‌ఏ పాత స్లాబులను అమలు చేయాలి. విభజన తర్వాత రాష్ట్రానికి 

తరలివచ్చిన సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు గతంలో ఉన్న హెచ్‌ఆర్‌ఏనే అమలు చేయాలి.

సీసీఏను కొనసాగించాలి.

పెన్షనర్లకు అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ గతంలోలాగానే కొనసాగించాలి.

విశ్రాంతి ఉద్యోగులకు 01-07-2018 నుంచి గ్రాట్యుటీ వర్తింపజేయాలి. 

ఒక నెల వేతనం లేక రూ.30 వేలు మట్టి ఖర్చులుగా ఇవ్వాలి.  

కేంద్ర పీఆర్సీలోని అంశాల వర్తింపును నిలిపివేయాలి.

సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరించాలి.

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలి. 

క్యాంటిజెంట్‌, ఎన్‌ఎంఆర్‌ డైలీ వేజెస్‌, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ‘సమాన పని-సమాన వేతనం’ అనే విధానాన్ని అమలు చేయాలి. 

Updated Date - 2022-01-25T07:53:50+05:30 IST