Abn logo
Sep 26 2021 @ 23:38PM

నేటి బంద్‌కు మద్దతివ్వండి

రంపచోడవరంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న న్యూడెమోక్రసీ నాయకులు

  • అన్నివర్గాల ప్రజలు రైతుకు అండగా నిలవండి
  • స్వచ్ఛందంగా మూసివేయనున్న విద్యాసంస్థలు 
  • సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు 

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 26: రైతులకు తీవ్రమైన అన్యాయం చేసేలా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని, విశాఖస్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని తదితర డిమాండ్ల కోసం రైతు, కార్మిక సంఘాలు సోమవారం నిర్వహించతలపెట్టిన భారత్‌బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు కోరారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు మద్దతు తెలిపి అన్నంపెట్టే రైతుకు అండగా నిలవాలని ఆయన కోరారు. బంద్‌కు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మద్దతు తెలిపిందని, సినిమా థియేటర్స్‌ యాజమాన్యాలు ఉదయం ఆట నిలిపివేతనున్నాయని, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేయనున్నారని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బంద్‌కు మద్దతు ఇవ్వడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంఘీభావం తెలిపిందన్నారు. భారత్‌బంద్‌కు దేశంలోని 19 రాజకీయపార్టీల మద్దతు ఇస్తున్నాయన్నారు. ప్రజాబలంతో ప్రధాని మోదీని ఇంటికి సాగనంపాలని ఆయన అన్నారు. ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్‌ నుంచి అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌ విజయవంతం చేసేలా ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయని మధు పేర్కొన్నారు.