రెడ్‌ జోన్‌లో పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2020-04-09T11:35:28+05:30 IST

రామగుండంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయిన అన్నపూర్ణకాలనీ, జీఎంకాలనీల్లో రెడ్‌జోన్లలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం ఈ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడా

రెడ్‌ జోన్‌లో పటిష్ట చర్యలు

కాంటాక్ట్‌లపై లోతుగా ఆరా 

పాజిటివ్‌ బాధితుల కుటుంబ సభ్యుల టెస్ట్‌ రిపోర్టులపై ఉత్కంఠ


కోల్‌సిటీ, ఏప్రిల్‌ 8: రామగుండంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయిన అన్నపూర్ణకాలనీ, జీఎంకాలనీల్లో రెడ్‌జోన్లలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం ఈ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడా చిన్న దారి లేకుండా పైపులతో బారికేట్లు కట్టారు. నాలుగు డి విజన్ల ఏరియాను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌టీపీసీ ప్రాంతంలోని 2వ డివిజన్‌, గోదావరిఖనిలోని 8, 9, 29డివిజన్ల పరిధి ఏరియాల్లో రెడ్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. 8, 9 డివిజన్లు పాక్షికంగా రెడ్‌జోన్‌లో ఉండగా, 29వ డివిజన్‌ పూర్తిగా రెడ్‌జోన్‌లో ఉంది. రెడ్‌జోన్‌లోకి పాలు, ఇతర నిత్యావసర వస్తువులను పంపుతున్నారు. కాగా రెడ్‌జోన్‌లలో కార్పొరేషన్‌ పారిశుధ్య సిబ్బంది పూర్తిగా సేవలందిస్తున్నారు. రామగుండంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. శాంపిల్స్‌ తీసి పరీక్షలకు పంపారు. ఈ నివేదికల కోసం రామగుండం ప్రాంతంలోని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక జీఎం కాలనీ పరిధిలోనే 100మందికి పైగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచగా, 46మందికి స్టాంపింగ్‌ వేశారు. సింగరేణి సంస్థ కూడా రెడ్‌జోన్‌ ప్రాంత కార్మికులు అత్యవసర పనులకు సైతం విధులకు రావద్దంటూ గనులపై బోర్డులు వేసింది. 


ఇద్దరు కానిస్టేబుళ్లకు హోమ్‌ క్వారంటైన్‌

గోదావరిఖని జీఎం కాలనీలో ఇంజనీరింగ్‌ విద్యార్థికి పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో దీని ప్రభావం పోలీస్‌, వైద్య, ఆరోగ్యశాఖ, అంగన్‌వాడీలపై సైతం పడింది. ఆ ఏరియాలో కరోనా బాధిత కుటుంబ సభ్యులు పాలుపోసిన కుటుంబాలకు స్టాంపింగ్‌ వేశారు. ఇందులో కమిషనరేట్‌ సీసీఎస్‌లో పని చేసే ఒక కానిస్టేబుల్‌ కుటుంబం కూడా ఉంది. అతడు ఒక అధికారి వద్ద విధులు నిర్వహించడంతో సదరు అధికారి కూడా హోమ్‌కార్వంటైన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తున్నది. ఇక రామగుండంకు చెందిన ఒక ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద గన్‌మెన్‌ గా విధులు నిర్వహించిన మరో కానిస్టేబుల్‌ సైతం హోమ్‌క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా బాధితుడి కుటుంబ సభ్యులతో కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులు సన్నిహితంగా ఉండడంతో ముందస్తు చర్యలుగా పో లీసులు అతడికి సైతం స్టాపింగ్‌ వేశారు. ఇక హెల్త్‌ సర్వే నిర్వహించిన ఇద్దరు సిబ్బంది సైతం హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 


రెడ్‌జోన్‌ పరిధిలో ప్రజలకు సేవలందించడంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు తండ్లాడుతున్నారు. ముఖ్యంగా శానిటేషన్‌, నిత్యావసర వస్తువుల సరఫరా, మంచినీటి సరఫరాపై దృష్టి పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెడ్‌జోన్‌లోనే ఉంటున్నారు. జీఎం కాలనీలో 29వ డివిజన్‌ కార్పొరేటర్‌ మహంకాళి స్వామి, 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ జనగామ కవిత, 8వ డివిజన్‌ కార్పొరేటర్‌ దాతు శ్రీనివాస్‌ రెడ్‌జోన్‌లో ఉన్న తమ డివిజన్ల ప్రజలను సౌకర్యాలు కల్పించేందుకు తాపత్రయ పడుతున్నారు. 

Updated Date - 2020-04-09T11:35:28+05:30 IST