అతిథీ... నీకు స్వాగతం!

ABN , First Publish Date - 2021-06-15T07:40:54+05:30 IST

ఆహార ప్రియులకు, ప్రత్యేకమైన వంటకాలకు నెల్లూరు ప్రసిద్ధి. నెల్లూరు మీదుగా దూరప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా నగరంలో ఆగి మరీ భోజనమో, ఉపాహారమో చేసి వెళుతుంటారు. భోజన, అల్పాహార ప్రేమికులకు నిత్యం రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలను అందించే నెల్లూరు హోటళ్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. ఒకప్పుడు కస్టమర్లతో కళకళలాడిన భోజనశాలలు కరోనా కాటుకు విలవిలలాడుతున్నాయి. అతిథులు ఎప్పుడొస్తారా..? అని ఎదురుచూస్తున్నాయి. ఈ రంగాన్నే నమ్ముకున్న లక్ష మందికిపైగా పనివారు కూడా ఉపాధి కోసం నిరీక్షిస్తున్నారు.

అతిథీ... నీకు స్వాగతం!

కరోనాతో హోటళ్లు వెలవెల

60 శాతంపైగా మూత

ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు

ఆర్థిక ఇబ్బందుల్లో యజమానులు

నెల్లూరు(సాంస్కృతిక ప్రతినిధి), జూన్‌ 14 :

ఆహార ప్రియులకు, ప్రత్యేకమైన వంటకాలకు నెల్లూరు ప్రసిద్ధి. నెల్లూరు మీదుగా దూరప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా నగరంలో ఆగి మరీ భోజనమో, ఉపాహారమో చేసి వెళుతుంటారు. భోజన, అల్పాహార ప్రేమికులకు నిత్యం రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలను అందించే నెల్లూరు హోటళ్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. ఒకప్పుడు కస్టమర్లతో కళకళలాడిన భోజనశాలలు కరోనా కాటుకు విలవిలలాడుతున్నాయి. అతిథులు ఎప్పుడొస్తారా..? అని ఎదురుచూస్తున్నాయి. ఈ రంగాన్నే నమ్ముకున్న లక్ష మందికిపైగా పనివారు కూడా ఉపాధి కోసం నిరీక్షిస్తున్నారు.

నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని హోటళ్లకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా, పర్యాటకంగా జిల్లా అభివృద్ధి చెందుతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేవారి సంఖ్య పెరగడంతో హోటల్‌ రంగానికి మంది ఆదరణ ఉండేది. జిల్లాలో పెద్ద, చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు కలిపి సుమారు 7వేలు ఉన్నాయి. అయితే కరోనా రాకతో 60శాతంపైగా హోటళ్లు మూత పడ్డాయి. కొవిడ్‌ మొదటి దశ ముగిసింది... మెల్లగా అయినా కోలుకుందాం అనుకునే సమయంలో రెండో దశ విజృంభించడంతో హోటల్‌ రంగం కుప్పకూలిపోయింది. కర్ఫ్యూ నిబంధనల నేపథ్యంలో శుభకార్యాలు కూడా బాగా తగ్గడంతో కేటరింగ్‌ ఆర్డర్లు కూడా సన్నగిల్లాయి. దీంతో లక్షమందికిపైగా పనివారు రోడ్డున పడ్డారు. మూడు షిప్టులలో పనిచేసి కుటుంబాలను పోషించుకునే సప్లయర్లు, క్లీనర్లు, వంటవాళ్లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది హోటళ్లు మూతపడటంతో ఏమి చేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కర్ఫ్యూ సడలింపు ఉన్నప్పటికీ అరపూట వ్యాపారం నడపలేక చాలా మంది హోటళ్లను మూసే ఉంచారు. అయితే హోటల్‌ నడపకపోయినా అద్దెలు, పన్నులు, కరెంటు బిల్లు, ఇతర ఖర్చులకు చెల్లింపులు చేయాల్సి ఉండటంతో యజమానులు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా జిల్లాలో హోటల్‌ రంగానికి నెలకు దాదాపు రూ.40కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా.  

ప్రభుత్వం ఆదుకోవాలి  

- అమరావతి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర హోటల్స్‌ సంఘం 

ఒకప్పుడు కళకళలాడిని హోటళ్లు ఇప్పుడు 20 శాతం కూడా జరగడం లేదు. హోటళ్లు అమ్ముకునే స్థితిలో చాలా మంది ఉన్నారు. దీనిపై ఆధారపడి లక్షలాది కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. నష్టాల్లో నడుస్తున్న ఈ రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.

Updated Date - 2021-06-15T07:40:54+05:30 IST