క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టువర్ట్ బిన్నీ

ABN , First Publish Date - 2021-08-31T01:16:39+05:30 IST

టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణం తప్పుకుంటున్నట్టు

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టువర్ట్ బిన్నీ

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణం తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఈ కర్ణాటక ఆటగాడు .. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నాడు.


1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ కుమారుడే స్టువర్ట్ బిన్నీ. రెండుసార్లు రంజీ ట్రోఫీ విజేత కూడా. తన రాష్ట్రమైన కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం, ట్రోఫీలు గెలవడం తనకు లభించిన గౌరవమన్నాడు. తనను ప్రోత్సహించిన కోచ్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.  


37 ఏళ్ల బిన్నీ భారత్ తరపున 23 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో ఆరు టెస్టులు, 14 వన్డేలు, రెండు టీ20లు ఉన్నాయి. అతడి ఫస్ట్ క్లాస్ క్రికెట్ 17 ఏళ్ల సుదీర్ఘ సమయం పాటు కొనసాగింది.


తన సొంత రాష్ట్రమైన కర్ణాటకకు 95 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఫస్ట్‌క్లాస్ కెరియర్‌లో మొత్తంగా 4,796 పరుగులు చేశాడు. 146 వికెట్లు పడగొట్టాడు. 2014లో బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన బిన్నీ ఆ టూర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.


మీర్పూర్‌లో జరిగిన వన్డేలో నాలుగు పరుగులకే ఆరు వికెట్లు తీసుకున్నాడు. భారత్‌కు ఏ ఫార్మాట్లో అయినా ఇదే అత్యుత్తమం. 2015 ప్రపంచకప్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. చివరిసారి 2016లో లాడెర్‌హిల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో బిన్నీ 32 పరుగులు చేశాడు.


2010లో ఐపీఎల్‌ కెరియర్‌ను ప్రారంభించిన బిన్నీ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2011-15 మధ్య రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. ఎన్‌సీఏ లెవల్-2 కోచ్ అయిన బిన్నీ.. కోచింగ్‌పై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2021-08-31T01:16:39+05:30 IST