విదేశాల్లో బిక్కుబిక్కు..

ABN , First Publish Date - 2020-03-30T09:16:01+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. వైరస్‌బారిన పడిన వారు లక్షకు మించి పోయారు. రోజు రోజుకు వ్యాధిగ్రస్తులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది

విదేశాల్లో బిక్కుబిక్కు..

ఇతర దేశాల్లో వేలాది మంది జిల్లా వాసులు              

అగ్రరాజ్యంలో మూడు వేల మంది పైనే పశ్చిమవాసులు

వచ్చేందుకు మార్గం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లోనే..


నరసాపురం, మార్చి 29: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. వైరస్‌బారిన పడిన వారు లక్షకు మించి పోయారు. రోజు రోజుకు వ్యాధిగ్రస్తులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ కలవరం జిల్లావాసుల్ని తాకింది. ఉద్యోగం, చదువు నిమిత్తం అమెరికాలో ఉన్న జిల్లా వాసుల సంఖ్య 3వేలపైనే ఉంది. అలాగే అనేక ఇతర దేశాల్లో కూడా వేలాది మంది జిల్లా వాసులు బిక్కుబిక్కుమంటూ గుడుపుతున్నారు. ప్రసారమాఽధ్యమాల్లో అక్కడి పరిస్థితిని చూసి జిల్లాలోని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ ఫోన్‌ చేసి వారి యోగక్షేమాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు స్వదేశానికి వచ్చే మార్గం లేకపోవడంతో అక్కడికి వెళ్లినవారంతా కొన్ని రోజుల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. తామున్న పరిస్థితి, ఇబ్బందుల్ని  వీడియోకాల్స్‌ ద్వారా తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులతో పంచుకుంటున్నారు. 


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కోరలు చాస్తోంది. ఎక్కువుగా  వాషింగ్టన్‌, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, డెల్లాస్‌ తదితర రాష్ర్టాలోనే ఎక్కువు ప్రభావం ఉంది. ఈప్రాంతాల్లోనే జిల్లావాసులు అధికంగా ఉన్నారు.  పది రోజుల నుంచి వీరంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. గుమ్మం దాటి బయటకు కూడా రావడం లేదు. ఇటు చదువు నిమిత్తం వెళ్లిన వారి పరిస్థితి కూడా ఇంతే. పార్ట్‌టైం ఉద్యోగాలు లేకపోవడంతో ఇళ్ళల్లోనే గడుపుతున్నారు అక్కడ వారు ఎదుర్కొంటున్న పరిస్థితిని అక్కడి నుంచి ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడారు. 


క్షణం.. క్షణం... భయం..ఉషా కల్యాణి, కాలిఫోర్నియా

నాది నరసాపురం.. పదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నా. ఇప్పటి వరకు సంతోషంగా గడిచిపోయింది. అయితే కరోనా అగ్రరాజ్యాన్ని కల్లోలంగా మార్చింది. రోజు రోజుకు మరణాలు, వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతుండడం అందర్ని భయాందోళనకు గురి చేస్తుంది. క్షణం.. క్షణం. భయంతో ఉంటున్నాం. ఉద్యోగం కూడా ఇంటి నుంచే చేయాల్సిన పరిస్థితి. బయటకు వస్తే.. ఏం జరుగుతుందోనన్న భయం, స్వదేశానికి వచ్చేద్దామంటే.... రాకపోకలు లేని పరిస్థితి


బయటకొచ్చి పది రోజులైంది..కావలి సత్యంద్ర, డెల్లాస్‌ 

నాది నరసాపురం.. ఐదేళ్ళ క్రితం కంపెనీ పనిమీద డెల్లాస్‌ వచ్చా. అప్పటి నుంచి కుటుంబంతో ఇక్కడే ఉంటున్నా, కరోనా ప్రభావంతో పది రోజుల నుంచి బయటకు రావడం లేదు. ఇంటికే పరిమితమయ్యాం. కనీసం రోడ్డు మీద ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.... వైరస్‌ బాఽదితులు మాత్రం తగ్గడం లేదు. ఇంట్లోనే బిక్కుబిక్కుమంటు గడుపుతున్నాం. తల్లిదండ్రులు, మిత్రులకు ఫోన్‌ చేసి బాగోగులు పంచుకుంటున్నాం.


యోగక్షేమాలు తెలుసుకుంటున్నా..రాజేంద్రకుమార్‌జైన్‌, నరసాపురం

మా కుమారుడు రోహిత్‌జైన్‌ అమెరికాలో ఉంటున్నాడు. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువుగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. రోజుకు నాలుగైదు సార్లు ఫోన్‌ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నాం. భయపడవద్దని మనోధైర్యం ఇస్తున్నాం. ఈనెలలో ఇండియా వచ్చేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. టిక్కెట్లు కూడా బుక్‌ చేస్తున్నాడు. కరోనాతో అంతా తారుమారైంది. 


ఆందోళన కలిగిస్తుంది..అల్లూరి నళినిదేవి, నరసాపురం

మా ఇద్దరి పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. పోయిన ఏడాదే మేము కూడా అమెరికా వెళ్లి వారితో గడిపివచ్చాం. ఈ ఏడాది మేలో మా బాబు ఇండియా వస్తానన్నాడు. అయితే ఈలోపు కరోనా అమెరికాను చుట్టేసింది. అక్కడ పరిస్థితి వింటుంటే... మాకే భయం వేస్తుంది. రోజు నాలుగైదు సార్లు ఫోన్‌ చేసి పిల్లలతో మాట్లాడుతున్నాం. పరిస్థితి చక్కబడిన తరువాత ఇండియాకు రమ్మని చెబుతున్నాం. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు జాగ్రత్తలతో ఉన్నారు. బయటకు కూడా రావడం లేదు. 

Updated Date - 2020-03-30T09:16:01+05:30 IST