విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-22T05:19:26+05:30 IST

విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

వంగర : మడ్డువలస రిజర్వాయర్‌ సమీపాన గల బ్రిడ్జి పైనుంచి కొత్తవలసకు గొట్టుపల్లి శ్రావణి (17) శుక్రవారం సాయంత్రం దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇంటి వద్ద స్నేహితుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరిన శ్రావణి... వంగర వచ్చి అక్కడ మరో ఆటోలో మడ్డువలస బ్రిడ్జి వద్దకు చేరింది. అక్కడే కాసేపు ఉండి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. శ్రావణి తల్లిదండ్రులు తొమ్మిదేళ్లుగా బతుకుతెరువు కోసం విజయవాడ వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఈమె కూడా వారితోనే ఉంటూ అక్కడే ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఇటీవల సంక్రాతి పండుగకు స్వగ్రామం వచ్చిన వీరు... రెండు రోజుల్లో తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. కాగా శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ దేవానంద్‌ మత్స్యకారుల సాయంతో మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం రాజాం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 


పురుగుల మందుతాగి యువకుడు...

లావేరు : ప్రతి రోజూ తల్లిదండ్రులు గొడవలు పడుతుండడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఎస్‌ఐ సిద్దార్థకుమార్‌ తెలిపిన వివరాల మేరకు... రావివలసకు చెందిన సిరిగిడి నారాయణప్పారావు మద్యానికి బానిసగా మారి తరచూ భార్య పద్మావతితో గొడవ పుడుతుంటాడు. దీనికి మనస్తాపానికి గురైనవారి కుమారుడు దుర్గాప్రసాద్‌(24) ఈనెల 19న పురుగుల తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన తండ్రి నారాయణప్పారావు కూడా ఇంటివద్ద వ్యవసాయానికని తెచ్చిన పురుగుల మందు తాగాడు. వీరిద్దరిని బంధువులు చికిత్స నిమిత్తంగా 108 సాయంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వీరిలో దుర్గాప్రసాద్‌ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం 20న విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. నారాయణప్పారావు ఆరోగ్యపరిస్థితి మాత్రం మెరుగుపడింది. ఇతని ఇద్దరు కుమారుల్లో ఆత్మహత్యకు పాల్పడిన దుర్గాప్రసాద్‌ ఆరోగ్య వంతుడు. మరో కుమారుడు దివ్యాంగుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-01-22T05:19:26+05:30 IST