షార్ట్స్‌తో పరీక్షకు వచ్చిన విద్యార్థినికి అవమానం

ABN , First Publish Date - 2021-09-17T21:38:54+05:30 IST

షార్ట్స్ ధరించి పరీక్షకు హాజరయిన యువతికి అవమానకరమైన అనుభవం ఎదురయిన సంఘటన బుధవారం అస్సాంలో జరిగింది.

షార్ట్స్‌తో పరీక్షకు వచ్చిన విద్యార్థినికి అవమానం

అస్సాం: షార్ట్స్ ధరించి పరీక్షకు హాజరయిన యువతికి అవమానకరమైన అనుభవం ఎదురయిన సంఘటన బుధవారం అస్సాంలో జరిగింది. తన జీవితంలో చోటుచేసుకున్న బాధాకరమైన ఘటనగా ఆమె అభివర్ణించింది. ఆమె ఈ ఉదంతంపై అస్సాం విద్యాశాఖ మంత్రి రనోజ్‌పేగుకు లేఖ రాయాలనే ఆలోచనలో ఉంది. జూబ్లీ తముళి(19) అస్సాంలోని బిశ్వనాథ్ చరియాళికి చెందిన విద్యార్థిని. ఆమె తేజ్‌పుర్‌లో ఉన్న గిరిజానంద చౌదరి ఫార్మసూటికల్ సైన్సెస్‌లో (జీఐపీఎస్) ఒక పరీక్ష రాయడానికి హాజరయ్యారు. ఆమె షార్ట్స్ ధరించి పరీక్షకు రావడంతో అధికారులు అనుమతించలేదు. ఈ ఉదంతంపై ఆమె స్పందిస్తూ.. ‘‘నేను పరీక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు సెక్యూరిటీ గార్డులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పరీక్ష గదిలోకి వెళ్లగానే ఇన్విజిలేటర్ నుంచి ఇబ్బంది ఎదురైంది. షార్ట్స్‌తో పరీక్షకు అనుమతించబోమన్నారు. నేను విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. నేను వెంటనే ఏడ్చుకుంటూ బయట వేచి ఉన్న మా నాన్న దగ్గరకి వెళ్లాను. ప్యాంట్ ధరించి వస్తే పరీక్షకు అనుమతిస్తామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ చెప్పారు. మా నాన్న వెంటనే మార్కెట్‌కు వెళ్లి ఒక జత ప్యాంట్స్ కొనుక్కొని రావడంతో నేను పరీక్ష రాసాను’’ అని ఆమె తన అనుభవాన్ని వివరించింది. 

 

పరీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘హాల్ టికెట్‌లో డ్రెస్ కోడ్‌కు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు పేర్కొనలేదు. నేను కొద్దిరోజుల క్రితం నీట్ పరీక్ష రాయడానికి ఈ విధంగానే వెళ్లాను. అప్పుడు అధికారుల నుంచి ఎటువంటి అభ్యంతరమూ ఎదురు కాలేదు. డ్రెస్ కోడ్‌కు సంబంధించి ఎటువంటి నిబంధనలు పేర్కొనకపోతే నాకెలా తెలుస్తుంది? అధికారులు ఈ విధంగా వ్యవహరించడంతో నా విలువైన పరీక్ష సమయం వృథా అయింది. మాస్కులు, ఉష్ణోగ్రత వంటి కొవిడ్ ప్రొటోకాల్‌కు సంబంధించిన విషయాలను పరీక్షాధికారులు పరిశీలించలేదు. కానీ, షార్ట్స్‌ని మాత్రం పట్టించుకున్నారు. యువకులు షార్ట్స్ ధరించి బహిరంగంగా తిరిగితే ఎవరు ఏమీ అనరు. కానీ, యువతి షార్ట్స్ ధరిస్తే మాత్రం అందరూ ఆమెను వేలెత్తి చూపిస్తారు ’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై జీఐపీఎస్  ప్రిన్సిపాల్ అబ్దుల్ బార్ఖీ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, అయితే ఈ ఘటన గురించి తనకు తెలుసని చెప్పారు.


Updated Date - 2021-09-17T21:38:54+05:30 IST