Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫీజుల పెంపుపై రగడ

కేయూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో హోరెత్తిన నిరసన
వీసీ రమేశ్‌ తీరుపై తీవ్ర విమర్శలు
పోలీసులతో తోపులాట.. పలువురికి గాయాలు
పరిపాలన భవనం ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసం
ఫీజుల తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని వీసీ హామీ


కేయూ క్యాంపస్‌, డిసెంబరు 3:
కాకతీయ యూ నివర్సిటీలో బి.టెక్‌ కోర్సు ఫీజులను పెంచడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. వర్సిటీ అధికారులకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పరిపాలన భవనం ఎదుట బైఠాయించినినాదాలు చేశారు. వైస్‌చాన్స్‌లర్‌ టి.రమేశ్‌ వచ్చి ఫీజులను తగ్గిస్తామని హామీ ఇవ్వాలని విద్యార్థులు పట్టుపట్టారు. ‘మీరు వస్తారా.. మేమే లోనికి రావాలా..’ అంటూ హెచ్చరిస్తూ పెద్దపెట్టున నిరసన చేపట్టారు. ఫీజుల పెంపుతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతోందని అన్నారు.

ఈ సందర్భంగా  ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. వర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు వేడుకున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం..   ఫీజులు మాత్రం పెంచుతోందని మండిపడ్డారు. కేయూ వీసీ ఫీజుల దందా చేస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శలు చేశారు.  కేయూను విద్యార్థుల నుంచి దూరం చేసి అనురాగ్‌, మల్లారెడ్డి వర్సిటీలకు కట్టబట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. క్యాంప్‌సలోని రెండు ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఏఐసీటీఈ అప్రూవల్‌ తీసుకురాకుండా, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను రెగ్యులర్‌ చేయకుండా చోద్యం చూస్తున్నారని,  పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని,  సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను రెగ్యులర్‌ చేయాలని, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించాలని, 136పోస్టులను భర్తీ చేయాలని, బస్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

పగిలిన అద్దాలు
విద్యార్థుల ఆందోళనలో పరిపాలన భవనం అద్దాలు ధ్వంసమయ్యాయి. అధికారులు తమ వద్దకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసిన విద్యార్థులు.. అద్దాలను ధ్వంసం చేసి పరిపాలన భవనంలోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అ డ్డుకున్నారు. కొందరు విద్యార్థులను పోలీసులు బలవంతంగా వాహనాల్లో పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఎంకామ్‌ విద్యార్థి గణేశ్‌కు గాయాలయ్యాయి. ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అంబాల కిరణ్‌, నాయకులు నిమ్మల రాజేశ్‌, పైండ్ల అమర్‌, మాచర్ల రాంబాబు, చట్ల సతీశ్‌, ప్రవీణ్‌, అనీశ్‌, భార్గవ్‌, అరుణ్‌, సాయి, వాణి, నేహా, శిరీష, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

10 రోజుల్లో నిర్ణయం
విద్యార్థుల ఆందోళనలతో శుక్రవారం సాయంత్రం ఎట్టకేలకు వీసీ తాటికొండ రమేశ్‌ దిగివచ్చారు. 10 రోజుల్లో ఇంజనీరింగ్‌ ఫీజులతో పాటు ఇతర కోర్సుల ఫీజులపై కమిటీవేసి పునఃపరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేశారు. దీంతో సాయంత్రం విద్యార్థులు శాంతించారు. ఆందోళనను విరమించినట్లు  ఏబీవీపీ నేతలు ప్రకటించారు.

మాట్లాడుతున్న వీసీ రమేశ్‌


విద్యార్థుల ఆందోళనలో ధ్వంసమైన వర్సిటీ పరిపాలన భవనం అద్దాలు..Advertisement
Advertisement