విద్యార్థులు ఫుల్‌.. సౌకర్యాలు నిల్‌

ABN , First Publish Date - 2021-11-26T06:26:51+05:30 IST

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉన్నా సౌకర్యాలు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.

విద్యార్థులు ఫుల్‌.. సౌకర్యాలు నిల్‌

  కొండమల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఇదీ పరిస్థితి 

కొండమల్లేపల్లి, నవంబరు 25:  పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉన్నా సౌకర్యాలు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రం జిల్లాపరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు 1400మంది ఉన్నారు. సంఖ్యాపరంగా రాష్ట్రంలో రెండో స్థానంలో, జిల్లాలో స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను ఇక్కడ చుదువుతున్నారు. ఒక తరగతిని ఐదు సెక్షన్లుగా విభజించారు. 5 తరగతులను మొత్తం 25సెక్షన్లు చేశారు. ఒక తరగతిగదిలో దాదాపు 85 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులు సరిపడాలేకపోవడంతో ఒకే తరగతి గదిలో 85 మంది విద్యార్థులు విద్యను అభ్యసించే పరిస్థితి ఏర్పడింది. 

శిథిలావస్థలో మరుగుదొడ్లు

పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు శిధిలావస్థకు చేరాయి. మరుగుదొడ్ల తలుపులు ధ్వంసమయ్యాయి. పాఠశాలలో రూ.4లక్షలతో మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మాణ పనులు చేపట్టారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల పనులు నిలిచిపోయి, అసంపూర్తిగా తయారైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల సమీపంలో ఉన్న కాలనీవాసులు డ్రైనేజీ, వర్షపునీటిని పాఠశాల ప్రహరీగోడకు రంద్రం చేసి మురుగునీటిని పాఠశాలలోకి వదులుతున్నారు. దీంతో పాఠశాలలో మురుగునీరు నిలువ ఉండడంతో దోమలు, ఈగలు చేరుతున్నాయి. మధ్యాహ్న భోజన సమయంలో మురుగునీరు దోమలు, ఈగలతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో వ్యాధులు సోకుతున్నాయని విద్యార్థులు తెలుపుతున్నారు. కరోనా సమయం కావడంతో విద్యార్థులు జంకుతున్నారు.

చెట్ల కిందే వంటలు

 పాఠశాల ప్రహరీ సరిగా లేక పందులు లోనికి ప్రవేశిస్తున్నాయని, భోజన సమయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం వంటలు చేసే ఏజెన్సీవారు వంట గదులు ఇరుకుగా ఉండడంతో ఆరుబయట చెట్లకింద వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ ఇబ్బందులుపడుతూ వంటలు చేస్తున్నామని ఏజెన్సీవారు తెలిపారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకుని నిత్యం ఉపయోగపడే మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. 

మంచినీటి సమస్యను పరిష్కరించాలి

-ప్రధానోపాధ్యాయుడు మంద సత్యనారాయణ

 ముఖ్యంగా పాఠశాలలో మంచినీటి కొరత ఉండడంతో ట్యాంకుల ద్వారా తెప్పించే పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో ఒక చేతిపంపు ఉండగా దానికి మోటర్‌ బిగిస్తే విద్యుత్‌ లోవొల్టేజీ కారణంగా మరమ్మతులకు గురవుతోంది. కొవిడ్‌ నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. దాతలు  సహకరించాలి.


Updated Date - 2021-11-26T06:26:51+05:30 IST