Abn logo
Sep 25 2021 @ 08:56AM

విద్యార్థులపై ‘కరోనా’ పడగ

            - కోవై జిల్లాలో 87 మందికి పాజిటివ్‌

           

చెన్నై: కేరళ సరిహద్దు ప్రాంతమైన కోయంబత్తూరు జిల్లాలో కరోనా ఏమాత్రం శాంతించడం లేదు. దీనికి తోడు విద్యాలయాలు తెరవడంతో ఆ మహమ్మారి విద్యార్థులపై ప్రతాపం చూపుతోంది. ఇందులో భాగంగా 87 మంది విద్యార్థులు కరోనా వైరస్‌ తాకిడికి గురయ్యారు. సెప్టెంబరు ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది నుండి ప్లస్‌-2 తరగతులకు పాఠశాలలు, కళాశాలలు తెరిచారు. గతేడాది నుంచి కోయంబత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య అధికంగానే నమోదవుతోంది. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలు ప్రారంభించడంతో విద్యార్థులు కరోనా బారినపడుతున్నారు. ఆ జిల్లాల్లో ప్రస్తుతం విద్యార్థులకు షిఫ్ట్‌ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలోని కోయంబత్తూరు, పొల్లాచ్చి, మేట్టు పాళయం, సూలూరు, అన్నూరు ప్రాంతాల్లోని విద్యార్థులకు రెండు రోజుల క్రితం కరోనా ముందస్తు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో 25 మంది విద్యార్థులకు పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఇదే విధంగా శరవణంపట్టిలోని నర్సింగ్‌ కాలేజీ. పీలమేడులోని ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యశాఖ అధి కారులు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా 62 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కొవిడ్‌ బారిన పడిన విద్యార్థుల్లో పలువురిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులను ఇంటిలో ఐసోలేషన్‌లో ఉంచి ఆరోగ్య కార్యకర్తలు చికిత్సలందిస్తున్నారు. ప్రస్తుతం ఆ జిల్లాలోని అన్ని పాఠ శాలలు, కళాశాలల వద్ద ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక వైద్యశిబి రాలు నిర్వహించి విద్యార్థులకు వైద్యపరీక్షలతోపాటు వారికి విటమిన్‌ మాత్రలను కూడా అందజేస్తున్నారు. అదే విధంగా ఆ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని అన్ని తరగతులు, ప్రధానోపాధ్యాయుల గదులు, కార్యాలయపు గదుల్లో రోజూ క్రిమి సంహాక మందులను చల్లుతున్నారు. తరగతులకు వచ్చే విద్యార్థులందరికీ ఉచితంగా మాస్కులు కూడా అందజేస్తున్నారు. ప్రతి తరగతి గది వద్ద శానిటైజర్‌ ఉంచి, వాటితో విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకోవాలని ఆదేశిస్తున్నారు.