అయోమయం..!

ABN , First Publish Date - 2020-11-26T06:28:50+05:30 IST

కొవిడ్‌-19 కారణంగా మార్చి-2020లో నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. 52,057 మందిని పాస్‌ చేస్తూ జూలైలో పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అయోమయం..!
జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల

ఇంటర్‌ ప్రవేశాలపై కొరవడిన స్పష్టత..

సీటు, కాలేజీపై స్పష్టత ఇవ్వని ఇంటర్‌ బోర్డు..

ఇంజనీరింగ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ పరిస్థితీ అంతే..

సందిగ్ధంలో వేలాది మంది విద్యార్థులు


ఇంటర్‌, ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రవేశాలపై అయోమయం నెలకొంది. కాలేజీలో చేరతామో.. లేదోనన్న సందిగ్ధంలో విద్యార్థులున్నారు. అడ్మిషన్లు చేపడతారా.. విద్యా సంవత్సరం ఉంటుందా.. తదితర ప్రశ్నలు వారి మెదళ్లను తొలుస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సందిగ్ధంలోకి నెట్టాయి.


అనంతపురం విద్య/అర్బన్‌, నవంబరు25: కొవిడ్‌-19 కారణంగా మార్చి-2020లో నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. 52,057 మందిని పాస్‌ చేస్తూ జూలైలో పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో రెగ్యులర్‌ 51931, ప్రైవేట్‌ 126 మంది ఉన్నారు. వారు ఇంటర్‌ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో చేపట్టనున్నట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీనిపై త్వరగా స్పందించకపోవటంతో అధికారులతోపాటు వి ద్యార్థుల్లోనూ గందరగోళం నెలకొంది. ఫలితంగా ప్రభు త్వ జూనియర్‌ కళాశాలల చుట్టూ విద్యార్థులు తిరుగుతున్నారు. దీంతో కళాశాలల ప్రిన్సిపాళ్లు మొదట ఆఫ్‌లైన్‌లో పిల్లల సర్టిఫికెట్లు, వారికి కావాల్సిన గ్రూప్‌, విద్యార్థుల వివరాలను తీసుకుని, పంపారు. అక్టోబరు 21 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు వేయాలంటూ ఉన్నఫలం గా బోర్డు నుంచి ఉత్తర్వులు రావటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానంపై విద్యార్థులకు అవగాహన లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటర్నెట్‌ సెంటర్ల చుట్టూ రేయింబవళ్లు తిరిగి దరఖాస్తు చేసుకున్నా.. విద్యార్థులకు నిరీక్షణ తప్పలేదు. విద్యార్థికి ఏ కళాశాలలో సీటు ఇచ్చారో మెసేజ్‌ పంపుతామంటూ చెప్పారు. నెల కావస్తున్నా విద్యార్థులకు ఆ సమాచారం చేరలేదు. ప్రభుత్వ ముందుచూపు లేమి వల్లే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారైందన్న విమర్శలు వస్తున్నాయి.


వెబ్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడో?

ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌పై స్పష్టత కొరవడటంతో ఇంజనీరింగ్‌లో చేరబోయే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కరోనా ప్రభావంతో జూన్‌, జూలై నెలల్లో జరగాల్సిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను నవంబరులో నిర్వహించారు. అనంతరం వెబ్‌ కౌన్సెలింగ్‌ ఆధారంగానే విద్యార్థులు ఎం పిక చేసుకున్న కళాశాలల్లో ఇంజనీరింగ్‌లో చేరాల్సి ఉంటుంది. నెలరోజులు కావస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి వెబ్‌ కౌన్సెలింగ్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. జేఎన్‌టీయూ అధికారులు మాత్రం డిసెంబరులో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


విద్యార్థుల్లో ఆందోళన

జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు వంద కళాశాలలకు అనుమతి లభించింది. ఎంసెట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరీశీలన కార్యక్రమాన్ని నిర్వహించి, నెల రోజులు కావస్తున్నా.. విద్యార్థుల కళాశాల ఎంపిక ప్రక్రియ కార్యక్రమాన్ని (వెబ్‌ కౌన్సెలింగ్‌) చేపట్టట్లేదు. కొవిడ్‌-19 నేపథ్యంలో దాదాపు ఆరునెలల ఆలస్యంగా ఎంసెట్‌ నిర్వహించారు. పరీక్ష ఫలితాల అనంతరం అక్టోబరు 23 నుంచి నవంబరు 3వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ చేపట్టారు. 15వేల మందికిపైగా విద్యార్థులు సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయించుకున్నారు. వెబ్‌కౌన్సెలింగ్‌లో జాప్యమవుతుండటంతో ఆ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. అసలు అకడమిక్‌ ఇయర్‌ ఉంటుందా..? 2021 అకడమిక్‌ ఇయర్‌ వరకూ వేచి ఉండాలా..? అనే సందేహాలను విద్యార్థులు వ్యక్తపరుస్తున్నారు.


కళాశాలల ఎదురుచూపులు

వెబ్‌కౌన్సెలింగ్‌పై విద్యార్థులు, ఇంజనీరింగ్‌ కళాశాలల భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహిస్తేనే ఏ కళాశాలకు ఎంత మంది విద్యార్థులు చేరారు, ఏయే కోర్సులు నడుపుకోవచ్చో తేలుతుంది.  ఈ ఏడాది తన పరిధిలో సుమారు వంద కళాశాలలకు జేఎన్‌టీయూ అనుమతులిచ్చింది. వెబ్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యమవుతుండటంతో ఆ కళాశాలల యాజమాన్యాలు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారా..? లేదా, అనే అనుమానాలను కళాశాలల యాజమాన్యాలు వ్యక్తపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు కళాశాలల యాజమాన్యాలు కూడా జేఎన్‌టీయూ అధికారులతో ఏపీఎ్‌ససీహెచ్‌ఈతో సంప్రదింపులు జరిపి, వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహణకు సహకరించాలని మొరపెట్టుకున్నట్లు సమాచారం. విద్యా సంవత్సరం ముగుస్తుండటం వర్శిటీ అధికారులకు తలనొప్పిగా మారింది. వెబ్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యమవుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యా జమాన్యాల నుంచి ఒత్తిడి అధికమవుతోంది. ఎవరికి ఏం చెప్పాలో తెలియక, ఏపీఎస్‌సీహెచ్‌ఈతో సంప్రదింపులు జరపలేక వారు తలలు పట్టుకుంటున్నారు.


విద్యా సంవత్సరం ఉంటుందా..?

కరోనా ప్రభావంతో ఈ ఏడాది జేఎన్‌టీయూ పరిధిలోని తరగతులన్నీ దాదాపు ముగిసినట్లేనని అందరూ భావించారు. రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇటు విద్యార్థులు.. అటు వర్శిటీ అధ్యాపకులకు ఊరట లభించినట్లయింది. ఇందులో భాగంగానే వర్శిటీ అధికారులు కూడా బ్రాంచ్‌ల వారీగా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ నిర్వహణకు వర్శిటీ అధికారులు సమాయత్తమయ్యారు. అనుకున్నట్లు గానే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించారు. జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల విద్యార్థులు తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయించుకున్నారు. అనంతరం నిర్వహించాల్సిన వెబ్‌కౌన్సెలింగ్‌ నెలరోజులు కావస్తున్నా నిర్వహించకపోవడంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ఏడాది వెబ్‌ కౌన్సెలింగ్‌ ఉండకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.


ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలియదు

ఇంటర్‌ మొదటి సంవత్సర ప్రవేశాలు ఆన్‌లైన్‌లో చేపడుతుండటంతో ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా తెలీదు. ఏయే జిల్లాల నుంచి ఎన్ని దరఖాస్తులొచ్చాయన్నది బోర్డు నుంచి సమాచారం రావాల్సి ఉంది. అడ్మిషన్లపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ సమస్య పరిష్కారమైన తర్వాత స్పష్టత వస్తుంది.

- వెంకటరమణ నాయక్‌, ఆర్‌ఐఓ


అంతవరకూ ఆగాల్సిందే..

వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహణ బాధ్యత ఏపీఎ్‌ససీహెచ్‌ఈపైనే ఉంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తయిన విషయాన్ని ఉన్నత విద్యామండలికి నివేదించాం. విద్యార్థుల సర్టిఫికెట్లను కూడా వెరిఫికేషన్‌ చేసి, సిద్ధంగా ఉంచాం. జేఎన్‌టీయూ అనుబంధ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల నివేదికలను పంపించాం. కౌన్సెలింగ్‌ నిర్వహించటమా..? లేదా..? అన్నది ఉన్నత విద్యామండలి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. వారి ఆదేశాల మేరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. అంతవరకూ విద్యార్థులైనా, కళాశాలలైనా వేచి చూడాల్సిందే.

- ప్రొఫెసర్‌ శ్రీనివాసకుమార్‌, జేఎన్‌టీయూ వీసీ

Updated Date - 2020-11-26T06:28:50+05:30 IST