బాబోయ్‌ బీఈడీ..!

ABN , First Publish Date - 2021-11-29T05:57:21+05:30 IST

డిగ్రీ పూర్తి కాగానే చాలా మంది బీఈడీ చదివేందుకు ఆసక్తి చూపేవారు.

బాబోయ్‌ బీఈడీ..!

ఆసక్తి చూపని విద్యార్థులు

మూడేళ్లుగా వెలువడని డీఎస్సీ నోటిఫికేషన్‌..

తగ్గుతున్న అడ్మిషన్లు.. మూతపడుతున్న కాలేజీలు


నరసాపురం, నవంబరు 28: డిగ్రీ పూర్తి కాగానే చాలా మంది బీఈడీ చదివేందుకు ఆసక్తి చూపేవారు. శిక్షణ తీసుకుని ప్రవేశ పరీక్ష రాసి.. సీటు రాకపోతే మేనేజ్‌మెంట్‌ కోటాలోనైనా సీటు పొంది చదివేందుకు వెనకాడేవారు కాదు. ఎందుకంటే చదువు పూర్తి కాగానే టీచర్‌ పోస్టు వస్తుందన్న నమ్మకం ఉండేది. దీనికి తగ్గట్టు ప్రభుత్వాలు రెండేళ్లకో సారి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. ప్రభుత్వ విధానాల వల్ల బీఈడీ చదివేందుకు చాలామంది విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. మూడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. ఈ కారణంగా ఈ ఏడాది చదివేందుకు విద్యార్థు లు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది బీఈడీ ఎంట్రన్స్‌ 15,637 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరులో నిర్వహించిన పరీక్షకు 13,619 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 13,422 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక జిల్లాలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య వెయ్యిలోపే ఉంది. దీంతో ఈ ఏడాది బీఈడీ కళాశాలల్లో అడ్మిషన్లు ఉంటాయా ? లేదా అనేది సందిగ్ధం నెలకొంది. మూడేళ్ల కిందట వరకు జిల్లాలో 30కిపైగా బీఈడీ కాలేజీలుండగా 1,800 వరకు సీట్లు ఉండేది. ప్రస్తుతం కాలేజీల సంఖ్య 12.. సీట్ల సంఖ్య 500లోపే ఉన్నాయి. ఇవి కూడా ఏ మేరకు సీట్లు భర్తీ అవుతాయో అనే సందేహం నెలకొంది. మరోవైపు మేనేజ్‌మెంట్‌ కోటాలో డోనేషన్‌ కట్టి చేరేందుకు ఎవరూ ఆసక్తి చూప డం లేదు. చాలా కాలేజీల్లో కనీస సంఖ్య ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది మరికొన్ని కాలేజీలు మూతపడతాయన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడమేనన్న వాదనలు వ్యక్త మవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో భీమవరంలో 3, ఏలూరు–2, నిడదవోలు–2, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, చింతలపూడి లలో ఒక్కొక్క కాలేజీలు మొత్తం 12 ఉన్నాయి. 


మాటతప్పిన ప్రభుత్వం

ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. డీఎస్సీ నోటిఫి కేషన్‌ ఇస్తామని నిరుద్యోగులకు వైసీపీ హామీ ఇచ్చింది. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 17 వేల పోస్టు లు ఖాళీగా ఉండగా.. జిల్లాలో 1,500 పోస్టులు ఖాళీ ఉన్నట్టు అంచనా.. పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్త పోస్టులు వేయలేదు. యథా విధిగా ఖాళీలను ఉంచింది. చాలా స్కూళ్లల్లో ఉపాధ్యాయుల కొరత వెంటాడుతోంది. ఈ ఏడాదైనా డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు ఎదురుచూస్తూ వచ్చారు. రుణం కోసం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకు న్న ఒప్పందం ప్రకారం ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మంగళం పాడుతుందన్న వాదనలు వ్యక్త మవుతున్నాయి. ఇదే జరిగితే రానున్న రోజుల్లో బీఈడీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.


నాలుగేళ్లుగా డీఎస్సీ లేదు

నాలుగేళ్లుగా డీఎస్సీ నోటిఫికే షన్‌ లేదు. రాష్ట్రంలో సుమారు 20 వేలకుపైనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్‌ లేక పోవడంతో కొత్తగా చదివేవారు సందిగ్ధంలో పడుతున్నారు. గతంలా బీఈడీ చదివితే జాబ్‌ గ్యారెంట్‌ అన్న భావన ఉండేది. ప్రస్తుతం ఆ ధీమా కనిపించడం లేదు. దీనికితోడు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సును రెండేళ్లకు పెంచింది. దీనివల్ల చాలా మంది ఆసక్తి చూపడం లేదు.

– కళ్యాణ రామకృష్ణ, వైఎన్‌ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌

Updated Date - 2021-11-29T05:57:21+05:30 IST