ట్రిప్‌.. కట్‌!.. నో బస్‌!

ABN , First Publish Date - 2021-03-03T06:59:32+05:30 IST

పై చిత్రం చూశారా? ఆర్టీసీ బస్సు వెనుక బంపర్‌ రాడ్‌పై కూర్చుని ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం.

ట్రిప్‌.. కట్‌!..  నో బస్‌!
బస్సు వెనుక బంపర్‌ రాడ్‌ మీద కూర్చున్న కళాశాల విద్యార్థులు

విజయవాడలో విద్యార్థుల ఇక్కట్లు

సీజన్‌ టికెట్ల ద్వారా ముందుగానే డబ్బు వసూలు చేస్తున్న ఆర్టీసీ

వారికి బస్సులు కల్పించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం 


పై చిత్రం చూశారా? ఆర్టీసీ బస్సు వెనుక బంపర్‌ రాడ్‌పై కూర్చుని ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం. మరో చిత్రంలో బస్టాప్‌లో నిరీక్షిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు... కదులుతున్న బస్సుకోసం పరుగులు పెడుతూ కొందరు.. ఫుట్‌బోర్డుపై వేలాడుతూ మరికొందరు. విజయవాడ నగరంలో విద్యార్థులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తోందనడానికి నిదర్శనం ఇది. విద్యార్థుల నుంచి బస్‌పాస్‌ల రూపేణా ముందే డబ్బులు కట్టించుకుంటున్న ఆర్టీసీ.. వారికి అవసరమైన సమయాల్లో బస్సులు నడపకపోవడమే ఇందుకు కారణం. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : విజయవాడ నగరంలో విద్యార్థుల సహనానికి ఆర్టీసీ పరీక్ష పెడుతోంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడమనే పేరుతో ట్రిప్‌ కటింగ్స్‌ చేస్తూ, విద్యార్థులకు అవసరమైన సమయాల్లో బస్సులు తిప్పకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. సీజన్‌ టికెట్ల పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నపుడు ఉన్న శ్రద్ధ వారికి సకాలంలో బస్సులు నడిపే విషయంలో ఉండటం లేదు. ఎడాపెడా సాగిస్తున్న ట్రిప్‌ కటింగ్స్‌తో విద్యార్థులు బలవుతున్నారు. రావలసిన బస్సు రద్దవుతోంది. ఆ తరువాత బస్సు ఎప్పటికొస్తుందో తెలియదు. వచ్చినా విపరీతమైన రద్దీ. అయినా తప్పదు.. ఏదో రకంగా ప్రయాణం చేసి ఇంటికి చేరుకోవాలి. అందుకోసం విద్యార్థులు సాహసాలు చేస్తున్నారు. విజయవాడ నగరంలో అంతర్గతంగా బస్సులు తగిన సంఖ్యలో నడపకపోవటమే ఈ సమస్యకు ప్రధాన  కారణం. ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)లోకి విలీనం అయిన తర్వాత ఆర్టీసీ అధికారులు, ఉద్యోగుల్లో కూడా సేవా భావం తగ్గిపోయిందనుకోవాలా? 


దీంతో విద్యార్థులు బస్టాపుల దగ్గర గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. ఎంజీ రోడ్డులో నడిచే బస్సులు ఉయ్యూరు, ఆటోనగర్‌ల నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ఈ బస్సులు బెంజ్‌సర్కిల్‌ వద్దకు వచ్చేప్పటికే నిండిపోతాయి. దీంతో విద్యార్థులకు ఎక్కేందుకు అవకాశం ఉండదు. మహాత్మాగాంధీ రోడ్డు పొడవునా ప్రతి బస్‌స్టాప్‌లోనూ సాయంత్రం వేళ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తుంటాయి. విద్యాధరపురం డిపో బస్సులను ఇలా ట్రిప్‌ కటింగ్‌ పేరుతో పీక్‌ టైమ్‌లో ఆపేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటితో పాటు రూట్‌ నెంబర్‌ 55 బస్సులు గతంలో డజనుకు పైగా తిరిగేవి. కొవిడ్‌ నేపథ్యంలో వీటిని నాలుగైదుకే పరిమితం చేశారు. సిబ్బంది సెలవులో ఉంటే ఒక్కోసారి ఈ బస్సులను కూడా రద్దు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉన్న బస్సులనే పట్టుకుని ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. విద్యార్థులకు అవసరమైన సమయంలో బస్సులను నడపడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


సిటీ సర్వీసులతో కష్టాలు..

విజయవాడ సిటీ డివిజన్‌ పరిధిలో గవర్నర్‌ పేట - 1, 2, ఆటోనగర్‌, ఉయ్యూరు, విద్యాధరపురం, గన్నవరం, ఇబ్రహీంపట్నం బస్‌ డిపోలు ఉన్నాయి. సిటీ డివిజన్‌ పరిధిలో మొత్తం ఏడు బస్సు డిపోలు ఉన్నా.. విజయవాడలో అంతర్గతంగా నడిచే బస్సులు మాత్రం ఒక్క విద్యాధరపురం డిపో నుంచే ఎక్కువగా ఉన్నాయి. గవర్నర్‌పేట - 1, 2 డిపోల నుంచి సిటీ సబర్బన్‌ పరిధిలోని గ్రేటర్‌ విలీన ప్రతిపాదిత ప్రాంతాలను కూడా దాటుకుని ముందుకు వెళతాయి. దీంతో నగరంలో అంతర్గతంగా ప్రయాణాలు సాగించాలంటే.. విద్యాధరపురం డిపోకు చెందిన బస్సులే దిక్కు. ఈ డిపో పరిధిలో రూట్‌ నెంబర్‌ 11 సిరీస్‌ మీద పలు సర్వీసులు నడుస్తున్నాయి. నగరంలో ట్రాఫిక్‌ రద్దీ కారణంగా సమయం చాలకపోవడంతో ఈ బస్సుల చివరి ట్రిప్‌లను రద్దు చేస్తున్నారు. దీంతో ఈ రూట్‌లో ప్రయాణించాల్సిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ శివారు ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉన్నాయి. 

విద్యాధరపురం బస్‌ డిపోకు చెందిన రూట్‌ నెంబర్‌ 11 బస్సులన్నీ జక్కంపూడి కాలనీకి వెళ్లి రావాలి. బస్సులను ఆటోనగర్‌, జక్కంపూడి కాలనీల్లో ఉంచుతుంటారు. ఆయా ప్రాంతాల నుంచి బస్సులను సకాలంలో బయటకు తీయకపోవటం వల్ల కాలాతీతం అవుతోంది. ఈ కారణాన్ని చూపి, చివరి ట్రిప్‌ రద్దు చేయడంతో సాయంత్రం తర్వాత బస్సులు ఉండటం లేదు. రూట్‌ నెంబర్‌ 31 జే సర్వీసుల విషయంలోనూ ఇలాగే ట్రిప్‌ కటింగ్‌ జరుగుతోంది. 



Updated Date - 2021-03-03T06:59:32+05:30 IST