విద్యార్థులు ఇష్టంతో చదువుకోవాలి

ABN , First Publish Date - 2022-09-08T04:40:50+05:30 IST

విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదువుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌ కుమార్‌ అన్నారు.

విద్యార్థులు ఇష్టంతో చదువుకోవాలి
జేపీనగర్‌ గురుకులం విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- గురుకులాల్లో మెరుగైన వసతులకు ఆదేశాలు

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌


కల్వకుర్తి/వెల్దండ, సెప్టెంబరు 7 : విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదువుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌ కుమార్‌  అన్నారు. కల్వకుర్తి పట్టణ పరిధిలోని జేపీనగర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను, ఎస్టీ బాలికల గురుకులాన్ని, సీబీఎం కళాశాలలో కొనసాగుతున్న గురుకులాన్ని కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. జేపీనగర్‌ గురుకులంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయా గురుకులాల్లో వంట గదులను, డైనింగ్‌ హాళ్లను పరిశీలించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు ఉండేలా సంబంధిత ప్రిన్సిపాళ్లను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్‌ మాట్లాడారు. ఆర్డీవో రాజేష్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ఎడ్మ సత్యం, ఆర్‌సీవో వనజ, పీఏసీఎస్‌ చైర్మన్‌ తలసాని జనార్దన్‌రెడ్డి, తహసీల్దార్‌ రాంరెడ్డి, డీఎల్‌పీవో పండరీ నాథ్‌ తదితరులు ఉన్నారు. 


మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

 వెల్దండ: సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల, కళాశాల విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ పీ ఉదయ్‌కుమార్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం వెల్దండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల, కళాశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంటశాల, స్టోర్‌రూంలను పరిశీలించారు. విద్యార్థులు తరగతి గదిలోనే చదువుతోపాటు రాత్రివేళ నిద్రించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తించారు. అదేవిధంగా కొన్ని గదులకు కిటికీలు, దర్వాజలు లేకపోవడంతో వాటిని బిగించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఏఈ కోటేశ్వరరావును ఆదేశించారు. విద్యార్థులకు అనుగుణంగా అవసరమైన కిచెన్‌షెడ్‌, డైనింగ్‌ హాల్‌ లేకపోవడంతో వాటిని సమకూర్చాలని సూచించారు. పాఠశాలలో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఎల్‌పీవో పండరీనాథ్‌ను ఆదేశించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలెక్టర్‌ మాట్లాడారు. చదువులపై శ్రద్ధ వహించాలని, చదువుకున్న పాఠశాలలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని కలెక్టర్‌ కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భూపతిరెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపీడీవో మోహన్‌లాల్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-09-08T04:40:50+05:30 IST