బూటుకాళ్లతో తొక్కి... రోడ్డుపై ఈడ్చుకుపోయి..

ABN , First Publish Date - 2021-11-19T15:28:03+05:30 IST

విద్యార్థులని కనికరం చూపలేదు. రోడ్డుపై ఈడ్చుకుపోయారు. బూటుకాళ్లతో తొక్కేశారు. విద్యార్థినుల మెడపై చేతులు వేసి కర్కశంగా వ్యవహరించారు. వారి ఒంటిపై ఉన్న దుస్తులు తొలగిపోతున్నా, చినిగిపోతున్నా పట్టించుకోలేదు. విజయనగరంలో విద్యార్థులపై..

బూటుకాళ్లతో తొక్కి... రోడ్డుపై ఈడ్చుకుపోయి..

విద్యార్థులపై దాష్టీకం

మాన్సాస్‌ ఆధ్వర్యంలోని ఎయిడెడ్‌ కళాశాలను కొనసాగించాలన్నందుకు పోలీసుల కర్కశం 

గాయాలతో ఓ విద్యార్థి అపస్మారక స్థితికి... 

అసెంబ్లీ ముట్టడికి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ యత్నం

విద్యార్థి నేతలను అరెస్టు చేసిన పోలీసులు 

విజయవాడలో జేఏసీ నేతల అరెస్టు 


తుళ్లూరు/అమరావతి/పెదకూరపాడు/విజయవాడ/విజయనగరం: విద్యార్థులని కనికరం చూపలేదు. రోడ్డుపై ఈడ్చుకుపోయారు. బూటుకాళ్లతో తొక్కేశారు. విద్యార్థినుల మెడపై చేతులు వేసి కర్కశంగా వ్యవహరించారు. వారి ఒంటిపై ఉన్న దుస్తులు తొలగిపోతున్నా, చినిగిపోతున్నా పట్టించుకోలేదు. విజయనగరంలో విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. మాన్సాస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్‌ కళాశాలను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు విజయనగరం కోట జంక్షన్‌ వద్ద గురువారం ధర్నా, రాస్తారోకో చేశారు. మాన్సాస్‌ చైర్మన్‌ అశోక్‌గజపతిరాజును కలిసేందుకు వారిని పోలీసులు అనుమతించలేదు. దీంతో వారంతా మూకుమ్మడిగా కోటలోని ప్రధాన ద్వారం గుండా మాన్సాస్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు బలవంతంగా విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. రోడ్డుపై ఈడ్చుకుపోవడంతో ఒక విద్యార్థి గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇదిలా ఉండగా, ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనానికి జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు, కార్యకర్తలు గురువారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.


సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై పరుగులు పెడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్లకు తరలించారు. అమరావతి పోలీస్‌ స్టేషన్‌లో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు పరామర్శించారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని విద్యార్థి నేతలకు లోకేశ్‌ హామీ ఇచ్చారు. అరెస్టయిన వారిలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌తో పాటు మరో 20మంది వరకూ ఉన్నారు. పెదకూరపాడు స్టేషన్‌లో అరెస్టయిన విద్యార్థి నేతలను లోకేశ్‌ పరామర్శించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనంపై ఏకపక్షంగా జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్‌కు ఆనాడే చెప్పానన్నారు. పిల్లలకు మేనమామగా ఉంటానని చెప్పి, నేడు విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేయిస్తుండటం బాధాకరమన్నారు. విద్యార్థులకు ఎలాంటి నోటీసులు లేకుండా వారిని పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టి ఆహారం కూడా పెట్టలేదని మండిపడ్డారు. ఎయిడెడ్‌ జీవోలు వెనక్కి తీసుకోకపోతే ఇప్పుడు అసెంబ్లీ తలుపులు తట్టామని, రేపటి రోజున సీఎం జగన్‌, మంత్రి సురేశ్‌ ఇంటి తలుపులు తడతామన్నారు. రానున్న రోజుల్లో మంత్రులు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. 


‘చలో అసెంబ్లీ’ భగ్నం

ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని యథాతథంగా కొనసాగించాలని, జీవోలు 42, 50, 51లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం భగ్నమైంది. పోలీసులు ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతల్ని అరెస్టు చేసి గవర్నర్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. తొలుత లెనిన్‌ సెంటర్‌లో గుమిగూడిన విద్యార్థులు ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని కాపాడాలని, వాటికి గుదిబండగా మారిన జీవోలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం చలో అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా వ్యాన్లు ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన విద్యార్థి సంఘాల నేతలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పరామర్శించారు.

Updated Date - 2021-11-19T15:28:03+05:30 IST