‘మహారాజా’ మంటలు!

ABN , First Publish Date - 2020-10-14T08:46:44+05:30 IST

చరిత్ర గల మహారాజా కళాశాలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలకు నిరసనగా విద్యార్థులు విజయనగరంలో రోడ్డెక్కారు. మంత్రి బొత్స సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించడానికి ...

‘మహారాజా’ మంటలు!

  • బొత్స ఇంటి ముట్టడికి యత్నం
  • అడ్డుకొని ఈడ్చేసిన పోలీసులు
  • చిరిగిన విద్యార్థుల దుస్తులు
  • ఎంఆర్‌ కాలేజీ పరిరక్షణ కోసం
  • పరీక్షల బహిష్కరణకు పిలుపు

దాసన్నపేట(విజయనగరం), అక్టోబరు 13: చరిత్ర గల మహారాజా కళాశాలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలకు నిరసనగా విద్యార్థులు విజయనగరంలో రోడ్డెక్కారు. మంత్రి బొత్స సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో, కొన్నిగంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. మహారాజా కాలేజీని అన్‌ఎయిడ్‌/ ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. ఎంఆర్‌ కాలేజీని పరిరక్షించుకొందాం అని నినది స్తూ ఎస్‌ఎ్‌ఫఐ నాయకత్వంలో వారంరోజులుగా విద్యార్థులు దీక్షలు, ధర్నాలు చేపడుతున్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లోగానీ, ప్రభుత్వంలోగానీ కదలిక లేకపోవడంతో ఉద్యమం ఉధృతం చేశారు. మూడులాంతర్ల సెంటరు మీదుగా బొత్స నివాసం ఉండే రోడ్డులోకి రావడానికి ప్రయత్నించారు. పోలీసులు నిలువరించినా విద్యార్థులు వెనుకడుగు వేయలేదు. 


అడ్డంకులను తొలగించుకొంటూ, ఎలాగైనా మంత్రి ఇంటి సమీపానికి వెళ్లాలని యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను  పోలీసులు రోడ్డు మీదనుంచి పక్కకు ఈడ్చేశారు. విద్యార్థుల చొక్కాలు, విద్యార్థినుల చున్నీలు పట్టుకొని లాగారు. బలవంతంగా పదిమందిని  అదుపులోకి తీసుకొని వాహనాల్లోకి ఎక్కించారు. కాగా, ఎంఆర్‌ కాలేజీ పరిరక్షణకు 16లోగా ప్రభుత్వం నిర్దిష్ట హామీని ఇవ్వాలని, లేదంటే డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరిస్తామని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సురేశ్‌, జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌ హెచ్చరించారు.

Updated Date - 2020-10-14T08:46:44+05:30 IST