Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశాకే.. సినిమా టికెట్‌ ధరల పెంపు

  • ఏపీ టికెట్‌ ధరలతో మాకు సంబంధం లేదు
  • థియేటర్లలో కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించాలి
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్య
  • సినీ నిర్మాతలు, దర్శకులతో సమావేశం


హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల్లోని థియేటర్లలో అమల్లో ఉన్న ధరలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో టికెట్‌ ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత.. వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) నూతన  కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఎ్‌ఫసీసీ చైర్మన్‌గా ప్రతాని రామకృష్ణ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌గా ఎ.గురురాజ్‌, నెహ్రూ, సెక్రటరీగా జె.వి.ఆర్‌, తెలంగాణ ‘మా’ ప్రెసిడెంట్‌గా రష్మీఠాకూర్‌, డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా రమేశ్‌ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం టాలీవుడ్‌ దర్శకనిర్మాతలతో మంత్రి భేటీ అయ్యారు

ఈ భేటీలో నిర్మాతలు దిల్‌ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ, సునీల్‌ నారంగ్‌, డీవీవీ దానయ్య, రాధాకృష్ణ, నవీన్‌, వంశీ, బాలగోవింద రాజు, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. కరోనా కారణంగా సినీపరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని.. ఇప్పుడిప్పుడే తేరుకుంటోందని గుర్తుచేశారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. థియేటర్ల యాజమాన్యాలు కొవిడ్‌ ప్రొటోకాల్‌ను, మార్గదర్శకాలను పాటించాలన్నారు. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తోంది. టీఎ్‌ఫసీసీకి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. సినీరంగ ప్రముఖులు మాట్లాడుతూ.. కొవిడ్‌ తర్వాత సినిమా నిర్మాణ వ్యయాలు అధికమయ్యాయన్నారు. టికెట్‌ ధర పెంపుతో సినిమా రంగాన్ని ఆదుకోవాలని  కోరారు. దీనిపై తలసాని స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశాక ఓ నిర్ణయం తీసుకుంటామని, ఏపీ విధానంతో తమకు సంబంధం లేదని చెప్పారు.

Advertisement
Advertisement