Abn logo
May 3 2021 @ 09:37AM

చదివింది ఇంటర్‌లోపే కానీ ముఖ్యమంత్రులు, మంత్రులయ్యారు!

ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా దానికి సరిపోయే చదువు ఉండాలి. కలెక్టర్ కావాలంటే ఏదో ఒక డిగ్రీ చదవాలి, డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాల్సిందే. కానీ ప్రజలను ఇంకా గట్టిగా మాట్లాడితే దేశాన్ని ముందుకు నడిపించే రాజకీయ నేతలు అవ్వాలంటే మాత్రం ఎటువంటి కనీస విద్యార్హతా అక్కర్లేదు. ప్రజలను ముందుండి నడిపించే నాయకుడికి విద్యార్హత కంటే, నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేదా? అన్నదే జనాలు ఎక్కువగా చూస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటే, విద్యార్హతతో సంబంధం లేకుండానే వారిని అందలాలు ఎక్కిస్తారు. ఎన్నో ఉన్నత పదవులు కూడా వారిని వరిస్తాయి. కొన్ని కొన్ని సార్లు కుటుంబ నేపథ్యాలు కూడా ఇందుకు కలిసి వస్తుంటాయి. మరి అలా తక్కువ చదువుతోనే, రాజకీయాల్లో ఉన్నత పదవులను పొందిన ఓ ఎనిమిది మంది నేతల గురించి ఓ లుక్కేయండి. 


రబ్రీ దేవి

రబ్రీ దేవి..

బిహార్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు చేసిన రబ్రీదేవి.. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత. 1997 నుంచి 2005 మధ్యలో సీఎంగా ఉన్న ఆమె అధికారిక క్యాండిటేట్ అఫిడవిట్‌లో ‘‘నాన్-మెట్రిక్’’ అని పేర్కొంది. అంటే ఆమె కనీసం పదో తరగతి కూడా చదవలేదు. 14 ఏళ్లకే వివాహం చేసుకున్న ఆమె.. అప్పటికి కేవలం ప్రాథమిక విద్య మాత్రమే నేర్చుకున్నట్లు సమాచారం.


గుల్జార్ సింగ్ రాణికే

గుల్జార్ సింగ్ రాణికే..

పంజాబ్ ప్రభుత్వంలో మాజీ మంత్రి అయిన రాణికే.. శిరోమణి అకాలీ దళ్ పార్టీ సభ్యులు. 2007 నుంచి 2017 మధ్య యానిమల్ హస్పెండరీ, డైరీ అండ్ ఫిషరీస్, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ వంటి కీలకమైన విభాగాల్లో మంత్రిగా సేవలు అందించారు. దీనికితోడు 2007-12 మధ్యలో స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ శాఖకు కూడా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇన్ని కీలకమైన పదవులు నిర్వహించిన ఈయన విద్యార్హత విషయానికొస్తే.. ఆయన కేవలం ప్రాథమిక విద్య(ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మాత్రమే పూర్తిచేశారు.


ఉమా భారతి

ఉమా భారతి..

బీజేపీకి చెందిన పాపులర్ నేతల్లో ఒకరైన ఈమె.. మద్యప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో పలు కీలక పదవులు నిర్వహించిన ఆమె.. ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవులు కూడా చేపట్టారు. 2000 నుంచి హ్యూమన్ రిసోర్సెస్ శాఖ, టూరిజం, యువజన వ్యవహారాలు, క్రీడలు, కోల్ అండ్ మైన్స్ శాఖలకు మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత 2014లో నీటి వనరులు, రివర్ డెవలప్‌మెంట్ అండ్ గంగా రిజువనేషన్ విభాగాలకు మంత్రిగా ఉన్నారు. 201719 మధ్య తాగునీరు, శానిటైజేషన్ మంత్రిగా పనిచేశారు. ఎలక్షన్ కమిషన్‌కు ఆమె సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె విద్యార్హత 6వ తరగతి.


తేజస్వీ యాదవ్

తేజస్వీ యాదవ్..

సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తాజా ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎదురు నిలబడి గట్టి పోటీ ఇచ్చిన నాయకుడు తేజస్వీ యాదవ్. 2015లో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ సభ్యుడిగా అసెంబ్లీకి ఎన్నికవడంతో తేజస్వీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పటి వరకూ క్రికెటర్ అవ్వడం కోసం ఆయన కష్టపడుతూ వచ్చారు. అయితే అక్కడ విఫలం అవడంతో రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. 26 ఏళ్ల వయసులో డిప్యూటీ సీఎం పదవి పొందిన తేజస్వీ.. భారతదేశంలో ఒక రాష్ట్రానికి అతి చిన్న వయసులో డిప్యూటీ సీఎం అయిన నేతగా రికార్డు సృష్టించారు. అయితే ఆయనకు ఆ పదవి పొందే అర్హత లేదంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇంతకీ తేజస్వీ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా? 9వ తరగతి. ఆ తర్వాత క్రికెటర్ అవ్వాలని చదువుకు స్వస్తి చెప్పేశారు.


తేజ్ ప్రతాప్ యాదవ్

తేజ్ ప్రతాప్ యాదవ్..

లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ వయసు.. సర్టిఫికెట్లలో మాత్రం తేజస్వీ కన్నా ఒక సంవత్సరం చిన్నవాడిగా నమోదైంది. తేజ్ ప్రతాప్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచి 2015లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మాహువా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 వరకూ నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ, పర్యావరణ శాఖ మంత్రులుగా సేవలందించారు. ఆయన అధికారిక పత్రాల్లో ఇంటర్మీడియట్ స్థాయి విద్యనభ్యసించినట్లు పేర్కొన్నా.. వికీపీడియాలో ఇంతకన్నా కచ్చితమైన సమాచారం ఉంది. తేజ్ ప్రతాప్ కూడా సోదరుడు తేజస్వీలాగే 9వ తరగతి ప్యాసయ్యారు.


అనంత్ గీతే

అనంత్ గీతే..

శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేతల్లో ఒకరైన అనంత్ గీతే.. మాజీ కేంద్రమంత్రి. భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రిగా గతంలో సేవలందించారు. పవర్ మినిస్టర్‌గా, ఆర్థిక శాఖ, బ్యాంకింగ్ అండ్ ఎక్స్‌పెండిచర్ విభాగం  సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. దాదాపు 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న గీతే.. విద్యార్హత మాత్రం కేవలం 10వ తరగతే.


విష్ణు డియో సాయి

విష్ణు డియో సాయి..

బీజేపీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉక్కు శాఖ కేంద్ర మాజీ సహాయమంత్రి విష్ణు డియో సాయి. ఆయన తన రాజకీయ ప్రస్థానంలో మరో రెండు కీలక పదవుల్లో సేవలందించారు. 2014-16 మధ్య మైన్స్ శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ శాఖల కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. రైతు కుటుంబానికి చెందిన విష్ణు.. ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురిలో ఉన్న లయోలా హైయర్ సెకండరీ స్కూల్‌లో 12వ తరగతి ప్యాసయ్యారు.


స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ..

కేంద్ర మంత్రి, గడిచిన నాలుగైదేళ్లలో బాగా గుర్తింపు పొందిన మహిళా రాజకీయ నేతల్లో స్మృతి ఇరానీ ఒకరు. ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో టెక్స్‌టైల్ విభాగం, మహిళ మరియు శిశు అభివృద్ధి శాఖల మంత్రిగా  ఉన్న ఆమె.. గతంలో సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ, అలాగే మానవ వనరుల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. స్మృతి ఇరానీ విద్యార్హతపై గతంలో చాలా ప్రశ్నలు తలెత్తాయి. అయితే 12వ తరగతి ప్యాసైన ఆమె.. చదువు కొనసాగించడం కోసం ఢిల్లీ యూనివర్సీటీలోని స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్‌లో చేరినట్లు సమాచారం.

Advertisement
Advertisement